టీడీఎస్‌ పేరిట రూ.3,200 కోట్లు స్వాహా!

5 Mar, 2018 23:55 IST|Sakshi

ఉద్యోగుల వేతనాల నుంచి టీడీఎస్‌ కోతలు

ఆదాయపన్ను శాఖకు జమ చేయని కంపెనీలు

 అవన్నీ సొంత వ్యాపార అవసరాలకు మళ్లింపు  

న్యూఢిల్లీ: నీరవ్‌ మోదీ 12,700 కోట్ల స్కామ్‌ దేశ బ్యాంకింగ్‌ రంగాన్ని కుదిపేస్తే... మరోవంక టీడీఎస్‌ రూపంలో కంపెనీలు రూ.3,200 కోట్ల మేర భారీ అక్రమాలకు పాల్పడిన విషయం వెలుగులోకి వచ్చింది. టీడీఎస్‌ అంటే... ఉద్యోగుల జీతం నుంచి ఆదాయపు పన్ను నిమిత్తం నెల నెలా కోత వేసే మొత్తం. ప్రతీ ఆర్థిక సంవత్సరానికి సంబంధించి కంపెనీలు తమ ఉద్యోగుల వార్షికాదాయం గనక పన్ను చెల్లించేటంత ఉంటే ఆ మేరకు టీడీఎస్‌ను మినహాయించి వారి పేరిట ఆదాయపన్ను శాఖకు జమ చేస్తుంటాయి. అయితే 2017–18 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి 447 కంపెనీలు టీడీఎస్‌ సొమ్మును జమ చేయకుండా పక్కదారి పట్టించినట్టు ఆ శాఖ గుర్తించింది. ఈ నిధుల్ని కంపెనీలు మూలధన అవసరాలు, ఇతర వ్యాపార కార్యకలాపాలకు వాడేసుకున్నాయి. ఈ మేరకు ఆదాయపన్ను శాఖ వర్గాలను ఉటంకిస్తూ... ఓ ఆంగ్ల దినపత్రిక కథనాన్ని ప్రచురించింది. ఇలా టీడీఎస్‌ ఎగవేతలకు పాల్పడిన వాటిలో ఇన్‌ఫ్రా కంపెనీలు, చిత్ర నిర్మాణ సంస్థలు, ఇతర కంపెనీలు ఉన్నాయి. కొన్ని కంపెనీలు టీడీఎస్‌ సొమ్ములో సగం మేర జమ చేసి, మిగిలిన సగాన్ని తమ అవసరాలకు వాడుకున్నట్టు తెలిసింది. ఈ సంస్థలపై ఆదాయపన్ను చట్టంలోని సెక్షన్‌ 276బి కింద విచారణ ప్రారంభించినట్లు సమాచారం. 

ఐటీ శాఖలో ఈ–కమ్యూనికేషన్‌ వ్యవస్థ
ప్రత్యక్ష పన్నుల కేంద్ర మండలి (సీబీడీటీ) దేశవ్యాప్తంగా పన్ను చెల్లింపుదారులతో ప్రత్యక్ష సంబం ధాల కోసం కాగిత రహిత ఆన్‌లైన్‌ విధానాన్ని ప్రవేశపెట్టనుంది. ఈ–కమ్యూనికేషన్‌ వ్యవస్థను ఆదాయపన్ను శాఖలో ఏర్పాటు చేస్తారు. ఆ విభాగం ఏ పన్ను చెల్లింపుదారుడికైనా సమాచారం, ఇతర ధ్రువీకరణలకు ఆన్‌లైన్‌లోనే ఈమెయిల్‌కు నోటీసు లు పంపుతుంది. ఈ విషయాన్ని మొబైల్‌కు సందేశం పంపడం ద్వారా తెలియజేస్తారు. ఈ కమ్యూనికేషన్‌ సెంటర్‌లో ఏర్పాటు చేసే మెషీన్‌ పన్ను చెల్లింపుదారుల స్పందనను నమోదు చేయనుంది.   

మరిన్ని వార్తలు