టాటా స్టీల్‌కు ‘అసాధారణ’ లాభం !

17 May, 2018 00:46 IST|Sakshi

క్యూ4లో రూ.14,688 కోట్లు...

బ్రిటన్‌ వ్యాపార పునర్‌వ్యవస్థీకరణతో

రూ.11,376 కోట్ల వన్‌టైమ్‌ రాబడి

ఆదాయం రూ.36,407 కోట్లు 

న్యూఢిల్లీ: టాటా స్టీల్‌ మార్చితో ముగిసిన త్రైమాసికంలో అంచనాలకు తగ్గ ఫలితాలను ప్రకటించింది. కన్సాలిడేటెడ్‌ ప్రాతిపదికన రూ.14,668 కోట్ల లాభాన్ని ఆర్జించింది. బ్రిటన్‌ వ్యాపార పునర్‌వ్యవస్థీకరణలో భాగంగా  వచ్చిన రూ.11,376 కోట్ల వన్‌టైమ్‌ ఆదాయం ఈ స్థాయిలో లాభం పెరగడానికి కారణమైంది. క్రితం ఏడాది ఇదే కాలంలో కంపెనీకి రూ.1,168 కోట్ల నష్టం రావడం గమనార్హం. ఈ మేరకు జనవరి–మార్చి త్రైమాసిక ఫలితాలను బీఎస్‌ఈకి కంపెనీ తెలియజేసింది. కన్సాలిడేటెడ్‌ ఆదాయం రూ.36,407 కోట్లుగా నమోదైంది. క్రితం ఏడాది ఇదే కాలంలో ఆదాయం రూ.35,457 కోట్లతో పోలిస్తే 2 శాతానికి పైగా పెరిగినట్టు తెలుస్తోంది. దేశీయంగా ఉత్పత్తి ఈ క్వార్టర్లో 3 మిలియన్‌ టన్నుల మేర తగ్గింది.

క్రితం ఏడాది ఇదే కాలంలో పోలిస్తే వ్యయాలు రూ.31,132 కోట్ల నుంచి రూ.32,626 కోట్లకు పెరిగిపోయాయి. 2017–18లో కంపెనీ పనితీరు చాలా మెరుగ్గా ఉందని ఎండీ, సీఈవో టీవీ నరేంద్రన్‌ పేర్కొన్నారు. కంపెనీ బలమైన నిర్వహణ విధానానికి అంతర్జాతీయ సానుకూల డిమాండ్‌ మద్దతుగా నిలిచిందన్నారు. అన్ని విభాగాల్లోనూ మంచి పనితీరు సాధ్యమైందని తెలిపారు. ‘‘బ్రిటన్‌ పెన్షన్‌ పథకం పునరుద్ధరణ ప్రక్రియ పూర్తయింది. థిస్సెంక్రప్‌తో 50:50 భాగస్వామ్యం చక్కగా నడుస్తోంది. బలమైన యూరోప్‌ పోర్ట్‌ఫోలియో నిర్మాణానికి కట్టుబడి ఉన్నాం’’ అని నరేంద్రన్‌ వివరించారు. దేశీ విస్తరణ కార్యక్రమం కొనసాగుతుందని ప్రకటించారు. కళింగనగర్‌ ఫేస్‌–2 విస్తరణ చక్కగా కొనసాగుతోందని, ఇది తమ స్టీల్‌ ఉత్పత్తి సామర్థ్యాన్ని 13 మిలియన్‌ టన్నుల నుంచి 18 మిలియన్‌ టన్నులకు తీసుకెళుతుందన్నారు. భూషణ్‌ స్టీల్‌కు సంబంధించి తమ పరిష్కార ప్రణాళికకు ఎన్‌సీఎల్‌టీ, సీసీఐ ఆమోదాలు లభించడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. 

మరిన్ని వార్తలు