ట్రెంట్‌ లాభం 37 శాతం అప్‌ 

30 Apr, 2019 08:37 IST|Sakshi

ఒక్కో షేర్‌కు రూ.1.30 డివిడెండ్‌ 

న్యూఢిల్లీ: టాటా గ్రూప్‌ రిటైల్‌ సంస్థ, ట్రెంట్‌ నికర లాభం గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసిక కాలంలో 37 శాతం పెరిగింది. అంతకు ముందటి ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసిక కాలంలో రూ.12 కోట్లుగా ఉన్న నికర లాభం గత క్యూ4లో రూ.16 కోట్లకు పెరిగిందని ట్రెంట్‌ తెలిపింది. మొత్తం ఆదాయం రూ.539 కోట్ల నుంచి 26 శాతం వృద్ధితో రూ.677 కోట్లకు పెరిగిందని ట్రెంట్‌ చైర్మన్‌ నోయల్‌ ఎన్‌. టాటా చెప్పారు.. మొత్తం వ్యయాలు రూ.522 కోట్ల నుంచి రూ.659 కోట్లకు పెరిగాయని తెలిపారు. ఒక్కో షేర్‌కు రూ.1.30 డివిడెండ్‌ను ఇవ్వనున్నామని, డివిడెండ్‌ డిస్ట్రిబ్యూషన్‌ ట్యాక్స్‌(డీడీటీ)తో కలుపుకుంటే మొత్తం డివిడెండ్‌ చెల్లింపులు రూ.52.08 కోట్లవుతాయని వివరించారు. గత క్యూ4లో తమ సంస్థ బ్రాండ్, వెస్ట్‌సైడ్‌ కొత్తగా 27 స్టోర్స్‌ను ప్రారంభించిందని  గతంలో ఏ సంవత్సరంలోనూ ఈ స్థాయిలో స్టోర్స్‌ను ఏర్పాటు చేయలేదని పేర్కొన్నారు.  

పూర్తి ఆర్థిక సంవత్సరంలో రూ.127 కోట్ల లాభం  
ఇక పూర్తి ఆర్థిక సంవత్సరం పరంగా చూస్తే, 2017–18లో రూ.117 కోట్లుగా ఉన్న నికర లాభం గత ఆర్థిక సంవత్సరంలో రూ.127 కోట్లకు పెరిగిందని నోయల్‌ తెలిపారు. ఆదాయం రూ.2,109 కోట్ల నుంచి రూ.2,568 కోట్లకు పెరిగింది. గత శుక్రవారం బీఎస్‌ఈలో ట్రెంట్‌ షేర్‌ 0.7% నష్టంతో రూ.355 వద్ద ముగిసింది.

మరిన్ని వార్తలు