పన్నులు తగ్గించాలి

7 Jan, 2015 01:55 IST|Sakshi
పన్నులు తగ్గించాలి

వృద్ధికి ఊతమివ్వాలి
కేంద్రానికి పారిశ్రామిక దిగ్గజాల వినతి
ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీతో {పీ-బడ్జెట్ సమావేశం

 
న్యూఢిల్లీ: వ్యాపారాల నిర్వహణకు ప్రతికూలంగా ఉంటున్న పన్నుల విధానాలను సరిచేయాలని పారిశ్రామిక దిగ్గజాలు కేంద్రాన్ని కోరారు. ఇందులో భాగంగా కార్పొరేట్ ట్యాక్స్, ఆదాయ పన్నులు మొదలైనవి తగ్గించాలని సూచించారు. బడ్జెట్ తయారీకి ముందు జరిపే చర్చల్లో భాగంగా మంగళవారం కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ నిర్వహించిన సమావేశంలో వారు ఈ మేరకు తమ అభ్యర్థనలు తెలియజేశారు. మౌలిక సదుపాయాల కల్పనపై మరిన్ని నిధులు వెచ్చించాలని, మేకిన్ ఇండియా కార్యక్రమాన్ని విజయవంతం చేసేలా సంస్కరణల ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని వారు పేర్కొన్నారు. తయారీ రంగ వృద్ధి మందకొడిగా ఉన్న పరిస్థితి వాస్తవమేనని అంగీకరించిన అరుణ్ జైట్లీ.. వ్యాపార నిర్వహణకు పరిస్థితులు మెరుగుపర్చడానికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నట్లు చెప్పారు. వస్తు, సేవల పన్నుల (జీఎస్‌టీ) విధానం అమల్లోకి వస్తే.. పన్నుల వ్యవస్థ మెరుగుపడగలదని, మరింత పారదర్శకత రాగలదని ఆయన తెలిపారు.

 మరోవైపు, కనీస ప్రత్యామ్నాయ పన్ను (మ్యాట్)ను 10 శాతానికి పరిమితం చేయడం ద్వారా తయారీ రంగానికి తోడ్పాటునివ్వాలని భేటీలో కోరినట్లు పరిశ్రమల సమాఖ్య సీఐఐ ప్రెసిడెంట్ అజయ్ శ్రీరామ్ తెలిపారు. ప్రత్యేక ఆర్థిక మండళ్లలో(సెజ్) యూనిట్లకు, డెవలపర్లకు మ్యాట్ .. డివిడెండ్ పంపిణీ పన్నులు (డీడీటీ) నుంచి మినహాయింపునివ్వాలని విజ్ఞప్తి చేసినట్లు వివరించారు. ఆర్థిక వ్యవస్థ రికవరీ ప్రక్రియకు, ఉపాధి కల్పనకి, వ్యవసాయ రంగ అభివృద్ధికి ఊతమిచ్చేలా బడ్జెట్‌లో మరిన్ని చర్యలు ఉండగలవని ఆశిస్తున్నట్లు శ్రీరామ్ పేర్కొన్నారు.
 
 

మరిన్ని వార్తలు