టాటా మోటార్స్‌ నష్టాలు1,009 కోట్లు 

1 Nov, 2018 01:18 IST|Sakshi

ముంబై: టాటా మోటార్స్‌ కంపెనీకి ఈ ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసిక కాలంలో కన్సాలిడేటెడ్‌ ప్రాతిపదికన రూ.1,009 కోట్ల నికర నష్టాలొచ్చాయి. కంపెనీ అనుబంధ సంస్థ జాగ్వార్‌ ల్యాండ్‌ రోవర్‌ (జేఎల్‌ఆర్‌) పనితీరు బలహీనంగా ఉండటంతో ఈ స్థాయిలో నష్టాలు వచ్చాయి. గత ఆర్థిక సంవత్సరం ఇదే క్వార్టర్లో రూ.2,502 కోట్ల నికర లాభం వచ్చిందని టాటా మోటార్స్‌ తెలిపింది. అయితే సీక్వెన్షియల్‌గా చూస్తే, నికర నష్టాలు తగ్గాయని పేర్కొంది.  ఈ ఆర్థిక సంవత్సరం క్యూ1లో రూ.1,902 కోట్ల నష్టాలు వచ్చాయని వెల్లడించింది. గత క్యూ2లో రూ.69,839 కోట్లుగా ఉన్న కార్యకలాపాల ఆదాయం ఈ క్యూ2లో 3 శాతం పెరిగి రూ.72,112 కోట్లకు చేరింది. ఎబిటా మార్జిన్‌ 1.30 శాతం తగ్గి 9.9 శాతానికి చేరింది. 

11 శాతం తగ్గిన జేఎల్‌ఆర్‌ ఆదాయం.... 
స్టాండ్‌ అలోన్‌ ప్రాతిపదికన చూస్తే... గత క్యూ2లో రూ.283 కోట్ల నికర నష్టాలు రాగా, ఈ క్యూ2లో రూ.109 కోట్ల నికర లాభం వచ్చింది. కార్యకలాపాల ఆదాయం రూ.13,310 కోట్ల నుంచి రూ.17,759 కోట్లకు ఎగసింది. వాణిజ్య, ప్రయాణికుల వాహన విక్రయాలు జోరుగా ఉండటంతో మొత్తం వాహన విక్రయాలు 25 శాతం పెరిగి 1.90 లక్షలకు చేరాయి. జాగ్వార్‌ ల్యాండ్‌ రోవర్‌ ఆదాయం 11 శాతం తగ్గి 560 కోట్ల పౌండ్లకు చేరింది. ఎబిటా మార్జిన్‌ 2.1 శాతం పెరిగి 8.7 శాతానికి చేరింది.  

ఫలిస్తున్న టర్న్‌ అరౌండ్‌ వ్యూహం.. 
టర్న్‌ అరౌండ్‌ 2.0 వ్యూహాం మంచి ఫలితాలనిస్తోందని టాటా గ్రూప్‌ చైర్మన్‌ ఎన్‌. చంద్రశేఖరన్‌ చెప్పారు. నిర్వహణ, ఆర్థిక అంశాల పరంగా దేశీయ వ్యాపారం మరింతగా మెరుగుపడిందని వ్యాఖ్యానించారు. ప్రయాణీకుల వాహనాలు, వాణిజ్య వాహనాల విభాగాల్లో మార్కెట్‌ వాటా పెరగడమే కాకుండా, లాభదాయకత కూడా మెరుగుపడిందని వివరించారు.  

మరిన్ని వార్తలు