భారీగా పెరిగిన టీసీఎస్‌ సీఈవో వేతనం

24 May, 2018 17:58 IST|Sakshi
రాజేష్‌ గోపినాథన్‌ (ఫైల్‌ ఫోటో)

ముంబై : దేశంలో అతిపెద్ద టెక్‌ దిగ్గజంగా పేరున్న టీసీఎస్‌ను నడిపిస్తున్న సీఈవో రాజేష్‌ గోపినాథన్‌ వేతనం భారీగా పెరిగింది. ఆయన వేతానాన్ని గతేడాది కంటే ఈ ఏడాది రెండింతలు చేసింది ఆ కంపెనీ. 2018 ఆర్థిక సంవత్సరంలో గోపినాథన్‌ దాదాపు రూ.12 కోట్లకు పైగా ఆర్జించారని, ఇది 2017 ఆర్థిక సంవత్సరానికి రెండింతలు ఎక్కువని కంపెనీ తన వార్షిక రిపోర్టులో వెల్లడించింది. టాప్‌ జాబ్‌కు ఆయన్ను ఎంపిక చేసిన అనంతరమే ఈ పెంపును కంపెనీ భారీగా చేపట్టింది. అంతకముందు గోపినాథన్‌ టీసీఎస్‌లో చీఫ్‌ ఫైనాన్సియల్‌ ఆఫీసర్‌గా పనిచేసేవారు. గోపినాథన్‌ అందుకునే రెమ్యునరేషన్‌లో రూ.1.02 కోట్ల బేస్‌ శాలరీ, రూ.10 కోట్ల కమిషన్‌, రూ. 86.8 లక్షల ఇతర అలవెన్స్‌లు, ఇతరాత్రవి ఉన్నాయి. 2017 ఆర్థిక సంవత్సరంలో ఆయన కేవలం రూ.6.2 కోట్లను మాత్రమే ఇంటికి తీసుకెళ్లేవారు. ప్రస్తుతం గోపినాథన్‌ పుచ్చుకుంటున్న రెమ్యునరేషన్‌, సాధారణ టీసీఎస్‌ ఉద్యోగి అందుకునే రెమ్యునరేషన్‌ ఆర్జించే స్థాయి కంటే 212 సార్లు ఎక్కువ.

ఇతర ఎగ్జిక్యూటివ్‌లు, నాన్‌-ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్ల వేతనాలను కూడా కంపెనీ బయటికి విడుదల చేసింది. వారిలో టాప్‌లో రెండో స్థానంలో ఉన్న సీఓఓ ఎన్‌ గణపతి సుబ్రహ్మణ్యం రూ.9 కోట్లకు పైగా రెమ్యునరేషన్‌ పొందుతున్నట్టు తెలిసింది. ఈయన కూడా ముందటి ఆర్థిక సంవత్సరంలో కేవలం రూ.6.15 కోట్లను మాత్రమే పరిహారాలుగా పొందేవారు. 2017 ఫిబ్రవరిలోనే వీరిద్దరూ తమ బాధ్యతలను స్వీకరించారు. గోపినాథన్‌ 2001 నుంచి టీసీఎస్‌లో పనిచేస్తున్నారు. 2013 ఫిబ్రవరిలో కంపెనీ సీఎఫ్‌ఓగా ఎంపికయ్యారు. టాటా ఇండస్ట్రీస్‌లో కూడా పనిచేసిన అనుభవం ఈయనకు ఉంది. మార్చి క్వార్టర్‌ ఫలితాల సందర్భంగా క్వార్టర్లీ ఇచ్చే వేరియబుల్‌ పేను 120 శాతం ఆఫర్‌ చేస్తున్నట్టు ప్రకటించింది. తమకు వచ్చిన మెరుగైన క్వార్టర్‌ ఫలితాల ప్రయోజనాలను ఉద్యోగులకు చేరవేస్తామని తెలిపింది. 2019 ఆర్థిక సంవత్సరంలో వేతన పెంపులు 2 శాతం నుంచి 6 శాతం వరకు ఉంటాయని కంపెనీ చెప్పింది. 

మరిన్ని వార్తలు