టాటా ఎస్‌ఐఏ ఎయిర్‌లైన్స్‌కు 20 ఎయిర్‌బస్‌లు

4 Jun, 2014 00:51 IST|Sakshi
టాటా ఎస్‌ఐఏ ఎయిర్‌లైన్స్‌కు 20 ఎయిర్‌బస్‌లు

దోహా: టాటా-ఎస్‌ఐఏ ఎయిర్‌లైన్స్ సంస్థ సింగపూర్‌కు చెందిన  బీఓసీ ఏవియేషన్ ప్రైవేట్ కంపెనీ నుంచి 20 ఎయిర్‌బస్ విమానాలను లీజుకు తీసుకోనున్నది. ఈ సెప్టెంబర్-అక్టోబర్ నుంచి ఈ విమానాలను టాటా-ఎస్‌ఐఏకు అందజేయడం ప్రారంభిస్తామని  బీఓసీకు చెందిన ఇన్వెస్టర్ రిలేషన్స్ హెడ్ క్లెయిరీ లియో వెల్లడించారు. ఇక్కడ జరుగుతున్న ఐఏటీఏ వార్షిక సాధారణ సమావేశంలో పాల్గొనడానికి వచ్చిన ఆమె ఈ వివరాలు తెలిపారు. కాగా ఈ సంస్థ ఇప్పటికే జెట్ ఎయిర్‌వేస్, స్పైస్‌జెట్- ఈ రెండు భారత విమానయాన సంస్థలకు కొన్ని విమానాలను లీజుకు ఇచ్చింది.

 టాటా సన్స్ సంస్థ సింగపూర్ ఎయిర్‌లైన్స్‌తో కలిసి 51:49 భాగస్వామ్యంతో టాటా-ఎస్‌ఐఏ ఎయిర్‌లైన్స్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఈ సంస్థ ఏ 320-200, ఏ 320-200(నియో) విమానాల ద్వారా తన సర్వీసులనందజేయనున్నది. ఈ ఏడాది సెప్టెంబర్ కల్లా భారత్‌లో కార్యకలాపాలు ప్రారంభించనున్నది. ఢిల్లీ కేంద్రంగా ముంబై, గోవా, పాట్నా, చంఢీగర్, శ్రీనగర్, హైదరాబాద్, బెంగళూరు తదితర నగరాలకు విమాన సర్వీసులను నిర్వహించాలని  ఈ సంస్థ యోచిస్తోంది.

 

ఆ తర్వాత పుణే, లక్నో, వారణాసి, జైపూర్, కోల్‌కత, అమృత్‌సర్, బగ్‌దోగ్రా, ఇండోర్, కొచ్చిన్‌లకు విమాన సర్వీసులను విస్తరించనున్నది. ఈ సంస్థ విమానయాన సర్వీసులకు అనుమతిని ఇంకా పొందలేదు. కాగా టాటా గ్రూప్, ఢిల్లీకి చెందిన టెలిస్ట్రాలు భారత వెంచర్ భాగస్వాములుగా ఉన్న ఎయిర్ ఏషియా విమాన సర్వీసులు ఈ నెలలోనే ప్రారంభం కానున్నాయి.

>
మరిన్ని వార్తలు