టాటా కమ్యూనికేషన్స్‌లో టాటా పవర్‌ వాటా విక్రయం

27 Mar, 2018 01:40 IST|Sakshi

రూ.2,150 కోట్లకు టాటా సన్స్‌ కొనుగోలు

ముంబై: టాటా గ్రూపు పరిధిలో ఒక కంపెనీ మరో కంపెనీలో వాటాలను తగ్గించుకోవాలన్న కార్యక్రమంలో భాగంగా మరో అడుగు ముందుకు పడింది. టాటా కమ్యూనికేషన్స్‌లో తనకున్న వాటాలను, అనుబంధ సంస్థ ప్యానటోన్‌ ఫిన్‌వెస్ట్‌ను మాతృ సంస్థ టాటాసన్స్‌కు రూ.2,150 కోట్లకు విక్రయించాలని టాటా పవర్‌ నిర్ణయించింది. దీనికి టాటా పవర్‌ బోర్డు ఆమోదం తెలిపింది. టాటా కమ్యూనికేషన్స్‌లో ప్యానటోన్‌ ఫిన్‌వెస్ట్‌కు 30.1 శాతం వాటా ఉంది.

ప్రాధాన్యేతర ఆస్తులను నగదుగా మార్చుకోవడం, మలి దశ వృద్ధికి గాను బ్యాలన్స్‌ షీటును బలోపేతం చేసుకునేందుకే ఈ విక్రయమని కంపెనీ తెలిపింది. ఈ వాటాల విక్రయం ద్వారా రూ.2,150 కోట్లు సమకూరనున్నట్టు అంచనా వేస్తున్నామని పేర్కొంది. గతేడాది ఫిబ్రవరిలో టాటా గ్రూపు చైర్మన్‌గా ఎన్‌.చంద్రశేఖరన్‌ వచ్చాక గ్రూపు కంపెనీల మధ్య స్థిరీకరణపై దృష్టి పెట్టారు. టాటా గ్రూపునకు 30 లిస్టెడ్‌ కంపెనీలుండగా, చాలా కంపెనీలు మరో కంపెనీలో వాటాలు కలిగి ఉన్నాయి.

అదే సమయంలో మాతృ సంస్థ టాటా సన్స్‌కు మాత్రం గ్రూపు కంపెనీల ఈక్విటీలో మూడో వంతే వాటాలుండటం ఆయన నిర్ణయానికి కారణం. ఇందులో భాగంగా టాటా స్టీల్, టాటా మోటా ర్స్‌ పరస్పర వాటాలను తగ్గించుకున్నాయి.

మరిన్ని వార్తలు