స్పెక్ట్రం ఆదాయం తగ్గుదలకు ఐడీఎస్తో చెక్

10 Oct, 2016 23:46 IST|Sakshi
స్పెక్ట్రం ఆదాయం తగ్గుదలకు ఐడీఎస్తో చెక్

ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ...
న్యూఢిల్లీ: నల్లధనం అడ్డుకట్ట కోసం స్వచ్ఛంద ఆదాయ వెల్లడి పథకం(ఐడీఎస్) ద్వారా సమీకరించిన పన్నుల ద్వారా స్పెక్ట్రం వేలం ఆదాయంలో తగ్గుదలను కొంతమేరకు పూడ్చుకోనున్నట్లు ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ పేర్కొన్నారు. సోమవారమిక్కడ ఒక వార్తా చానల్‌తో మాట్లాడుతూ ఆయన పలు అంశాలను ప్రస్తావించారు. నాలుగు నెలలపాటు అమలు చేసిన ఐడీఎస్(సెప్టెంబర్ 30తో ముగిసింది) ద్వారా సుమారు రూ.62,250 కోట్ల విలువైన నల్లధనం వ్యవస్థలోకి వచ్చినట్లు ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయి.

దీనివల్ల ఖజానాకు పన్నుల రూపంలో రూ.29,362 కోట్లు లభించనున్నాయని, ఇందులో సగం మొత్తం ఈ ఆర్థిక సంవత్సరంలోనే సమకూరనుందని అంచనా. అయితే, గతవారంలో ముగిసిన అతిపెద్ద స్పెక్ట్రం వేలంలో ప్రభుత్వం అంచనాలు తలకిందులయ్యాయి. దాదాపు రూ.5.6 లక్షల కోట్ల విలువైన స్పెక్ట్రంను వేలానికి ఉంచగా.. కేవలం రూ.65,789 కోట్లకు మాత్రమే టెలికం కంపెనీలు బిడ్‌లు దాఖలు చేశాయి. ఇందులో ఈ ఏడాది(2016-17) రూ.37,000 కోట్లు ప్రభుత్వానికి లభించనున్నాయి. ఒక్క 700 మెగాహెర్ట్జ్ ప్రీమియం బ్యాండ్‌విడ్త్ విభాగం వేలంలో టెల్కోలు ముఖం చాటేసినప్పటికీ... ఇతర బ్యాండ్‌విడ్త్‌లలో స్పెక్ట్రం అమ్మకం ఆదాయం రికార్డు స్థాయిలోనే నమోదైందని జైట్లీ పేర్కొన్నారు.

 ‘ఈ ఏడాది ద్రవ్యలోటు కట్టడి విషయంలో పెద్దగా ఇబ్బందులు ఎదురుకావని భావిస్తున్నా. ఎందుకంటే స్పెక్ట్రం ఆదాయం అంచనాల కంటే తగ్గినప్పటికీ.. ఐడీఎస్ రూపంలో ప్రస్తుత, వచ్చే ఏడాది లభించనున్న పన్నుల ఆదాయం దీనికి కొంత తోడ్పాటును అందించనుంది. కేంద్రంలో మా బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండున్నరేళ్లలో నల్లధనం కట్టడికి అనేక చర్యలు తీసుకున్నాం. అసలు మా సర్కారు కొలువుదీరిన వెంటనే దీనికోసం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని(సిట్)ను ఏర్పాటు చేస్తూ తొలి నిర్ణయం తీసుకున్నాం కూడా’ అని జైట్లీ వ్యాఖ్యానించారు.

 ఏప్రిల్ 1 నుంచే జీఎస్‌టీ అమల్లోకి...
కీలకమైన వస్తు, సేవల పన్ను(జీఎస్‌టీ)ను వచ్చే ఏడాది ఏప్రిల్ 1 నుంచే అమల్లోకి తీసుకురానున్నట్లు ఆర్థిక మంత్రి వెల్లడించారు. ఈ నెల 18-20 తేదీల్లో జీఎస్‌టీ కౌన్సిల్ ప్రతిపాదిత పన్ను రేట్లు, బ్యాండ్స్(పరిమిత శ్రేణులు)పై చర్చించనుందని కూడా ఆయన తెలిపారు.

 డిజిన్వెస్ట్‌మెంట్ జోరు...
ఈ ఏడాది డిజిన్వెస్ట్‌మెంట్ ఆదాయం ఇదివరకెన్నడూ లేనంత స్థాయిలో లభించనుందని జైట్లీ చెప్పారు. ప్రభుత్వ రంగ సంస్థ(పీఎస్‌యూ)ల షేర్ల బైబ్యాక్‌ను కూడా పరిగణనలోకి తీసుకుంటే భారీ మొత్తమే ఖజానాకు జమకానుందన్నారు. ఇక బ్యాంకుల మొండిబకాయిల(ఎన్‌పీఏ) సమస్య పరిష్కారానికి చర్యలు జోరందుకున్నాయని వెల్లడించారు. ఇప్పటికే బ్యాంకులు రంగంలోకి దిగాయని, ఆర్‌బీఐ కూడా కొన్ని కీలక చర్యలు(కంపెనీలను అధీనంలోకి తీసుకోవడం ఇతరత్రా) చేపట్టిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ఈ సమస్య అడ్డుకట్టకు ప్రభుత్వం పార్లమెంటులో చట్టాలను కూడా సవరించిందని తెలిపారు.

>
మరిన్ని వార్తలు