టాటా స్టీల్‌ చేతికి భూషణ్‌ స్టీల్‌ ! 

24 Mar, 2018 01:37 IST|Sakshi

సక్సెస్‌ ఫుల్‌ బిడ్డర్‌గా ఎంపిక  

అతి పెద్ద ఉక్కు కంపెనీగా టాటా స్టీల్‌!  

న్యూఢిల్లీ: దివాళా ప్రక్రియలో ఉన్న భూషణ్‌ స్టీల్‌ కంపెనీని బిడ్డింగ్‌లో  దక్కించుకున్నామని టాటా గ్రూప్‌కు చెందిన టాటా స్టీల్‌ తెలిపింది. ఎంత ధరకు ఈ కంపెనీని చేజిక్కించుకున్న వివరాలను టాటా స్టీల్‌ వెల్లడించలేదు. అయితే రూ.35,000 కోట్లకు (అంతా నగదులోనే )భూషణ్‌ స్టీల్‌ టాటా స్టీల్‌ పరం కానున్నదని పరిశ్రమ వర్గాలంటున్నాయి.   భూషణ్‌ స్టీల్‌   విజయవంతమైన రిజల్యూషన్‌ అప్లికెంట్‌గా రుణదాతల కమిటీ తమను నిర్ణయించిందని టాటా స్టీల్‌ పేర్కొంది. భూషణ్‌ స్టీల్‌ను చేజిక్కించుకోవడానికి నేషనల్‌ కంపెనీ లా ట్రిబ్యునల్‌(ఎన్‌సీఎల్‌టీ), కాంపిటీషన్‌ కమిషన్‌ ఆఫ్‌ ఇండియా(సీసీఐ) వంటి సంస్థల ఆమోదాలు పొందాల్సి ఉందని వివరించింది.

రూ.48,100 కోట్ల రుణాల చెల్లింపుల్లో విఫలమైనందుకు రుణ దాతల కమిటీ భూషణ్‌ స్టీల్‌పై ఎన్‌సీఎల్‌టీలో దివాలా ప్రక్రియను ప్రారంభించింది. భూషణ్‌ స్టీల్‌ కొనుగోలుకు ఆసక్తి గల కంపెనీల నుంచి దరఖాస్తులను ఆహ్వానించింది. టాటా స్టీల్‌తో పాటు జేఎస్‌డబ్ల్యూ స్టీల్, ఒక ప్రైవేట్‌ ఈక్విటీ సంస్థతో కలసి భూషణ్‌ స్టీల్‌ ఉద్యోగులు బిడ్‌లు దాఖలు చేశారు. చివరకు విజయవంతమైన బిడ్డర్‌గా టాటా స్టీల్‌ నిలిచింది. భూషణ్‌ స్టీల్‌ చేరికతో టాటా స్టీల్‌ భారత్‌లోనే అతి పెద్ద ఉక్కు కంపెనీగా అవతరించనున్నది.  జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌ను తోసిరాజని టాటా స్టీల్‌  ఈ స్థానానికి ఎగబాకుతుంది.  

మరిన్ని వార్తలు