వచ్చే త్రైమాసికానికి సాధారణ స్థితి: టాటా స్టీల్‌

3 Jan, 2017 01:38 IST|Sakshi
వచ్చే త్రైమాసికానికి సాధారణ స్థితి: టాటా స్టీల్‌

నవంబర్‌ కంటే డిసెంబర్‌లో పరిస్థితులు మెరుగు
జంషెడ్‌పూర్‌: పెద్ద నోట్ల రద్దు తర్వాత ఏర్పడిన ప్రతికూలతల నుంచి వచ్చే త్రైమాసికం నాటికి సాధారణ స్థితికి చేరుకుంటామని టాటా స్టీల్‌ ఆశాభావం వ్యక్తం చేసింది. నవంబర్‌ 8న కేంద్రం డీమానిటైజేషన్‌ను ప్రకటించిన విషయం తెలిసిందే. నవంబర్‌తో పోలిస్తే డిసెంబర్‌లో విక్రయాలు మెరుగ్గా ఉన్నాయని టాటా స్టీల్‌ ఎండీ టీవీ నరేంద్రన్‌ పేర్కొన్నారు. గత రెండేళ్ల కాలంలో దేశీయంగా స్టీల్‌ రంగం క్లిష్ట పరిస్థితులను చవి చూసిందన్నారు. చైనా సహా, ఇతర దేశాల నుంచి దేశంలోకి భారీ ఎత్తున స్టీల్‌ దిగుమతి అవుతున్న తరుణంలో కేంద్రం జోక్యం చేసుకుని దేశీయ స్టీల్‌ పరిశ్రమకు మద్దతుగా నిలిచిందని పేర్కొన్నారు.

గత పదేళ్ల కాలంలో ఈ రంగంలో రూ.3 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టడం జరిగిందని... దేశ అభివృద్ధిలో ఈ రంగం కీలక పాత్ర పోషించిందన్నారు. దేశీయ స్టీల్‌ పరిశ్రమను ఆదుకునేందుకు ప్రభుత్వం చేపట్టిన చర్యల్ని నరేంద్రన్‌ అభినందించారు. 2016 ప్రారంభం నుంచి అంతర్జాతీయ మార్కెట్లో డిమాండ్‌ పెరగడంతో పరిస్థితులు మెరుగుపడ్డాయని వివరించారు. అయితే, గత మూడు, నాలుగు నెలల కాలంగా స్టీల్‌ ముడి సరుకైన ఐరన్‌ ఓర్, బొగ్గు ధరలు పెరిగిపోవడంతో ఒత్తిడి నెలకొందని, ఇక డీమానిటైజేషన్‌ రావడం తమ కంపెనీ పనితీరును దెబ్బతీసినట్టు చెప్పారు.

మరిన్ని వార్తలు