వాహన విక్రయాలకు జన‘వర్రీ’!

2 Feb, 2016 00:45 IST|Sakshi
వాహన విక్రయాలకు జన‘వర్రీ’!

టాటా మోటార్స్, హోండా కార్స్
అమ్మకాల్లో క్షీణత
స్వల్ప వృద్ధిని సాధించిన మారుతీ

 న్యూఢిల్లీ: వాహన విక్రయాలు జనవరిలో మందగించాయి. దేశీయ విక్రయాల్లో మారుతీ సుజుకీ స్వల్ప వృద్ధిని సాధించగా, హ్యుందాయ్, ఫోర్డ్, మహీంద్రా కంపెనీలు ఒక్క అంకె వృద్ధినే సాధించాయి. మరోవైపు టాటా మోటార్స్, హోండా కార్స్ దేశీయ అమ్మకాలు క్షీణించాయి. నిల్వలు క్లియర్ చేసుకోవడానికి పలు కంపెనీలు గత ఏడాది చివరి నెల డిసెంబర్‌లో భారీగా డిస్కౌంట్‌లు ఇచ్చాయని, ఈ ప్రభావంతో జనవరి నెలలో అమ్మకాలు మందకొడిగా ఉన్నాయని డెలాయిట్ ఇండియా సీనియర్ డెరైక్టర్ సావన్ గొడియావాలా చెప్పారు.

మారుతీ సుజుకీ మొత్తం అమ్మకాలు (దేశీయ అమ్మకాలు, ఎగుమతులు)ఈ ఏడాది తొలి నెల జనవరిలో 3 శాతం తగ్గాయి. దేశీయ అమ్మకాలు స్వల్పంగా 0.8 శాతం పెరిగాయి. ఎగుమతులు 35 శాతం క్షీణించాయి.  హ్యుందాయ్ దేశీయ అమ్మకాలు 9 శాతం పెరిగాయి. ఎగుమతులు 38 శాతం తగ్గాయి. టాటా మోటార్స్ దేశీయ, వాణిజ్య ప్రయాణికుల వాహన విక్రయాలు 7 శాతం పెరిగాయి.

వాణిజ్య వాహన విక్రయాలు 20 శాతం, ఎగుమతులు 42 శాతం చొప్పున పెరిగాయి. ప్రయాణికుల వాహన విక్రయాలు మాత్రం 18 శాతం తగ్గాయి. టయోటా దేశీయ అమ్మకాలు 30%, ఎగుమతులు 54% చొప్పున తగ్గాయి. 2,000 సీసీ ఇంజిన్‌కు మించిన డీజిల్ వాహనాలపై ఢిల్లీలో నిషేధం కారణంగా అమ్మకాలు తగ్గాయ ని టయోటా సీనియర్ వైస్ ప్రెసిడెంట్ ఎన్. రాజా చెప్పారు.

మరిన్ని వార్తలు