బ్లాక్‌ మార్కెటింగ్‌తో పన్నుల ఎగవేత

13 Mar, 2018 01:37 IST|Sakshi

న్యూఢిల్లీ: పన్నుల విధానాన్ని సమర్ధంగా తీర్చిదిద్దేందుకు ఉద్దేశించి జీఎస్‌టీ విధానం ప్రవేశపెట్టగా.. అది అమల్లోకి వచ్చిన ఈ తొమ్మిది నెలల్లో దిగుమతిదారులు భారీ స్థాయిలో పన్ను ఎగవేతలకు కొంగొత్త మార్గాలు అనుసరిస్తున్నారు. దిగుమతుల విలువను తగ్గించి చూపడం, బ్లాక్‌ మార్కెట్‌ తదితర మార్గాల్లో దిగుమతిదారులు పన్ను ఎగవేతలకు పాల్పడుతున్నట్లు అధికారులు గుర్తించారు. దిగుమతిదారులు జీఎస్‌టీ చెల్లిస్తున్నప్పటికీ, కొనుగోలుదారులకు బిల్లులు ఇవ్వకుండా విక్రయిస్తున్నట్లు గణాంకాల విశ్లేషణలో పన్నుల శాఖ గుర్తించింది.

దిగుమతిదారులు చెల్లిస్తున్న జీఎస్‌టీకి, ఆ తర్వాత నమోదవుతున్న రీఫండ్‌ క్లెయిమ్‌లకు మధ్య వ్యత్యాసాలు ఉంటుండటంతో ఈ అభిప్రాయానికి వచ్చినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ప్రాథమిక విశ్లేషణ ప్రకారం 73,000 పైచిలుకు సంస్థలు రూ. 30,000 కోట్ల మేర ఐజీఎస్‌టీ చెల్లిస్తున్నప్పటికీ.. వాటికి సంబంధించి రీఫండ్‌ మాత్రం క్లెయిమ్‌ చేయడం లేదు.

లగ్జరీ ఉత్పత్తులు, మొబైల్‌ ఫోన్స్‌ దిగుమతులకు సంబంధించి భారీ స్థాయిలో పన్నుల ఎగవేతలు ఉండవచ్చని ఏఎంఆర్‌జీ అండ్‌ అసోసియేట్స్‌ పార్ట్‌నర్‌ రజత్‌ మోహన్‌ పేర్కొన్నారు. వీటి దిగుమతి విలువను తక్కువగా చూపించి, బ్లాక్‌మార్కెట్లో విక్రయిస్తుండవచ్చని ఆయన తెలిపారు. ఆదాయ పన్ను శాఖ గణాంకాల విశ్లేషణ చేపట్టిన నేపథ్యంలో త్వరలోనే ఎగవేతదారులను గుర్తించి, చర్యలకు సిద్ధమయ్యే అవకాశం ఉందన్నారు.

మరిన్ని వార్తలు