చక్కెరపై పన్ను?

27 Mar, 2018 01:15 IST|Sakshi

ఎగుమతులకు ప్రోత్సాహకాలు ఇవ్వటానికే

ఉత్పత్తి అంచనాలను మించటంతో తగ్గిన ధర

ప్రతికూల వార్తలతో కుదేలవుతున్న కంపెనీల షేర్లు  

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో :  చక్కెర పరిశ్రమకు సంబంధించి విచిత్రమైన పరిస్థితులు నెలకొంటున్నాయి. ఒకవంక అంచనాలను మించిన ఉత్పత్తి అటు చెరకు రైతును ఇటు చక్కెర ధరను దెబ్బతీస్తుండగా... మరోవంక రిటైల్‌ ధరలు మాత్రం ఉపశమనం ఇవ్వటం లేదు.

తాజాగా ఎగుమతులను ప్రోత్సహించటానికి స్థానికంగా జరిగే చక్కెర విక్రయాలపై పన్ను వేయాలని కేంద్రం యోచిస్తున్నట్లు వెల్లడయింది. సోమవారం ఈ వార్తలు షికారు చేయటంతో... అది చక్కెర కంపెనీల విక్రయాలు, లాభాలపై తీవ్ర ప్రభావం చూపించవచ్చన్న అంచనాలతో షుగర్‌ కంపెనీల షేర్లలో భారీ విక్రయాలు చోటు చేసుకున్నాయి. దీంతో మార్కెట్లు పెరిగినా కూడా చక్కెర కంపెనీల షేర్లు తీవ్రంగా నష్టపోయాయి.

పన్ను ఎందుకంటే...
ఈ చక్కెర సీజన్‌లో 29.5 మిలియన్‌ టన్నుల చక్కెర ఉత్పత్తి కావచ్చనేది ఇండియన్‌ షుగర్‌ మిల్స్‌ అసోసియేషన్‌ (ఐఎస్‌ఎంఏ) అంచనా. 2016–17 సీజన్‌తో పోలిస్తే ఇది 45 శాతం అధికం. నిజానికి దేశీయ డిమాండ్‌ 24.5 మిలియన్‌ టన్నులే. దీంతో ప్రస్తుత పరిస్థితుల్లో భారత్‌ ఎంత కాదన్నా ఈ సీజన్‌లో 20 లక్షలు, వచ్చే సీజన్‌లో 50 లక్షల టన్నుల చక్కెరను విదేశాలకు ఎగుమతి చేయాల్సి ఉందని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. అయితే అంతర్జాతీయంగా ధర తక్కువగా ఉంది.

పాకిస్తాన్‌ క్వింటాలుకు సుమారు రూ.2,200కు విక్రయిస్తోంది. భారత్‌లో మిల్లు ధరే రూ.2,900 పైన ఉంది. ఈ ధరలో అంతర్జాతీయంగా పోటీపడలేమని కేసీపీ షుగర్‌ సీవోవో జి.వెంకటేశ్వర రావు ‘సాక్షి’ బిజినెస్‌ బ్యూరో ప్రతినిధితో చెప్పారు. నిజానికి ఎగుమతులను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం 20 శాతంగా ఉన్న ఎగుమతి సుంకాన్ని ఎత్తివేసింది. ఇంకా మిల్లులకు నగదు ప్రోత్సాహకాలివ్వాలని కేంద్రం యోచిస్తున్నట్టు తెలిసింది.

స్థానికంగా చక్కెర అమ్మకాలపై పన్ను వేయడం ద్వారా సమీకరించిన మొత్తాన్ని ఎగుమతుల ప్రోత్సాహకానికి వినియోగించే అవకాశం ఉంది. ‘‘మిల్లులు ఇప్పటికే రిఫైన్డ్‌ చక్కెరను ఉత్పత్తి చేశాయి. చాలా దేశాలు ముడి చక్కెరనే కొనుగోలు చేస్తాయి. అంటే ఈ సీజన్‌లో ఎగుమతులు పెద్దగా ఉండకపోవచ్చు’’ అని ఓ కంపెనీ ప్రతినిధి చెప్పారు.

తగ్గుతున్న హోల్‌సేల్‌ ధర!
న్యూఢిల్లీ హోల్‌సేల్‌ మార్కెట్లో సోమవారం షుగర్‌ ధర క్వింటాలుకు రూ.180 తగ్గి ఎం–30 రకం రూ.3,150–3,270 మధ్య పలికింది. స్టాకిస్టులు, సాఫ్ట్‌ డ్రింక్, ఐస్‌క్రీమ్, కన్ఫెక్షనరీ వంటి కంపెనీల నుంచి డిమాండ్‌ పడిపోవడం కూడా ధర పతనానికి కారణమని మార్కెట్‌ వర్గాలు చెబుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుత సీజన్లో ఒకానొక దశలో మిల్లు ధర రూ.3,800 దాకా వెళ్లింది. ప్రస్తుతం రూ.2,900 పలుకుతోంది. 

తయారీ వ్యయం కంటే అమ్మకం ధరలు తక్కువ ఉండటంతో కంపెనీలు నష్టాలను చవి చూస్తున్నట్లు చెబుతున్నాయి. నష్టాల వల్ల దేశంలోని 523 చక్కెర మిల్లుల్లో ఇప్పటికే 106 మూతపడ్డాయి. ఇందులో ఏడు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌కు చెందినవి. రైతులకు మిల్లులు చెల్లించాల్సిన బకాయిలు జనవరి 31 నాటికే రూ.14,000 కోట్లకు చేరుకున్నాయి. ఈ నెలాఖరుకు ఇవి ఇంకా భారీగా పెరగనున్నాయి.

మరిన్ని వార్తలు