అదరగొట్టిన టీసీఎస్‌, కొత్తగా పదివేల మంది ఉద్యోగులు

11 Oct, 2018 19:09 IST|Sakshi

ముంబై : దేశీయ అతిపెద్ద సాఫ్ట్‌వేర్‌ దిగ్గజం టీసీఎస్‌ అదరగొట్టింది. రెండో క్వార్టర్‌ లాభాల్లో 23 శాతం ఎగిసింది. ఏడాది ఏడాదికి కంపెనీ లాభాలు రూ.7,901 కోట్లగా రికార్డైనట్టు టీసీఎస్‌ బీఎస్‌ఈ ఫైలింగ్‌లో పేర్కొంది. ముంబై ప్రధాన కార్యాలయంగా పనిచేస్తున్న ఈ కంపెనీ, గతేడాది ఇదే క్వార్టర్‌లో రూ.6,646 కోట్ల నికర లాభాలను ఆర్జించింది. క్వార్టర్‌ రివ్యూలో కంపెనీ రెవెన్యూలు రూ.36,854 కోట్లగా రికార్డయ్యాయి. గతేడాది ఇవి రూ.30,541 కోట్లగా ఉన్నాయి. ఫలితాల ప్రకటన సందర్భంగా ఒక్కో షేరుపై రూ.4 తాత్కాలిక డివిడెండ్‌ను ప్రకటించింది టీసీఎస్‌. కంపెనీ సభ్యులుగా రిజిస్టర్‌లో నమోదైన షేర్‌ హోల్డర్స్‌కు లేదా షేర్ల లాభదాయక ఓనర్లుగా ఉన్న వారికి ఈ డివిడెండ్‌ను ఇవ్వనున్నట్టు తెలిపింది. ఈ క్వార్టర్‌లో ఆపరేటింగ్‌ మార్జిన్‌ 26.5 శాతానికి పెరిగింది. స్థిర నగదులో రెవెన్యూలు ఏడాది ఏడాదికి 11.50 శాతం పెరిగాయి. 

ఈ క్వార్టర్‌లో నెట్‌ బేసిస్‌లో కొత్తగా 10,227 మంది ఉద్యోగులను కంపెనీలోకి చేర్చుకున్నట్టు టీసీఎస్‌ ప్రకటించింది. గత 12 క్వార్టర్‌లలో ఇదే అత్యధికమని తెలిసింది. దీంతో మొత్తం ఉద్యోగుల సంఖ్య కన్సాలిడేషన్‌ బేసిస్‌లో 4,11,102 కు పెరిగింది. తమ కంపెనీ మహిళా ఉద్యోగులు 35.7 శాతంగా ఉన్నట్టు టీసీఎస్‌ వెల్లడించింది. 100 మిలియన్‌ డాలర్ల కేటగిరీలో కంపెనీ నలుగురు కొత్త క్లయింట్స్‌ను చేర్చుకుంది. 20 మిలియన్‌ డాలర్ల కేటగిరీలో ఏడుగురిని, 10 మిలియన్‌ ప్లస్‌ డాలర్ల కేటగిరీలో 10 మందిని చేర్చుకున్నట్టు ప్రకటించింది. 

మరిన్ని వార్తలు