ఈ సారి బడ్జెట్లో పన్ను రాయితీ?

2 Jan, 2019 00:16 IST|Sakshi

ఎన్నికల నేపథ్యంలో మినహాయింపులుంటాయని అంచనా

 ఎన్నికల హామీల్లో సార్వత్రిక కనీస ఆదాయం కూడా..! 

త్వరలో చిరు వ్యాపారులకు ప్యాకేజీ ప్రకటించే అవకాశం

ఆర్థిక శాఖ వర్గాలు, విశ్లేషకుల అంచనా  

సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తుండటంతో మరోసారి ఆదాయపు పన్ను రాయితీల ప్రతిపాదన తెరపైకి వచ్చింది. ఎంత తగ్గిస్తారు? ఏ మేరకు ఉపశమనం కలిగిస్తారు? అనే విషయాలపై ఇంకా స్పష్టత లేకపోయినా... ఈ సారి ఓటాన్‌ అకౌంట్‌లో ఆదాయపు పన్ను రాయితీల ప్రస్తావన కచ్చితంగా ఉంటుందని ఆర్థిక శాఖ వర్గాలు చెబుతున్నాయి. ‘‘ఓటాన్‌ అకౌంట్‌ ద్వారా మూడు నుంచి నాలుగు నెలల కాలానికి వ్యయాల కోసం పార్లమెంటు అనుమతి కోరే అవకాశం ఉంది. కాకపోతే, ఈ ఓటాన్‌ అకౌంట్‌లో తదుపరి ఆర్థిక సంవత్సరం కోసం పథకాలను ప్రకటిస్తే దానిపై ఓటింగ్‌ జరగదు. ఈ నేపథ్యంలో ఆదాయపన్ను రాయితీలను జైట్లీ ప్రతిపాదించే అవకాశాలు కనిపిస్తున్నాయి’’ అని ఆర్థిక శాఖ వర్గాలను ఉటంకిస్తూ వార్తాసంస్థలు పేర్కొన్నాయి. అలాగే, మ్యూచువల్‌ ఫండ్స్‌ నుంచి ఉపసంహరించుకునే మొత్తాలపై పన్నును సమీక్షించే అవకాశం ఉందని, దీనివల్ల మధ్యతరగతి ప్రజలకు ఖర్చు చేసేందుకు మరింత అదనపు ఆదాయం చేతిలో మిగులుతుందని, అది వినియోగాన్ని పెంచి, ఆర్థిక వ్యవస్థకు ఊతమిస్తుందని ఆయా వర్గాలు విశ్లేషించాయి.
 
సార్వత్రిక కనీస ఆదాయం (యూబీఐ) 
ఈ సారి సార్వత్రిక ఎన్నికల సందర్భంగా యూనివర్సల్‌ బేసిక్‌ ఇన్‌కమ్‌ (సార్వత్రిక కనీస ఆదాయం) హామీ కూడా తెరపైకి రావచ్చని వినవస్తోంది. నిజానికిదేమీ కొత్త ప్రతిపాదన కాదు. 2016–17 నాటి ఆర్థిక సర్వేలో పేర్కొన్నదే. పేద ప్రజలకు నేరుగా నగదు ప్రయోజనాన్ని అందించాలంటూ... ప్రజలకు ఎక్కువ చేయూత అవసరమైన చోట సరైన స్థాయిలో సహకారం అందడం లేదని, ఈ నేపథ్యంలో పేద ప్రజలకు మరింత మెరుగైన రీతిలో సాయం అందించేందుకు యూబీఐని పరిష్కారంగా చేసుకోవాలని ఆర్థిక సర్వే పేర్కొంది. నాడు ఆర్థిక సర్వేను రూపొందించిన కేంద్ర ప్రభుత్వ ముఖ్య ఆర్థిక సలహాదారు అరవింద్‌ సుబ్రమణియన్, ఓ కుటుంబానికి కనీస సార్వత్రిక ఆదాయం కింద రూ.7,620ను ప్రతిపాదించారు. అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ (ఐఎంఎఫ్‌) అయితే, 2011–12 నాటి నివేదికలో యూబీఐని రూ.2,600గా పేర్కొంది. యూబీఐ హామీతో మోదీ సర్కారు ఎన్నికలకు వెళ్లవచ్చనే అంచనాలున్నాయి. దేశవ్యాప్తంగా రైతుల రుణ మాఫీతో పోలిస్తే యూబీఐ అన్నది ఎక్కువ మంది ప్రజలకు మేలు చేసే పథకం అవుతుంది. అందులో రైతులు కూడా ఉంటారు. ఒక్కసారి ఇచ్చే రుణ మాఫీతో పోలిస్తే, యూబీఐ మరింత ప్రభావవంతమైనదనే విశ్లేషణలున్నాయి

రిటైల్‌ వ్యాపారులకు చేయూత
రిటైల్, చిన్న వ్యాపారుల సంఖ్య భారీగానే ఉంటుంది. డీమోనిటైజేషన్, ఆ తర్వాత జీఎస్టీతో ఈ వర్గాలు ఎక్కువగా సమస్యలు ఎదుర్కొన్నాయి. వాటి నుంచి ఇంకా పూర్తిగా బయటపడలేదు కూడా. రిటైల్‌ చెయిన్లు, భారీ డిస్కౌంట్లతో ఆకర్షిస్తున్న బడా ఈ కామర్స్‌ సంస్థల నుంచి వీరంతా తీవ్రమైన పోటీని ఎదుర్కొంటున్నారు. దీంతో లోక్‌సభ ఎన్నికల ముందే ఈ వర్గాల కోసం ప్రత్యేక ప్యాకేజీని మోదీ సర్కారు ప్రకటించొచ్చన్న అంచనాలున్నాయి. చిన్న రిటైలర్లు, వ్యాపారుల కోసం వడ్డీ రాయితీతో కూడిన చౌక రుణాలను ఈ పథకం ద్వారా అందించే అవకాశం ఉంది.


 

మరిన్ని వార్తలు