టీసీఎస్‌ లాభం 8,049 కోట్లు

17 Apr, 2020 03:44 IST|Sakshi

1 శాతం మేర తగ్గుదల 

రూ.39,946 కోట్లకు ఆదాయం

ఒక్కో షేర్‌కు రూ.6 తుది డివిడెండ్‌ 

అత్యధిక డీల్స్‌ ఈ మార్చి క్వార్టర్‌లోనే  

ముంబై: ఐటీ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌ (టీసీఎస్‌) గత ఆర్థిక సంవత్సరం (2019–20) నాలుగో త్రైమాసిక కాలంలో రూ.8,049 కోట్ల నికర లాభం  (కన్సాలిడేటెడ్‌)సాధించింది.  అంతకు ముందటి ఆర్థిక సంవత్సరం (2018–19) క్యూ4లో ఆర్జించిన నికర లాభం (రూ.8,126 కోట్లు)తో పోల్చి తే 1 శాతం మేర తగ్గిందని టీసీఎస్‌ తెలిపింది. ఆదాయం మాత్రం రూ.38,010 కోట్ల నుంచి 5 శాతం వృద్ధితో రూ.39,946 కోట్లకు పెరిగిందని పేర్కొంది.   ఇక పూర్తి ఆర్థిక సంవత్సరం పరంగా చూస్తే, నికర లాభం 3 శాతం వృద్ధితో రూ.32,340 కోట్లకు, ఆదాయం 7 శాతం ఎగసి రూ.1,56,949 కోట్లకు పెరిగాయి. ఒక్కో ఈక్విటీ షేర్‌కు రూ.6 తుది డివిడెండ్‌ను(600 శాతం) ప్రకటించింది. మరిన్ని

వివరాలు...
► ఇతర ఆదాయం తక్కువగా రావడం, అధిక వడ్డీ వ్యయాలు, లాక్‌డౌన్‌ విధింపు(దేశీయంగా, అంతర్జాతీయంగా) లాభదాయకతపై ప్రభావం చూపాయి.  
► డాలర్ల పరంగా చూస్తే, ఆదాయం 3 శాతం తగ్గి 544 కోట్ల డాలర్లకు తగ్గింది. స్థిర కరెన్సీ పరంగా చూస్తే, ఆదాయం 3 శాతం పెరిగింది. ఆదాయం అంతకు ముందటి ఆర్థిక సంవత్సరం క్యూ4లో 13 శాతం, గత క్యూ3లో 7 శాతం చొప్పున వృద్ధి చెందాయి.  
► గత క్యూ4లో ఎబిట్‌ అర శాతం వృద్ధితో (సీక్వెన్షియల్‌గా) రూ.10,025 కోట్లకు పెరిగింది. మార్జిన్‌ 10 బేసిస్‌ పాయింట్లు పెరిగి 25.1 శాతానికి చేరింది.  
► పూర్తి ఆర్థిక సంవత్సరానికి (2019–20) ఎబిట్‌ 3 శాతం వృద్ధితో రూ.38,580 కోట్లకు పెరగ్గా, మార్జిన్‌ మాత్రం 1 శాతం మేర తగ్గి 24.58 శాతానికి చేరింది.  
► గత క్యూ4లో మొత్తం 1,789 మందికి ఉద్యోగాలిచ్చింది. మొత్తం ఆర్థిక సంవత్సరానికి 24,179 మందికి కొలువులిచ్చింది. దీంతో కంపెనీ మొత్తం ఉద్యోగుల సంఖ్య 4,48,464కు పెరిగింది. ఉద్యోగుల వలస (అట్రిషన్‌ రేటు) 12.1 శాతంగా ఉంది.   
► గత ఆర్థిక సంవత్సరంలో నికరంగా రూ.37,702 కోట్ల మేర డివిడెండ్‌లు చెల్లించింది. ఈ మార్చి క్వార్టర్‌లో ఒక్కో షేర్‌కు రూ. 12 మధ్యంతర డివిడెండ్‌ను ఇచ్చింది. తాజాగా ప్రకటించిన రూ.6 తుది డివిడెండ్‌ను కూడా కలుపుకుంటే, ఈ మార్చి క్వార్టర్‌లో కంపెనీ  మొత్తం డివిడెండ్‌ ఒక్కో షేర్‌కు రూ.18కు పెరుగుతుంది.

 
మార్కెట్‌ ముగిసిన తర్వాత టీసీఎస్‌ ఫలితాలు వచ్చాయి. ఫలితాలపై అనిశ్చితితో బీఎస్‌ఈలో టీసీఎస్‌ షేర్‌ 1 శాతం నష్టంతో రూ. 1,715 వద్ద ముగిసింది.   

ఉద్యోగాల కోత ఉండదు..
కరోనా ప్రతికూలతలు ఉన్నప్పటికీ ఉద్యోగాల్లో కోత విధించే యోచనేదీ లేదని టీసీఎస్‌ ఎండీ రాజేశ్‌ గోపీనాథన్‌ వెల్లడించారు. అయితే, ఈ ఏడాది జీతాల పెంపు మాత్రం ఉండదని తెలిపారు. మరోవైపు, ముందుగా ఆఫర్లు ఇచ్చిన సుమారు 40,000 మందిని రిక్రూట్‌ చేసుకుంటామని స్పష్టం చేశారు.
 

కరోనా కాటేసింది....
మార్చి క్వార్టర్‌ మొదట్లో చాలా వ్యాపార విభాగాలు శుభారంభం చేశాయి. కానీ  ఆ సానుకూలతలన్నింటినీ కరోనా మహమ్మారి ధ్వంసం చేసింది. గుడ్డిలో మెల్లలా కొన్ని భారీ డీల్స్‌ను  సాధించగలిగాం. కంపెనీ చరిత్రలోనే అత్యధిక ఆర్డర్లను ఈ క్వార్టర్‌లోనే సాధించాం.  

–రాజేశ్‌ గోపీనాథన్, టీసీఎస్‌ సీఈఓ, ఎమ్‌డీ

సంతృప్తికరంగానే సేవలు...
కార్యకలాపాల నిర్వహణలో కరోనా వైరస్‌ ప్రభావం ఉన్నప్పటికీ, క్లయింట్లకు సంతృప్తికరమైన స్థాయిల్లోనే ఐటీ సేవలందిస్తున్నాం. అత్యవసర సేవలే కాక, అన్ని విభాగాల సేవలను అందిస్తున్నాం.

–ఎన్‌. గణపతి సుబ్రహ్మణ్యం, టీసీఎస్‌ సీఓఓ, ఈడీ

మరిన్ని వార్తలు