కార్లపై ధరలు పెంచిన టాటా మోటార్స్‌

18 Jul, 2018 15:31 IST|Sakshi

న్యూఢిల్లీ : దేశంలో ప్రముఖ వాహన తయారీ కంపెనీ టాటా మోటార్స్‌, తన ప్యాసెంజర్‌ వాహనాల ధరలు పెంచింది. తన అన్ని మోడల్స్‌పై 2.2 శాతం వరకు ధరలు పెంచుతున్నట్టు ప్రకటించింది. ఇన్‌పుట్‌ ఖర్చులు పెరగడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు పేర్కొంది. ఆగస్టు నుంచి పెంచిన ధరలు అమల్లోకి వస్తాయని తెలిపింది. ఏప్రిల్‌లో కూడా కంపెనీ 3 శాతం మేర కార్ల ధరలు పెంచింది. ‘ వ్యయాల కోతకు ఎంతో ప్రయత్నిస్తున్నాం. కానీ ఇన్‌పుట్‌ ఖర్చులు పెరుగుతూనే పోతున్నాయి. దీంతో ఆగస్టు నుంచి మా ప్యాసెంజర్‌ వాహనాలపై ధరలు పెంచాలని నిర్ణయించాం’ అని టాటా మోటార్స్‌ ప్యాసెంజర్‌ వెహికిల్స్‌ బిజినెస్‌ యూనిట్‌ ప్రెసిడెంట్‌ మయాంక్‌ పరీక్‌ చెప్పారు. సుమారు 2 శాతం నుంచి 2.2 శాతం మధ్యలో కంపెనీ ధరలను పెంచుతున్నట్టు పరీక్‌ తెలిపారు. ఏప్రిల్‌లో కూడా ఇన్‌పుట్‌  ఖర్చులు పెరగడంతోనే ధరలను పెంచింది. ఏప్రిల్‌లో ధరలు పెంపు 3 శాతంగా ఉంది. 

టాటా మోటార్స్ ప్రస్తుతం ఎంట్రీ-లెవల్‌ చిన్న కారు నానో నుంచి ప్రీమియం ఎస్‌యూవీ హెక్సా వరకు మోడల్స్‌ను విక్రయిస్తోంది. వీటి ధరలు ఎక్స్‌షోరూం ఢిల్లీలో రూ.2.36 లక్షల నుంచి రూ.17.89 లక్షల మధ్యలో ఉన్నాయి. అయితే ధరల పెంపు, విక్రయాలపై పడుతుందా? అనే ప్రశ్నను పరీక్‌ కొట్టిపారేశారు. ఏప్రిల్‌లో ధరలు పెంచినప్పటికీ తమ మోడల్స్‌ను బాగానే విక్రయించామని, ఇదే మాదిరి విక్రయాలను తాము కొనసాగిస్తామని చెప్పారు. గత 28 నెలల నుంచి తాము విక్రయాల్లో మంచి ప్రదర్శనను కనబరుస్తున్నామని, ఈ క్వార్టర్‌లో ఇండస్ట్రీ 13.1 శాతం వృద్ధి చెందితే, తాము 52 శాతం వృద్ధి సాధించినట్టు పరీక్‌ పేర్కొన్నారు.    


 

మరిన్ని వార్తలు