ఆగ్నేయాసియాకు టాటా స్టీల్‌ గుడ్‌బై!

21 Jul, 2018 00:50 IST|Sakshi

ముంబై: లాభసాటిగా లేని వ్యాపారం నుంచి తప్పుకోవాలనే వ్యూహంలో భాగంగా ఆగ్నేయాసియా వ్యాపారం నుంచి పెట్టుబడులు ఉపసంహరించుకోనున్నట్లు టాటా స్టీల్‌ ప్రకటించింది. ఇదే సమయంలో దేశీ వ్యాపారంపై ఫోకస్‌ పెంచినట్లు చైర్మన్‌ ఎన్‌ చంద్రశేఖరన్‌ తెలిపారు. వాటాదారులకు దీర్ఘకాలంలో లబ్ధి చేకూర్చే ప్రాజెక్టుల్లో పెట్టుబడులు కొనసాగుతూనే ఉంటాయన్నారు. ఎన్‌సీఎల్‌టీ ప్రక్రియలో ఉన్న భూషణ్‌ స్టీల్‌ను సొంతం చేసుకోవడం కూడా ఇందులో భాగమేనన్నారు.

‘‘ఈ కొనుగోలుతో మా ఉత్పత్తి సామర్థ్యం పెరిగి మార్కెట్‌లో గట్టిపోటీ ఇస్తాం. దీనికోసం కోర్టు ప్రక్రియ పూర్తయ్యేవరకు వేచి ఉంటాం. యూరోపియన్‌ కార్యకలాపాల పరంగా యాంటీ–ట్రస్ట్‌ అనుమతుల కోసం ఎదురుచూస్తున్నాం. ఈ డీల్‌ను పూర్తిచేస్తామనే నమ్మకం ఉంది. బ్రిటిష్‌ స్టీల్‌ పెన్షన్‌ పథకం పునర్‌వ్యవస్థీకరణను విజయవంతంగా పూర్తిచేశాం’’ అని వివరించారాయన. గతనెలలో జర్మనీ స్టీల్‌ కంపెనీ థిస్సెన్‌క్రప్‌తో కుదిరిన జాయింట్‌ వెంచర్‌ ద్వారా యూరప్‌లో వ్యయ సమన్వయం, టెక్నాలజీపై దృష్టిసారించినట్లు తెలిపారు. 

మరిన్ని వార్తలు