హెచ్‌బీఐఎస్‌ గ్రూపుతో టాటా స్టీల్‌ కీలక ఒప్పందం 

29 Jan, 2019 00:49 IST|Sakshi

ఆగ్నేయ ఆసియా వ్యాపారాల్లో  70 శాతం వాటా అమ్మకం

డీల్‌ విలువ రూ.3,408 కోట్లు  

న్యూఢిల్లీ: టాటా స్టీల్‌ ఆగ్నేయ ఆసియాలోని తన వ్యాపారాల్లో మెజారిటీ వాటాను చైనాకు చెందిన హెచ్‌బీఐఎస్‌ గ్రూపునకు విక్రయించనుంది. ఇందుకు సంబంధించి హెచ్‌బీఐఎస్‌ గ్రూపు కంపెనీతో టాటా స్టీల్‌ అనుబంధ కంపెనీ టీఎస్‌ గ్లోబల్‌ హోల్డింగ్స్‌ ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందంలో భాగంగా సింగపూర్‌లోని నాట్‌స్టీల్‌ హోల్డింగ్స్‌ పీటీఈ లిమిటెడ్, టాటా స్టీల్‌ (థాయ్‌లాండ్‌) పబ్లిక్‌ కంపెనీ లిమిటెడ్‌లో 70% వాటాలను హెచ్‌బీఐఎస్‌ గ్రూపు కంపెనీకి 480 మిలియన్‌ డాలర్ల(రూ.3,408 కోట్లు) మొత్తానికి విక్రయించనుంది. ఇందులో టాటా స్టీల్‌కు 327 మిలియన్‌ డాలర్ల మేర నగదును హెచ్‌బీఐఎస్‌ గ్రూపు కంపెనీ చెల్లిస్తుంది. మరో 150 మిలియన్‌ డాలర్ల మేర రుణ భారాన్ని తనకిందకు తీసుకుంటుంది. దేశీయ మార్కెట్‌పై ప్రధానంగా దృష్టి సారించాలన్న టాటా స్టీల్‌ వ్యూహంలో భాగమే ఈ విక్రయ ఒప్పందం. ఈ ఒప్పందం తర్వాత కూడా సదరు రెండు కంపెనీల్లో టాటా స్టీల్‌కు 30% వాటా ఉంటుంది. ఓ ప్రత్యేక కంపెనీకి ముందుగా టాటా స్టీల్‌ తన కంపెనీల్లోని 100% వాటాలను బదలాయిస్తుంది. ఆ కంపెనీలో టాటా స్టీల్‌కు 30%, హెచ్‌బీఐఎస్‌ గ్రూపు కంపెనీకి 70 శాతం వాటా ఉంటుంది. 

>
మరిన్ని వార్తలు