టీసీఎస్‌కు 225 కోట్ల డాలర్ల ఆర్డర్‌

23 Dec, 2017 01:28 IST|Sakshi

ఒప్పందాన్ని పొడిగించిన ‘నీల్సన్‌’

 భారత ఐటీలో ఇదే అతిపెద్ద అవుట్‌సోర్సింగ్‌ కాంట్రాక్ట్‌!   

న్యూఢిల్లీ:  ఐటీ దిగ్గజం, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌(టీసీఎస్‌)... భారీ అవుట్‌ సోర్సింగ్‌ కాంట్రాక్ట్‌ను నిలబెట్టుకుంది. టీవీ చానెళ్ల  రేటింగ్‌లు, అంతర్జాతీయ మార్కెటింగ్‌ రీసెర్చ్‌ కంపెనీ, నీల్సన్‌ నుంచి 225 కోట్ల డాలర్ల (దాదాపు రూ.14,500 కోట్లు) కాంట్రాక్ట్‌ రెన్యువల్‌ను టీసీఎస్‌ సాధించింది. ఈ డీల్‌పై ఇరు కంపెనీలు ఈ ఏడాది అక్టోబర్‌లోనే సంతకాలు చేశాయి.

2007లో కుదుర్చుకున్న పదేళ్ల ఒప్పందానికి ఇది రెన్యువల్‌ అని, ఆ డీల్‌ను మరో ఐదేళ్ల పాటు నీల్సన్‌ పొడిగించిందని టీసీఎస్‌ తెలియజేసింది. ఒక భారత ఐటీ కంపెనీ సాధించిన అతి పెద్ద అవుట్‌సోర్సింగ్‌ ఆర్డర్‌ ఇదేనని నిపుణులంటున్నారు. విలువ, కాలవ్యవధుల పరంగా భారీ డీల్స్‌ బాగా తగ్గిపోతున్న ప్రస్తుత తరుణంలో  టీసీఎస్‌కు నీల్సన్‌ డీల్‌ దక్కడం ప్రాధాన్యతను సంతరించుకుంది.

మరో ఐదేళ్లు రెన్యువల్‌...
నీల్సన్‌ కంపెనీకి పదేళ్ల పాటు ఐటీ సేవలు అందించడానికి 2007లో టీసీఎస్‌ ఒక ఒప్పందం కుదుర్చుకుంది. ఈ డీల్‌ విలువ  120 కోట్ల డాలర్లు. 2013లో నీల్సన్‌ కంపెనీ ఈ డీల్‌ సైజ్‌ను రెట్టింపు చేసి (250 కోట్ల డాలర్లకు పెంచి), కాల వ్యవధిని మరో మూడేళ్లు పొడిగించింది.  తాజా డీల్‌  ప్రకారం ఈ ఒప్పందాన్ని నీల్సన్‌ మరో ఐదేళ్లు (2025 వరకూ) పొడిగించిందని టీసీఎస్‌ పేర్కొంది. ఈ ఒప్పందంలో భాగంగా నీల్సన్‌ కంపెనీ ఈ ఏడాది నుంచి 2020 వరకూ ఏటా టీసీఎస్‌ నుంచి కనీసం 32 కోట్ల డాలర్ల విలువైన ఐటీ సేవలను అందుకుంటుంది. 2021 నుంచి 2024 వరకూ ఏడాదికి కనీసం 18.6 కోట్ల డాలర్లు, 2025లో 14 కోట్ల డాలర్ల చొప్పున ఐటీ సర్వీసులను కొనుగోలు చేస్తుంది.


గోపీనాథన్‌కు జోష్‌...
టీసీఎస్‌కు సీఈవోగా పనిచేసిన ఎన్‌.చంద్రశేఖరన్‌ టాటా సన్స్‌ చైర్మన్‌గా నియమితులు కావడంతో ఆయన స్థానంలోకి రాజేశ్‌ గోపీనాథన్‌ వచ్చారు. రాజేశ్‌ గోపీనాథన్‌కు ఈ భారీ డీల్‌ మంచి జోష్‌ నిస్తుందని, ఈ డీల్‌ కుదిరిన ఉత్సాహంతో ఆయన మరిన్ని భారీ డీల్స్‌పై దృష్టి పెడతారని విశ్లేషకులు భావిస్తున్నారు. డీల్‌ వార్తలతో   టీసీఎస్‌ షేర్‌ 1.8% లాభంతో రూ.2,640 వద్ద ముగిసింది.

మరిన్ని వార్తలు