సాహో.. టీసీఎస్‌!

24 Apr, 2018 00:17 IST|Sakshi

కంపెనీ విలువ 100 బిలియన్‌ డాలర్లకు !

ఈ ఘనత సాధించిన తొలి భారత ఐటీ కంపెనీ

ఆల్‌టైమ్‌ హైకి షేర్‌ ధర

తర్వాతి పరుగుకు ఇది ప్రారంభం: చంద్రశేఖర్‌  

ఐటీ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌ (టీసీఎస్‌)... వంద బిలియన్‌ డాలర్ల కంపెనీగా అవతరించింది. అంచనాలను మించిన ఆర్థిక ఫలితాలతో ఈ కంపెనీ షేర్‌ ధర ఆల్‌టైమ్‌ హైని తాకటంతో... వంద బిలియన్‌ డాలర్లకు చేరిన తొలి భారత ఐటీ కంపెనీగా రికార్డ్‌ సాధించింది. ఒకప్పుడు పోటీ కంపెనీ ఇన్ఫోసిస్‌ కన్నా ఒకటిన్నర రెట్లు తక్కువగా ఉన్న ఈ కంపెనీ... ఇప్పుడు ఇన్ఫోసిస్‌ కంటే రెండున్నర రెట్లు అధిక విలువ గల కంపెనీగా మారింది. ఇన్ఫీతో కలుపుకొని విప్రో, హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్, టెక్‌ మహీంద్రాల మొత్తం మార్కెట్‌ క్యాప్‌కంటే టీసీఎస్‌ మార్కెట్‌ విలువే అధికం.

ముంబై: టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌ (టీసీఎస్‌) సోమవారం చరిత్ర సృష్టించింది. ఈ షేర్‌ ధర ఆల్‌టైమ్‌ హైని తాకటమే కాక... వంద బిలియన్‌ (పదివేల కోట్ల) డాలర్ల మార్కెట్‌ విలువ (రూ.6,60,000 కోట్లు) సాధించిన తొలి భారత ఐటీ కంపెనీగా రికార్డ్‌ సాధించింది. ఇపుడు ప్రపంచంలో ఇలా వంద బిలియన్‌ డాలర్ల మార్కెట్‌ క్యాప్‌ సాధించిన వాటిలో టీసీఎస్‌ 64వ కంపెనీగా నిలిచింది. అంతర్జాతీయం గా టాప్‌ 100 మార్కెట్‌  విలువ ఉన్న కంపెనీల్లో ఒకటి.

ఒక్క నెలలో 25 శాతం పెరిగిన షేర్‌..
గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసిక ఆర్థిక ఫలితాలు అంచనాలను మించడంతో టీసీఎస్‌ షేర్‌ దూకుడు చూపిస్తోంది. సోమవారం ఇంట్రాడేలో 4.42 శాతం లాభంతో జీవిత కాల గరిష్ట స్థాయి, రూ.3,557 ధరను తాకింది. ఈ ధర వద్ద ఈ కంపెనీ మార్కెట్‌ విలువ ఏకంగా రూ.6.8 లక్షల కోట్లు.

ఈ మైలురాయిని దాటిన తర్వాత లాభాల స్వీకరణ చోటు చేసుకోవడంతో ఈ షేర్‌ చివరకు 0.2 శాతం లాభంతో రూ.3,415 వద్ద ముగిసింది. మార్కెట్‌ క్యాప్‌ రూ.6.53 లక్షల కోట్లకు పరిమితమైంది. మార్కెట్‌ క్యాప్‌ పరంగా అగ్రస్థానంలో ఉన్న భారత కంపెనీ ఇదే. ట్రేడింగ్‌ పరిమాణం విషయానికొస్తే, బీఎస్‌ఈలో 5.06 లక్షలు, ఎన్‌ఎస్‌ఈలో 75 లక్షలకు పైగా షేర్లు ట్రేడయ్యాయి.

గత మూడు రోజుల్లో ఈ షేర్‌ 8 శాతం వరకూ పెరిగింది. ఈ మూడు రోజుల్లో రూ.48,948 కోట్ల మార్కెట్‌  క్యాప్‌ జతయింది. మొత్తం సెన్సెక్స్‌ కంపెనీల మార్కెట్‌ క్యాప్‌లో టీసీఎస్‌ కంపెనీ మార్కెట్‌ క్యాప్‌ వాటాయే 11 శాతంగా ఉంది. ఈ ఏడాది ఇప్పటిదాకా  ఈ షేర్‌ 27 శాతం ఎగసింది. ఈ ఒక్క నెలలోనే ఈ షేర్‌ 25 శాతం లాభపడటం విశేషం. గత ఎనిమిదేళ్లలో ఈ షేర్‌ ఈ స్థాయిలో(ఒక్క నెలలో 25 శాతం) లాభపడటం ఇదే మొదటిసారి.

ఇంతకు ముందు రిలయన్స్‌..
కాగా 2007లోనే రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ వంద బిలియన్‌ డాలర్ల మార్కెట్‌ క్యాప్‌ సాధించిన తొలి భారత కంపెనీగా అవతరించింది. 2007, అక్టోబర్‌ 18న ఈ కంపెనీ ఈ ఘనతను సాధించింది. అప్పుడు డాలర్‌తో రూపాయి మారకం 39.59గా ఉంది. ఇప్పుడు ఈ విలువ 66పైగానే ఉంది.

14 ఏళ్లలో...1,300 శాతం వృద్ధి
1970లో కార్యకలాపాలు ప్రారంభించిన టీసీఎస్‌ 2004లో ఐపీఓకు (ఇనీషియల్‌ పబ్లిక్‌ ఆఫర్‌) వచ్చింది. ఇష్యూ ధర రూ.850. 2008 చివరి నాటికి రూ.206గా ఉన్న కంపెనీ షేర్‌ సోమవారం నాటికి ఆల్‌టైమ్‌ హై, రూ.3,557ను తాకింది. పదేళ్లలో 16 రెట్లు పెరిగింది. 2004, ఆగస్టు 25న ఈ షేర్‌ స్టాక్‌ మార్కెట్లో లిస్టయింది. అప్పటి నుంచి చూస్తే, ఈ షేర్‌ 1,300 శాతం (బోనస్‌లు, డివిడెండ్‌లు, షేర్ల విభజన అన్నింటిని పరిగణనలోకి తీసుకుంటే) పెరిగింది.

ఈ 13 ఏళ్లలో 21.3 శాతం చక్రగతిన వృద్ధి సాధించింది. ఇదే కాలానికి ఇన్ఫోసిస్‌ 14 శాతం చక్రగతి వృద్ధి చెందింది. టీసీఎస్‌ లిస్టింగ్‌ రోజున  రూ.10,000 ఇన్వెస్ట్‌ చేసి ఉంటే, ఈ 13 ఏళ్లలో ఆ మొత్తం రూ.1.40 లక్షలయ్యేది (డివిడెండ్‌లు మినహాయించుకొని). మార్కెట్‌ క్యాప్‌పరంగా అతి పెద్ద కంపెనీగా టీసీఎస్‌ అవతరించినప్పటికీ, ఇన్వెస్టర్లకు రాబడుల పరంగా కొన్ని ఐటీ కంపెనీలతో పోలిస్తే టీసీఎస్‌ వెనకబడే ఉంది.


నేను చాలా చాలా సంతోషిస్తున్నాను. ఇది ప్రత్యేకమైన సందర్భం, ఈ రోజు కోసమే ఎదురు చూస్తున్నాం. రానున్న నెలలు, క్వార్టర్లో టీసీఎస్‌ మరింత జోరు చూపిస్తుంది. తర్వాతి పరుగుకు ఇది ప్రారంభం మాత్రమే. –ఎన్, చంద్రశేఖరన్, టీసీఎస్‌ చైర్మన్‌

1970లో 25 మంది ఉద్యోగులతో ఆరంభమైన టీసీఎస్‌.. ఈ స్థాయికి విస్తరిస్తుందని ఎవరూ ఊహించి ఉండరు. ప్రపంచంలో ఏ వ్యక్తికి అవసరమైన సేవలనైనా అత్యుత్తమ టెక్నాలజీలతో అందించగలిగాం. రామదొరై, చంద్ర ల సారథ్యంలో జోరుగా వృద్ధి చెందాం. ఇదొక అద్భుత ప్రయాణం.  –ఎస్‌. మహాలింగమ్, టీసీఎస్‌ మాజీ సీఎఫ్‌ఓ


ఇన్ఫీ కంటే ఇంతింతై...
2009, మార్చిలో ఇన్ఫోసిస్‌ మార్కెట్‌ క్యాప్‌కంటే టీసీఎస్‌ మార్కెట్‌ క్యాప్‌ ఒకటిన్నర రెట్లు తక్కువ. 2009 చివరకు వచ్చేసరికి మార్కెట్‌ క్యాప్‌ విషయంలో రెండు కంపెనీలు సరిసమానంగా ఉన్నాయి. ఇక ఇప్పుడు ఇన్పీ కంటే టీసీఎస్‌ మార్కెట్‌ క్యాప్‌ రెండున్నర రెట్లు అధికం కావడం విశేషం.

అంతే కాకుండా ఇన్ఫోసిస్‌తో కలుపుకొని మరో మూడు ఐటీ దిగ్గజాలు–విప్రో, హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్, టెక్‌ మహీంద్రాల మొత్తం మార్కెట్‌ క్యాప్‌ కంటే కూడా టీసీఎస్‌ మార్కెట్‌ క్యాప్‌ అధికం కావడం ప్రస్తావించదగ్గ విషయం. ప్రస్తుతం విలువ పరంగా రెండో స్థానంలో ఉన్న రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌తో పోల్చితే టీసీఎస్‌ మార్కెట్‌ క్యాప్‌ రూ.61,000 కోట్లు అధికం.

టీసీఎస్‌... ఇవీ ఘనతలు
టాటా గ్రూప్‌ ఆదాయంలో 85 శాతం వాటా టీసీఎస్‌దే.
 టీసీఎస్‌లో ప్రస్తుతం 3,87,200 మంది ఉద్యోగులున్నారు. వీరంతా 130 దేశాలకు చెందిన వారు కావడం విశేషం.
పాకిస్తాన్‌ స్టాక్‌ ఎక్సే్చంజ్‌లో లిస్టయిన మొత్తం 577 కంపెనీల మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌(81.38 బిలియన్‌ డాలర్లు)తో పోల్చినా ఒక్క టీసీఎస్‌ మార్కెట్‌ క్యాప్‌ కంటే కూడా తక్కువే.
ప్రపంచ ఐటీ దిగ్గజం యాక్సెంచర్‌ మార్కెట్‌ క్యాప్‌(98 బిలియన్‌ డాలర్లు)ను కూడా టీసీఎస్‌ అధిగమించేసింది.


మార్కెట్‌ క్యాప్‌ మైలురాళ్లు
సంవత్సరం     మార్కెట్‌క్యాప్‌ (బిలియన్‌ డాలర్లు)
2004             ఐపీఓ
2005              10
2010              25
2013              50
2014             75
2018            100

మరిన్ని వార్తలు