అంచనాలు మించిన టీసీఎస్‌

11 Jul, 2018 00:16 IST|Sakshi

క్యూ1లో నికర లాభం 23% అప్‌

రూ. 7,340 కోట్లుగా నమోదు

బీఎఫ్‌ఎస్‌ఐ వ్యాపార విభాగం ఊతం

రూ. 4 మధ్యంతర డివిడెండ్‌  

ముంబై: అంచనాలను మించిన లాభాలతో ఐటీ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌ (టీసీఎస్‌) తొలి త్రైమాసిక ఆర్థిక ఫలితాల సీజన్‌ని ప్రారంభించింది. బ్యాంకింగ్, ఫైనాన్షియల్, ఇన్సూరెన్స్‌ వ్యాపార విభాగాల ఊతంతో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం క్యూ1లో కంపెనీ నికర లాభం 23 శాతం ఎగిసింది. రూ. 7,340 కోట్లుగా నమోదైంది.

గత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో ఇది రూ. 5,945 కోట్లు. క్యూ1లో టీసీఎస్‌ లాభాలు సుమారు రూ. 6,957 కోట్ల మేర ఉండొచ్చని మార్కెట్‌ వర్గాలు అంచనా వేశాయి. మరోవైపు, ఆదాయం సైతం సుమారు 15.8 శాతం వృద్ధితో రూ. 29,584 కోట్ల నుంచి రూ. 34,261 కోట్లకు ఎగిసింది. సీక్వెన్షియల్‌గా చూస్తే కంపెనీ నికర లాభం 6.3 శాతం, ఆదాయం 6.8 శాతం పెరిగాయి.  షేరు ఒక్కింటికి రూ. 4 మేర మధ్యంతర డివిడెండ్‌ ఇవ్వనున్నట్లు కంపెనీ ప్రకటించింది. టాటా గ్రూప్‌ లాభాల్లో సింహభాగం వాటా టీసీఎస్‌దే ఉంటోంది.  

‘మెరుగైన ఆర్థిక ఫలితాలతో కొత్త ఆర్థిక సంవత్సరంలోకి అడుగుపెడుతున్నాం. బ్యాంకింగ్‌ విభాగం ఈ క్వార్టర్‌లో గణనీయంగా కోలుకుంది. మిగతా వ్యాపార విభాగాలు కూడా మెరుగైన పనితీరే కొనసాగిస్తున్నాయి. నిలకడగా మెరుగైన వృద్ధి రేటును కొనసాగించగలం‘ అని టీసీఎస్‌ సీఈవో, ఎండీ రాజేశ్‌ గోపీనాథన్‌ ధీమా వ్యక్తం చేశారు. స్థిర కరెన్సీ మారకం విలువ ప్రాతిపదికన 9.3 శాతం మేర ఆదాయ వృద్ధి సాధించినట్లు పేర్కొన్నారు.

పూర్తి ఆర్థిక సంవత్సరంలో  పరిశ్రమ సమాఖ్య నాస్కామ్‌ వార్షిక లక్ష్యానికి మించి రెండంకెల స్థాయి వృద్ధిని టార్గెట్‌గా పెట్టుకున్నట్లు ఆయన వివరించారు. కీలక క్లయింట్లు.. టెక్నాలజీపై పెట్టుబడులు గణనీయంగా పెంచుకుంటుండటం, పెద్ద సంఖ్యలో డీల్స్‌ ఇందుకు తోడ్పడగలవని గోపీనాథన్‌ తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌లో ఆరోగ్య బీమా పథకానికి డిజైన్‌ చేసిన నమూనానే కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్టు ఆయుష్మాన్‌ భారత్‌ పథకానికి కూడా ఉపయోగించనున్నట్లు ఆయన పేర్కొన్నారు.  

తొలి త్రైమాసికంలో కొత్త డీల్స్‌..
క్యూ1లో కొత్తగా 100 మిలియన్‌ డాలర్ల పైబడిన డీల్స్‌ రెండు దక్కించుకున్నట్లు టీసీఎస్‌ పేర్కొంది. అలాగే 5 మిలియన్‌ డాలర్ల పైబడిన కేటగిరీలో కొత్తగా 13 క్లయింట్స్‌ జతయినట్లు వివరించింది. ఐటీ సర్వీసుల విభాగంలో ఉద్యోగుల వలసల రేటు (అట్రిషన్‌) స్వల్పంగా 0.1 శాతం తగ్గి 10.9 శాతానికి పరిమితమైంది. జూన్‌ క్వార్టర్‌ ఆఖరు నాటికి సంస్థలో ఉద్యోగుల సంఖ్య (కన్సాలిడేటెడ్‌) 4 లక్షల మార్కును దాటి 4,00,875గా ఉంది.

గత క్యూ1తో పోలిస్తే ప్రస్తుత క్యూ1లో రిక్రూట్‌మెంట్‌ నికరంగా 5,800 మంది ఉద్యోగుల మేర పెరిగింది. సిబ్బందిలో మహిళా ఉద్యోగుల సంఖ్య 35.6 శాతానికి చేరింది. జూన్‌ త్రైమాసికంలో కొత్తగా 62 పేటెంట్లకు దరఖాస్తు చేసినట్లు, దీంతో మొత్తం పేటెంట్ల దరఖాస్తుల సంఖ్య 3,978కి చేరినట్లు సంస్థ తెలిపింది. 715 పేటెంట్లు మంజూరు అయినట్లు వివరించింది.

తొలి త్రైమాసికంలో వేతనాల పెంపు, వీసా వ్యయాల పెరుగుదల రూపంలో ప్రతికూల అంశాలు ఎదురైనప్పటికీ.. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం నాలుగు శాతం క్షీణించిన నేపథ్యంలో ఆ ప్రభావం కొంత తగ్గినట్లు చీఫ్‌ ఫైనాన్షియల్‌ ఆఫీసర్‌ (సీఎఫ్‌వో) వి. రామకృష్ణన్‌ తెలిపారు. ఉద్యోగుల టెక్నాలజీ నైపుణ్యాలను మెరుగుపర్చేందుకు శిక్షణపై మరింతగా ఇన్వెస్ట్‌ చేయనున్నట్లు వివరించారు.

కరెన్సీ ప్రభావాలు ఎలా ఉన్నప్పటికీ.. యూరప్‌ వంటి డాలర్‌యేతర ఎకానమీల్లో వ్యాపార అవకాశాల అన్వేషణ కొనసాగుతుందన్నారు. మరోవైపు, సొంత ఉత్పత్తులను మెరుగుపర్చుకోవడంతో పాటు కొత్త ఉత్పత్తుల కొనుగోలుకు కూడా ప్రాధాన్యమివ్వనున్నట్లు టీసీఎస్‌ సీవోవో ఎన్‌జీ సుబ్రమణియం చెప్పారు.  

బ్యాంకింగ్‌ సేవల్లో 4.1 శాతం వృద్ధి ..
బీఎఫ్‌ఎస్‌ఐ విభాగం వ్యాపారం 4.1 శాతం వృద్ధి నమోదు చేసింది. గడిచిన 15 త్రైమాసికాల్లో ఇదే అత్యధికం. ఇక,  ఇతర విభాగాల్లో ఎనర్జీ అత్యధికంగా 30.9 శాతం, తయారీ 6.9 శాతం, రిటైల్‌ అండ్‌ కన్జూమర్‌ బిజినెస్‌ 12.7 శాతం, కమ్యూనికేషన్‌ 9.5 శాతం మేర వృద్ధి నమోదు చేశాయి. క్రితం త్రైమాసికంతో పోలిస్తే డిజిటల్‌ విభాగం ఆదాయ వృద్ధి ఏకంగా 44 శాతం ఎగిసింది. మొత్తం ఆదాయంలో దీని వాటా నాలుగో వంతుగా ఉంటోంది.  

మరిన్ని వార్తలు