టీసీఎస్ లాభాలు మై(బో)నస్

17 Apr, 2015 02:22 IST|Sakshi
టీసీఎస్ లాభాలు మై(బో)నస్

క్యూ4లో రూ. 3,713 కోట్లు, 31 శాతం తగ్గుదల
⇒ఉద్యోగులకు రూ. 2,628 కోట్ల భారీ బోనస్ ఫలితం...
⇒బోనస్ సర్దుబాటుకు ముందు నికర లాభం రూ .5,773 కోట్లు; 7.7% వృద్ధి
⇒మొత్తం ఆదాయం రూ. 24,220 కోట్లు; 12.3 శాతం అప్
⇒షేరుకి రూ. 24 చొప్పున తుది డివిడెండ్...

ముంబై: దేశీ సాఫ్ట్‌వేర్ అగ్రగామి టీసీఎస్ ఆర్థిక ఫలితాలపై ఉద్యోగుల బోనస్ ప్రభావం పడింది. మార్చితో ముగిసిన నాలుగో త్రైమాసికం(2014-15, క్యూ4)లో కంపెనీ కన్సాలిడేటెడ్ నికర లాభం రూ.3,713 కోట్లకు పరిమితమైంది.

అంతక్రితం ఏడాది ఇదే కాలంలో రూ.5,358 కోట్లతో పోలిస్తే లాభం భారీస్థాయిలో 30.6 శాతం దిగజారింది. అయితే, సిబ్బందికి ప్రకటించిన వన్‌టైమ్ బోనస్ రూ. 2,628 కోట్లు ఇతరత్రా సర్దుబాట్ల ప్రకారం చూస్తే.. క్యూ4లో నికర లాభం రూ.5,773 కోట్లుగా నమోదైందని కంపెనీ విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది.

గతేడాది క్యూ4తో పోలిస్తే వార్షిక ప్రాతిపదికన 7.7% ఎగబాకినట్లు లెక్క. ఇక కంపెనీ మొత్తం ఆదాయం క్యూ4లో రూ.21,551 కోట్ల నుంచి రూ.24,220 కోట్లకు పెరిగింది. 12.4 శాతం వృద్ధి నమోదైంది. కాగా, క్యూ4లో కంపెనీ నికర లాభం రూ.5,410 కోట్లు, ఆదాయం రూ.24,456 కోట్లుగా ఉండొచ్చని మార్కెట్ వర్గాలు అంచనా వేశాయి. దీన్నిబట్టిచూస్తే మెరుగైన ఫలితాలనే టీసీఎస్ ప్రకటించినట్లయింది. ఇదిలాఉండగా.. ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్‌తో ఎప్పుడూ ఆర్థిక ఫలితాల ప్రధాన సీజన్ ప్రారంభం కావడం ఇప్పటిదాకా ఆనవాయితీగా వస్తోంది. ఈసారి మాత్రం అందుకుభిన్నంగా టీసీఎస్ ఫలితాలు ముందుగా వెలువడటం విశేషం.
 
సీక్వెన్షియల్‌గా తగ్గిన ఆదాయం...
2014-15 డిసెంబర్‌తో ముగిసిన మూడో త్రైమాసికం(క్యూ3)తో పోలిస్తే త్రైమాసికం ప్రాతిపదికన(సీక్వెన్షియల్‌గా) టీసీఎస్ మొత్తం ఆదాయం 1.1% తగ్గింది. క్యూ3లో మొత్తం ఆదాయం రూ.24,501 కోట్లుగా నమోదైంది. ఇక క్యూ3లో లాభం రూ.5,327 కోట్లతో సరిపోల్చితే క్యూ4 లాభం 30.3% పడిపోయింది. అయితే, బోనస్ సర్దుబాటు ప్రకారం మాత్రం సీక్వెన్షియల్‌గా లాభం 8.3 శాతం ఎగసింది.
 
పూర్తి ఏడాదికి ఇలా...
2014-15 పూర్తి ఆర్థిక సంవత్సరానికిగాను టీసీఎస్ రూ.19,852 కోట్ల కన్సాలిడేటెడ్ నికర లాభాన్ని ప్రకటించింది. క్రితం ఏడాది ఇదే కాలంలో నికర లాభం రూ.19,164 కోట్లుగా నమోదైంది. 3.5 శాతం పెరిగింది. అయితే, బోనస్ సర్దుబాటు ప్రకారం చూస్తే 2014-15 పూర్తి ఏడాదికి నికర లాభం రూ.21,912 కోట్లుగా ఉన్నట్లు కంపెనీ వివరించింది. అంటే 14.3 శాతం వృద్ధి చెందినట్లు లెక్క. ఇక మొత్తం ఏడాదికి కంపెనీ కన్సాలిడేటెడ్ ఆదాయం రూ.81,809 కోట్ల నుంచి రూ.94,648 కోట్లకు ఎగబాకింది. 15.7 శాతం పెరుగుదల నమోదైంది.
 
ఫలితాల్లో ఇతర ముఖ్యాంశాలివీ...
⇒ఒక్కో షేరుకి రూ.24 చొప్పున తుది డివిడెండ్‌ను టీసీఎస్ ప్రకటించింది. దీంతో 2014-15 ఏడాదికిగాను ఇన్వెస్టర్లకు మొత్తం డివిడెండ్ ఒక్కో షేరుకి రూ.79కి చేరింది.
⇒క్యూ4లో కంపెనీ స్థూలంగా రూ.14,395 మంది ఉద్యోగులను నియమించుకుంది. అయితే, 13,364 మంది ఉద్యోగులు వలసపోవడంతో నికరంగా క్యూ4లో జతైన సిబ్బంది సంఖ్య 1,031కే పరిమితమైంది. వలసల(అట్రిషన్) రేటు 14.9 శాతంగా నమోదైంది.
⇒ఇక 2014-15 పూర్తి ఏడాదిలో స్థూలంగా 67,123 మందిని, నికరంగా 19,192 మంది సిబ్బందిని కంపెనీ జతచేసుకుంది. దీంతో 2015 మార్చి చివరినాటికి టీసీఎస్ మొత్తం ఉద్యోగుల సంఖ్య 3,19,656గా నమోదైంది.
⇒ఇక ప్రస్తుత 2015-16 ఆర్థిక సంవత్సరంలో మొత్తం 60,000 మంది ఉద్యోగులను కొత్తగా నియమించుకోనున్నట్లు టీసీఎస్ హెచ్‌ఆర్ హెడ్ అజోయ్ ముఖర్జీ తెలిపారు. ఇందులో 35,000 క్యాంపస్ నియామకాలు ఉంటాయని చెప్పారు. అయితే, 2014-15తో పోలిస్తే మొత్తం స్థూల నియామకాల సంఖ్య తక్కువే.
⇒అదేవిధంగా భారత్‌లో సిబ్బందికి సగటున 8 శాతం, విదేశాల్లోని కంపెనీ ఉద్యోగులకు 2-4 శాతం మేర వేతనాలను పెంచుతున్నట్లు కూడా ముఖర్జీ ప్రకటించారు.
⇒ కంపెనీ వద్ద మార్చి నాటికి రూ.23,000 కోట్ల నగదు, తత్సంబంధ నిల్వలు ఉన్నాయి.
 గురువారం బీఎస్‌ఈలో టీసీఎస్ షేరు ధర 1.5 శాతం క్షీణించి రూ.2,585 వద్ద స్థిరపడింది. మార్కెట్లో ట్రేడింగ్ ముగిశాక కంపెనీ ఫలితాలను ప్రకటించింది.
 
క్యూ4లో కరెన్సీ సంబంధ ఒడిదుడుకులు ఉంటాయని మేం ముందే సంకేతాలిచ్చాం. ప్రధానంగా టెలికం, బీమా, ఇంధన రంగాల నుంచి కొంత ప్రతికూలతలు ఎదురయ్యాయి. దీని ప్రకారం కొంత మార్జిన్లు తగ్గినప్పటికీ.. మొత్తంమీదచూస్తే మంచి పనితీరునే కనబరిచాం. క్లయింట్ల సానుకూల వ్యాపార సెంటిమెంట్ నేపథ్యంలో ఈ ఆర్థిక సంవత్సరంలో వృద్ధిపై ఆశాజనకంగానే ఉన్నాం.
 - ఎన్. చంద్రశేఖరన్, టీసీఎస్ సీఈఓ, ఎండీ
 
ఉద్యోగులకు బంపర్ బొనాంజా

టీసీఎస్ తమ సిబ్బందికి రికార్డు స్థాయిలో బంపర్ బోనస్‌ను ప్రకటించింది. కంపెనీ పబ్లిక్ ఇష్యూ(ఐపీఓ-2004, ఆగస్టు)కి వచ్చి పదేళ్లయిన సందర్భంగా ప్రత్యేక ప్రోత్సాహకం కింద రూ.2,628 కోట్ల వన్‌టైమ్ బోనస్‌ను ఇస్తున్నట్లు గురువారం వెల్లడించింది. భారతీయ కార్పొరేట్ రంగ చరిత్రలో అతిపెద్ద బోనస్ చెల్లింపుల్లో ఒకటిగా దీన్ని భావిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా తమకున్న సిబ్బందిలో కనీసం ఏడాది సర్వీసు పూర్తిచేసుకున్నవారందరూ బోనస్ తీసుకునేందుకు అర్హులేనని తెలిపింది.

ఈ ఏడాది మార్చి చివరినాటికి కంపెనీలో దాదాపు 3.19 లక్షల  మంది ఉద్యోగులు ఉన్నారు. కాగా, ఒక్కో ఉద్యోగికి తన ఒక్కో ఏడాది సర్వీసు కాలానికి ఒక వారం జీతం చొప్పున బోనస్ ఇవ్వనున్నట్లు కంపెనీ వివరించింది. ఏప్రిల్/మే నెలల్లో చెల్లింపు   ఉంటుందని పేర్కొంది. అనేక గ్లోబల్ కంపెనీలకు తాము వ్యూహాత్మక భాగస్వాములుగా వ్యవహరిస్తున్నామని.. ఆయా ప్రాజెక్టుల నిర్వహణ, నవకల్పనల విషయంలో తమ ఉద్యోగుల సామర్థ్యమేంటో అందరికీ సుపరిచితమేనని టీసీఎస్ సీఈఓ, ఎండీ ఎన్. చంద్రశేఖరన్ ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు.

ప్రపంచంలోనే అత్యంత విలువైన, గౌరవనీయమైన టెక్నాలజీ సేవల కంపెనీగా టీసీఎస్‌ను నిలబెట్టడంలో సిబ్బంది పోషించిన సమర్థవంతమైన పాత్రకుగాను ప్రత్యేక రివార్డుగా ఈ బోనస్‌ను ఇస్తున్నట్లు ఆయన చెప్పారు. కాగా, 2004లో స్టాక్ మార్కెట్లో లిస్టయిన టీసీఎస్.. మార్కెట్ క్యాపిటలైజేషన్(కంపెనీ మొత్తం షేర్ల విలువ-రూ.5.06 లక్షల కోట్లు) పరంగా ప్రస్తుతం దేశంలోనే అగ్రస్థానానికి ఎగబాకింది.

మరిన్ని వార్తలు