టాటా మోటార్స్‌ లాభం 49% డౌన్‌ 

20 May, 2019 23:57 IST|Sakshi

రూ.1,109 కోట్లుగా నమోదు 

న్యూఢిల్లీ: టాటా మోటార్స్‌ కన్సాలిడేటెడ్‌ లాభం మార్చి త్రైమాసికంలో 49 శాతం తగ్గి రూ.1,109 కోట్లకు పరిమితం అయింది. అంతక్రితం ఏడాది ఇదే కాలంలో లాభం రూ.2,175 కోట్లుగా ఉంది. మొత్తం ఆదాయం క్రితం ఏడాది ఇదే కాలంలో పోలిస్తే రూ.91,643 కోట్ల నుంచి రూ.87,285 కోట్లకు తగ్గింది. 2018–19 పూర్తి ఆర్థిక సంవత్సరానికి కన్సాలిడేటెడ్‌గా రూ.28,724 కోట్ల నష్టాన్ని కంపెనీ ప్రకటించింది. ఆదాయం రూ.3,04,903 కోట్లుగా ఉంది. 2017–18 ఆర్థిక సంవత్సరంలో కంపెనీ లాభం రూ.9,091 కోట్లు, ఆదాయం రూ.2,96,298 కోట్లుగా ఉండడం గమనార్హం.

అంతర్జాతీయ మార్కెట్లలో జేఎల్‌ఆర్‌ రూపంలో టాటా మోటార్స్‌ సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. టాటా మోటార్స్‌ స్టాండలోన్‌గా (దేశీయ వ్యాపారం) చూసుకుంటే మార్చి త్రైమాసికంలో రూ.106 కోట్ల లాభం వచ్చింది. ఆదాయం రూ.18,561 కోట్లుగా ఉంది. 2018–19 పూర్తి ఆర్థిక సంవత్సరంలో స్టాండలోన్‌గా రూ.2,398 కోట్ల లాభాన్ని గడించింది. అంతక్రితం ఆర్థిక సంవత్సరంలో రూ.946 కోట్ల నష్టాన్ని చవిచూడడం గమనార్హం. స్టాండలోన్‌ ఆదా యం రూ.58,689 కోట్ల నుంచి రూ.69,202 కోట్లకు పెరిగింది. బీఎస్‌ఈలో టాటా మోటార్స్‌ షేరు 7 శాతానికి పైగా లాభపడి రూ.190 వద్ద క్లోజయింది. 

మరిన్ని వార్తలు