మరో సంచలనం: టాటా, రిలయన్స్‌ జోడి?

4 Aug, 2017 14:35 IST|Sakshi
మరో సంచలనం: టాటా, రిలయన్స్‌ జోడి?
ముంబై : టెలికాం మార్కెట్‌లో మరో సంచలనం చోటుచేసుకోబోతుంది. ఇప్పటికే మెగాడీల్స్‌ను ప్రకటిస్తున్న టెలికాం కంపెనీలకు పోటీగా రిలయన్స్‌ జియో కూడా భారీ డీల్‌ చేసుకోబోతుందని తెలుస్తోంది. దేశంలోనే అతిపెద్ద కార్పొరేట్‌ సంస్థ టాటా గ్రూప్‌కు చెందిన టెలికాం వ్యాపారాలను, అత్యంత విలువైన కంపెనీగా పేరున్న రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ లిమిటెడ్‌ సొంతం చేసుకోబోతుందని సమాచారం. టాటా గ్రూప్‌ నష్టాల్లో ఉన్న తన వ్యాపారాన్ని, ఆస్తులను రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌కు అమ్ముతున్నట్టు రిపోర్టులు వస్తున్నాయి. రిపోర్టుల ప్రకారం తొలిసారి రెండు అతిపెద్ద కార్పొరేట్‌ సంస్థలు కలిసి ఈ డీల్‌ను నిర్వహించబోతున్నాయని తెలుస్తోంది. అయితే మార్కెట్‌లో వస్తున్న ఈ ఊహాగానాలపై టాటా గ్రూప్ కానీ‌, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ కానీ స్పందించలేదు. గతంలో మాత్రం ఈ రెండు కార్పొరేట్‌ సంస్థలు ఎలాంటి మేజర్‌ ఒప్పందాలను కలిగి లేకపోవడం గమనార్హం. అయితే ఇటీవలే ఆర్‌ఐఎల్‌ నిర్వహిస్తున్న పురుషుల ప్రొఫెషనల్‌ ఫుట్‌బాట్‌ లీగ్‌లో ఇండియన్ సూపర్ లీగ్‌కు చెందిన జమ్షెడ్పూర్ ఫ్రాంచైజ్‌ను టాటా సొంతం చేసుకుంది. 
 
గత దశాబ్దం కాలంగా టెలికాం వ్యాపారాల్లో టాటాలు, అంబానీలు తీవ్రంగానే పోటీ పడుతూ వస్తున్నాయి. కానీ ఇటీవల టాటాల టెలికాం వ్యాపారాలు నష్టాల్లో కూరుకుపోయాయి. గత కొంతకాలంగా తమ గ్రూప్‌కు చెందిన టెలికాం, ఓవర్‌సీస్‌ కేబుల్‌, ఎంటర్‌ప్రైజ్‌ సర్వీసెస్‌, డీటీహెచ్‌ టీవీ వ్యాపారాలను విక్రయించేందుకు టాటా గ్రూప్‌ అన్వేషణ ప్రారంభించింది. టెలికాం దిగ్గజం ఎయిర్‌టెల్‌తో కూడా ఒప్పందం చేసుకోబోతున్నట్టు తెలిసింది. కానీ ఈ మెగా డీల్‌ను భారతీ ఎంటర్‌ప్రైజ్‌ రద్దుచేసుకున్నట్టు తాజా రిపోర్టులు పేర్కొన్నాయి. దీంతో ఎయిర్‌టెల్‌కు గట్టి పోటీగా ఉన్న రిలయన్స్‌ జియోకి వీటిని విక్రయించాలని టాటాలు ప్లాన్‌ చేస్తున్నట్టు తెలుస్తోంది. జియో, టాటా టెలి ఈ డీల్‌ కోసం ఆప్షన్లను అన్వేసిస్తున్నాయని, కానీ ఇది పురోగతిలోకి రావాలంటే చాలా కష్టతరమని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. టాటా టెలిలో మెజార్టీ వాటా టాటా గ్రూప్‌ చేతుల్లో ఉంది. 49 శాతం లిస్టు అయిన టాటా కమ్యూనికేషన్‌ వద్ద ఉంది. అనిల్‌ అంబానీకి చెందిన ఆర్‌కామ్‌ కూడా టాటా టెలిని కొనడానికి మొగ్గుచూపిందని కానీ ఇప్పటికే తమకున్న తీవ్ర నష్టాలు, ఎయిర్‌సెల్‌ విలీనంలో చోటుచేసుకున్న అనిశ్చిత పరిస్థితులతో వెనక్కి తగ్గిందని సంబంధిత వర్గాలు చెప్పాయి. 
 
Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా