టాటాస్టీల్ అమ్మకాల ‘కోరస్’..!

31 Mar, 2016 01:39 IST|Sakshi
టాటాస్టీల్ అమ్మకాల ‘కోరస్’..!

విక్రయానికి బ్రిటన్ వ్యాపారం
క్షీణించిన ఆర్థిక పరిస్థితులే కారణం
జాతీయం చేయాలని ఉద్యోగుల డిమాండ్
ప్రత్యామ్నాయాల పరిశీలనలో బ్రిటన్...

లండన్/ముంబై: దాదాపు దశాబ్దం క్రితం బిలియన్ల కొద్దీ డాలర్లు వెచ్చించి మరీ బ్రిటన్‌లో దక్కించుకున్న ఉక్కు వ్యాపారాన్ని అమ్మకానికి పెట్టాలని నిర్ణయించింది దేశీ దిగ్గజం టాటా స్టీల్. ఉక్కుకు డిమాండ్ తగ్గి ధరలు పడిపోవడం, ఆర్థిక పరిస్థితులు అంతకంతకూ క్షీణిస్తుండటమే ఇందుకు కారణం. ముంబై ప్రధాన కార్యాలయంలో బోర్డు సుదీర్ఘ సమావేశం అనంతరం టాటా స్టీల్ బుధవారం ఈ మేరకు ప్రకటన చేసింది. గడిచిన ఏడాది కాలంగా అనుబంధ సంస్థ టాటా స్టీల్ యూకే ఆర్థిక పనితీరు దిగజారుతుండటంతో కంపెనీని పూర్తిగా లే దా విభాగాల వారీగా విక్రయించడం సహా ఇతర పునర్‌వ్యవస్థీకరణ అవకాశాలన్నింటినీ పరిశీలించాలని నిర్ణయించినట్లు వెల్లడించింది.

ఈ మేరకు టాటా స్టీల్ యూరప్‌నకు తగు సూచనలు ఇచ్చినట్లు తెలిపింది. ‘అంతర్జాతీయంగా ఉక్కు సరఫరా పెరిగిపోవడం, యూరప్‌లోకి వర్థమాన దేశాల నుంచి దిగుమతులు ఎక్కువ కావడం, తయారీ వ్యయాలు భారీగా పెరగడంతో పాటు దేశీయంగా ఉక్కు డిమాండ్ తగ్గడం, కరెన్సీ హెచ్చుతగ్గులు మొదలైనవి ప్రస్తుత నిర్ణయానికి కారణం. భవిష్యత్‌లోనూ ఇవి కొనసాగే అవకాశముంది. ఇటీవలి కాలంలో పరిస్థితిని మెరుగుపర్చేందుకు యాజమాన్యం, సిబ్బంది కలసి అనేక చర్యలు తీసుకున్నప్పటికీ ఫలితం లేకపోయింది’ అని టాటా స్టీల్ పేర్కొంది. గడిచిన నాలుగు త్రైమాసికాల్లో బ్రిటన్ కార్యకలాపాల బుక్ వేల్యూ సున్నా స్థాయిలోనే ఉందని టాటా గ్రూప్ ఈడీ (ఫైనాన్స్) కౌశిక్ చటర్జీ చెప్పారు. పరిస్థితిని చక్కదిద్దేందుకు బ్రిటన్ ప్రభుత్వంతో కలసి పనిచేస్తున్నామన్నారు. మరోవైపు, టాటా స్టీల్ యూకే వ్యాపారాన్ని అమ్మకానికి ఉం చినా.. ప్రస్తుత పరిస్థితుల్లో కొనుగోలుదారులెవరూ ముందుకు రాకపోవచ్చని పరిశ్రమ వర్గాలు అభిప్రాయపడ్డాయి.

 టాటా స్టీల్ విక్రయ పరిణామాలపై చర్చించేందుకు బ్రిటన్ ప్రధాని డేవిడ్ కామెరాన్ గురువారం అత్యవసర సమావేశం నిర్వహించనున్నట్లు సమాచారం. కుటుంబంతో కలసి విదేశాల్లో సెల వులు గడుపుతున్న కామెరాన్.. తన ట్రిప్‌ను మధ్యలోనే ముగించుకుని, తిరిగి రానున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.

 ఉద్యోగుల భవిష్యత్ అగమ్యగోచరం..
తాజా పరిణామంతో టాటా స్టీల్ యూకే వ్యాపార విభాగంలో పనిచేస్తున్న వేలకొద్దీ ఉద్యోగుల భవిష్యత్ అగమ్యగోచరంగా మారనుంది. దీంతో అక్కడి కార్మిక సంఘాలు సంస్థను జాతీయం చేయాలని బ్రిటన్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశాయి. యూకే, ఐర్లాండ్‌లో కలిపి టాటా స్టీల్‌కు మూడు ప్లాంట్లు (పోర్ట్ టాల్బోట్, రోథర్హామ్, స్కన్‌థోర్ప్) ఉన్నాయి. వీటి వార్షికోత్పత్తి సామర్థ్యం సుమారు 11 మిలియన్ టన్నులు. బ్రిటన్‌లోని స్టీల్ ప్లాంట్లలో దాదాపు 15,000 మంది పైచిలుకు ఉద్యోగులు ఉన్నారు. వారి ప్రయోజనాలను కాపాడేందుకు అన్ని విధాలుగా ప్రయత్నిస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. తగిన కొనుగోలుదారును అన్వేషిస్తామని పేర్కొంది. వేల కొద్దీ ఉద్యోగులను కాపాడేందుకు అవసరమైతే టాటా స్టీల్ యూకేలో భాగమైన పోర్ట్ టాల్బోట్ ప్లాంటులో తాత్కాలికంగా కొన్ని వాటాలు కొనుగోలు చేయడం సహా జాతీయకరణ తదితర ప్రత్యామ్నాయ అవకాశాలన్నింటినీ పరిశీలిస్తున్నట్లు బ్రిటన్ వాణిజ్య మంత్రి ఆనా సోబ్రీ పేర్కొన్నారు.

 కంపెనీకి సానుకూలం: రేటింగ్ ఏజెన్సీలు
బ్రిటన్ కార్యకలాపాలను పునర్‌వ్యవస్థీకరించుకోవాలన్న నిర్ణయం టాటా స్టీల్ రుణ పరపతి మెరుగుపడటానికి సానుకూలాంశమని రేటింగ్ ఏజెన్సీ ఎస్‌అండ్‌పీ తెలిపింది. అయితే, పూర్తి ప్రణాళిక సిద్ధమయ్యే దాకా రేటింగ్‌ను అప్‌గ్రేడ్ చేయలేమని పేర్కొంది. బ్రిటన్ వ్యాపారం అమ్మక ప్రతిపాదన వార్తలతో బీఎస్‌ఈలో టాటాస్టీల్ షేరు ధర 6.75% ఎగసి రూ. 324 వద్ద ముగిసింది.

 కోరస్‌తో ఎంట్రీ..
2007లో ఆంగ్లో-డచ్ స్టీల్ దిగ్గజం కోరస్‌ను కొనుగోలు చేయడం ద్వారా టాటా గ్రూప్ బ్రిటన్ ఉక్కు రంగంలో అడుగుపెట్టింది. అప్పట్లో బ్రెజిల్‌కి చెందిన సీఎస్‌ఎన్ సంస్థతో నెలల తరబడి హోరాహోరీగా పోటీపడి సుమారు 14 బిలియన్ డాలర్లకు పైగా వెచ్చించి మరీ కోరస్‌ను టేకోవర్ చేసింది. దీనికోసం సమీకరించిన భారీ రుణాలే కంపెనీని వెన్నాడుతున్నాయి.  మొత్తం మీద 25 మిలియన్ టన్నుల వార్షిక ఉక్కు ఉత్పత్తి సామర్థ్యంతో ప్రపంచంలోనే అయిదో అతి పెద్ద స్టీల్ తయారీ సంస్థగా టాటా స్టీల్ ఆవిర్భవించింది. అలాగే ఫార్చూన్ 500 బహుళ జాతి సంస్థల జాబితాలో చోటు దక్కించుకున్న తొలి భారతీయ కంపెనీగా నిల్చింది. ఉక్కుకు డిమాండ్ కొనసాగిన పక్షంలో కంపెనీ గట్టిగానే నిలదొక్కుకునేది. కానీ, ఆ తర్వాత ఏడాదే అంతర్జాతీయంగా ఆర్థిక సంక్షోభం తలెత్తడంతో పరిస్థితులు నానాటికీ దిగజారుతూ వస్తున్నాయి. గత అయిదేళ్లలో టాటా గ్రూప్ దాదాపు 2 బిలియన్ పౌండ్ల మేర నష్టపోయింది.

>
మరిన్ని వార్తలు