మార్కెట్లోకి టాటా ఎలక్ట్రిక్‌ ఎస్‌యూవీ

20 Dec, 2019 06:00 IST|Sakshi

నెక్సాన్‌ ఈవీ.. మూడు వేరియంట్లలో లభ్యం 

ఒక్క సారి చార్జింగ్‌.. 300 కి.మీ. ప్రయాణం 

రూ.15–17 లక్షల రేంజ్‌లో ధర

ముంబై: వాహన దిగ్గజం టాటా మోటార్స్‌ తన పాపులర్‌ ఎస్‌యూవీ మోడల్, నెక్సాన్‌లో ఎలక్ట్రిక్‌ వేరియెంట్‌.. నెక్సాన్‌ ఈవీని గురువారం ఆవిష్కరించింది. ఒక్కసారి చార్జింగ్‌ చేస్తే 300 కిలోమీటర్లు కంటే ఎక్కువగానే ప్రయాణించే ఈ వాహన విక్రయాలను మరికొన్ని వారాల్లోనే ప్రారంభిస్తామని టాటా మోటార్స్‌ తెలిపింది. గంటకు వంద కిలోమీటర్ల వేగాన్ని 9.9 సెకన్లలోనే ఈ వాహనం అందుకోగలదని టాటా మోటార్స్‌ సీఈఓ, ఎమ్‌డీ గుంటర్‌ బశ్చెక్‌ చెప్పారు. నేటి (శుక్రవారం) నుంచే బుకింగ్స్‌ మొదలుపెడతామని, ఆన్‌లైన్‌లో కూడా ఈ కారును బుక్‌ చేసుకోవచ్చని తెలిపారు.

మూడు వేరియంట్లలో లభ్యమయ్యే ఈ వాహనం ధర రూ.15–17 లక్షలు  రేంజ్‌లో ఉంటుందని పేర్కొన్నారు.  ఎనిమిదేళ్లు లేదా 1.6 లక్షల కి.మీ. వారంటీని ఇస్తున్నామని, పరిశ్రమలో ఇదే అత్యధిక వారంటీ అని వివరించారు. ఈ వాహన బ్యాటరీని ఫాస్ట్‌ చార్జింగ్‌ మోడ్‌లో చార్జింగ్‌ చేస్తే గంటలోనే 80 శాతం మేర చార్జింగ్‌ అవుతుందని కంపెనీ ఎలక్ట్రిక్‌ మొబిలిటీ యూనిట్‌  ప్రెసిడెంట్‌ శైలేష్‌ చంద్ర చెప్పారు. 15 యాంపియర్‌ ప్లగ్‌ పాయింట్‌ ద్వారా కూడా ఈ వాహన బ్యాటరీని చార్జింగ్‌ చేయవచ్చని వివరించారు. జిప్‌ట్రాన్‌ పవర్‌ట్రైన్‌ టెక్నాలజీతో రూపొందిన ఈ వాహనంలో 30.3 కిలోవాట్‌ఆవర్‌  హై ఎనర్జీ డెన్సిటీ లిథియమ్‌ అయాన్‌ బ్యాటరీ ప్యాక్‌ ఉంటుందని పేర్కొన్నారు.

రెండో ఎలక్ట్రిక్‌ వాహనం....
టాటా మోటార్స్‌ నుంచి వస్తోన్న రెండో ఎలక్ట్రిక్‌ వాహనం ఇది. ఇంతకు ముందు ఈ కంపెనీ టిగోర్‌లో ఒక ఎలక్ట్రిక్‌ వాహనాన్ని అందుబాటులోకి తెచ్చింది. ట్యాక్సీ ఆపరేటర్లను దృష్టిలో పెట్టుకొని తెచ్చిన టిగోర్‌ ఈవీకి మంచి స్పందన లభిస్తోందని శైలేష్‌ చంద్ర పేర్కొన్నారు. ఒక్కో టిగోర్‌ ఈవీ వల్ల  ట్యాక్సీ ఆపరేటర్లకు రూ.7,000 ఆదా అవుతున్నాయని వివరించారు. దీని రేంజ్‌ 150 కి.మీ. అని, ఇప్పుడు 300 కి.మీ. రేంజ్‌ ఉండే నెక్సాన్‌ ఈవీను అందుబాటులోకి తెస్తున్నామని తెలిపారు. టిగోర్‌ ఈవీని ట్యాక్సీ ఆపరేటర్ల కోసం తెస్తే, నెక్సాన్‌ ఈవీని వ్యక్తిగత వినియోగదారుల కోసం తెస్తున్నామని వివరించారు.

మరిన్ని వార్తలు