దేశీ వ్యాపారాన్ని లాభాల్లోకి తెస్తాం

23 Aug, 2017 01:12 IST|Sakshi
దేశీ వ్యాపారాన్ని లాభాల్లోకి తెస్తాం

వాణిజ్య వాహనాల విభాగంపై ప్రత్యేక దృష్టి  
టాటా మోటార్స్‌ చీఫ్‌ చంద్రశేఖరన్‌ ఆశాభావం  


ముంబై: టాటా మోటార్స్‌ దేశీ వ్యాపారాన్ని మళ్లీ లాభాల్లోకి మళ్లించడంపై దృష్టి పెడుతున్నట్లు టాటా గ్రూపు చైర్మన్‌ ఎన్‌.చంద్రశేఖరన్‌ చెప్పారు. ముఖ్యంగా సమస్యాత్మక పరిస్థితులతో ప్రతికూల ప్రభావాలెదుర్కొన్న వాణిజ్య వాహనాల విభాగంపై మరింతగా కసరత్తు చేయనున్నట్లు తెలియజేశారు. టాటా మోటార్స్‌కు కూడా చైర్మన్‌గా వ్యవహరిస్తున్న చంద్రశేఖరన్‌... చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టిన అనంతరం తొలిసారిగా టాటా మోటార్స్‌ వార్షిక సర్వసభ్య సమావేశంలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ... 2016–17లో టాటా మోటార్స్‌ స్టాండెలోన్‌ ప్రాతిపదికన స్థూల ఆదాయం 3.6 శాతం వృద్ధితో రూ. 49,100 కోట్లకు చేరగా.. పన్నుల అనంతరం నష్టం రూ. 62 కోట్ల నుంచి రూ. 2,480 కోట్లకు పెరిగిందని తెలియజేశారు. పెద్ద నోట్ల రద్దు, జీఎస్‌టీ అమలుతో పాటు బీఎస్‌ 3 నుంచి బీఎస్‌ 4 ప్రమాణాలకు మారాల్సిందేనన్న సుప్రీం కోర్టు ఆదేశాలు మొదలైన వాటి రూపంలో వాణిజ్య వాహనాల వ్యాపారం పలు సవాళ్లు, అనిశ్చితి పరిస్థితిని ఎదుర్కొనాల్సి రావడమే ఇందుకు కారణమని చెప్పారు.

మరోవైపు, మార్కెట్‌ను అందుకోలేకపోవడం సైతం కంపెనీకి ప్రతికూలంగా మారిందన్నారు. అయిదేళ్ల క్రితం 60 శాతంగా ఉన్న మార్కెట్‌ వాటా ఈ ఏడాది మార్చి నాటికి 44.4 శాతానికి పడిపోయిందని చెప్పారు. గడచిన మూడేళ్లుగా వాణిజ్య వాహనాల పరిమాణం 3,20,000 యూనిట్లకు దరిదాపుల్లోనే కొనసాగుతూనే ఉన్నప్పటికీ.. నిర్వహణ వ్యయాలు గణనీయంగా పెరిగాయని పేర్కొన్నారు. కంపెనీ పనితీరుపై ఇవన్నీ ప్రభావం చూపాయని చంద్రశేఖరన్‌ వివరించారు.

నెక్సాన్‌పై ఆశలు..
ఈ ఏడాది సెప్టెంబర్‌లో ప్రవేశపెట్టబోయే నెక్సాన్‌ కారు అమ్మకాలు ఆశావహంగా ఉండగలవని భావిస్తున్నట్లు చంద్రశేఖరన్‌ చెప్పారు. ఎటువంటి జాప్యాలు లేకుండా కొత్త ఉత్పత్తులను గడువులోగా ప్రవేశపెట్టడం, మళ్లీ మార్కెట్‌ వాటాను మెరుగుపర్చుకోవడం, వ్యయాలను నియంత్రించుకోవడం వంటి అంశాలపై దృష్టి పెట్టనున్నట్లు చెప్పారు. ప్యాసింజర్‌ వాహనాల విభాగంలో దేశీయంగా మార్కెట్‌ వాటాను మెరుగుపర్చుకోగలిగినప్పటికీ.. ప్రస్తుత, భవిష్యత్‌ ఉత్పత్తులపై పెట్టుబడుల కారణంగా వ్యయాలు సైతం పెరిగాయన్నారు.

నానో ఆపేయాలన్నది ఏకగ్రీవ నిర్ణయం: మిస్త్రీ
  నష్టాల్లోని నానో కారు ప్రాజెక్టును లాభాల్లోకి మళ్లించేందుకు చేసిన ప్రయత్నాలన్నీ వృధా కావడంతో.. కార్ల తయారీ నిలిపివేయాలని టాటా మోటార్స్‌ ఏడాది క్రితమే ఏకగ్రీవ నిర్ణయం తీసుకుందని టాటా సన్స్‌ మాజీ చైర్మన్‌ సైరస్‌ మిస్త్రీ తెలిపారు. నానో కారు, చిన్న వాణిజ్య వాహనాల విభాగంలో (ఎస్‌సీవీ)  రిస్కులను తగిన స్థాయిలో మదింపు చేయకుండా రుణాలివ్వడం వల్ల కంపెనీకి, టాటా మోటార్‌ ఫైనాన్స్‌కి దాదాపు రూ. 4,000 కోట్ల మేర మొండిబాకీల రూపంలో నష్టం వాటిల్లిందని ఆయన పేర్కొన్నారు. 2016–17 వార్షిక నివేదికలో కొత్త చైర్మన్‌ ఎన్‌ చంద్రశేఖరన్‌ చేసిన వ్యాఖ్యలపై వివరణ ఇస్తూ మిస్త్రీ ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు.

>
మరిన్ని వార్తలు