రాష్ట్రాల్లో పన్నులు అధికం: మారుతీ సుజుకీ ఇండియా చైర్మన్‌

28 Aug, 2019 08:52 IST|Sakshi

ముంబై: రాష్ట్రాల్లో పన్నులు అధికంగా ఉన్నాయని, ఫలితంగా కార్ల ధరలు పెరుగుతున్నాయని మారుతీ సుజుకీ ఇండియా చైర్మన్‌ ఆర్‌.సి. భార్గవ ఆవేదన వ్యక్తం చేశారు. ఉదాహరణకు పెట్రోల్‌పై రాష్ట్రాలు భారీగా పన్నులు విధిస్తున్నాయని, కొన్ని రాష్ట్రాలు రోడ్డు ట్యాక్స్‌ను బాగా పెంచాయని, ఫలితంగా కార్ల ధరలపై రాష్ట్రాల పన్ను భారం ప్రభావం చూపుతోందని పేర్కొన్నారు. ఇతర రాష్ట్రాలతో పోల్చితే, రోడ్డు ట్యాక్స్‌ పెంచిన రాష్ట్రాల్లో కార్ల అమ్మకాలు భారీగా తగ్గాయని వివరించారు.

రాష్ట్రాలు తోడ్పాటునందించాలి....
తయారీ రంగంలో తమ పాత్ర విషయమై రాష్ట్రాలు తగిన విధంగా వ్యవహరించాలని భార్గవ సూచించారు. లేకుంటే 5 లక్షల కోట్ల డాలర్ల ఆర్థిక వ్యవస్థగా భారత్‌ అవతరించాలన్న ప్రధాని నరేంద్ర మోదీ స్వప్నం సాకారం కావడం కష్టమని ఆయన స్పష్టం చేశారు. ఇక్కడ జరిగిన కంపెనీ వార్షిక సాధారణ సమావేశంలో ఆయన మాట్లాడారు. తయారీ రంగం వృద్ధి చెందడానికి రాష్ట్రాల ప్రభుత్వాలు ఇతోధికంగా తోడ్పడాలని ఆయన సూచించారు.

మరిన్ని వార్తలు