టీబాక్స్ లో రతన్ టాటా పెట్టుబడులు

28 Jan, 2016 00:16 IST|Sakshi
టీబాక్స్ లో రతన్ టాటా పెట్టుబడులు

కొనసాగుతున్న స్టార్టప్ ఇన్వెస్ట్‌మెంట్స్ జోరు
న్యూఢిల్లీ: స్టార్టప్‌లలో ప్రముఖ పారిశ్రామికవేత్త రతన్ టాటా పెట్టుబడుల జోరు కొనసాగుతోంది. తాజాగా ఆయన స్పెషాల్టీ టీ సంస్థ టీబాక్స్‌లో పెట్టుబడులు పెట్టారు. రతన్ టాటా తమ సంస్థలో పెట్టుబడులు పెట్టారని తెలిపిన టీబాక్స్ సంస్థ ఎంత మొత్తంలో పెట్టుబడులు పెట్టిందీ వెల్లడించలేదు.

 ఇతర దేశాల్లో విస్తరించడానికి రతన్ టాటా పెట్టుబడులు తమకు ఇతోధికంగా సాయపడతాయని టీబాక్స్ వ్యవస్థాపకుడు, సీఈఓ కూడా అయిన కుశాల్ దుగార్ చెప్పారు. ఆయన ప్రత్యక్ష మార్గదర్శకత్వంలో తాము భారత్ నుంచి తొలి అంతర్జాతీయ ప్రీమియం టీ బ్రాండ్‌గా వృద్ధి చెందగలమన్న ధీమాను దుగార్ వ్యక్తం చేశారు. 2012లో ప్రారంభమైన తమ సంస్థ డార్జిలింగ్, అస్సామ్, నీల్‌గిరి, నేపాల్‌ల నుంచి సేకరించిన టీ ఉత్పత్తులను ప్రపంచ వ్యాప్తంగా అందిస్తోందని తెలిపారు. 93 దేశాల్లోని వినియోగదారులకు ఇప్పటిదాకా 3 కోట్ల కప్పుల టీని అందించామని వివరించారు.

 టాటా సన్స్ చైర్మన్ ఎమెరిటస్ రతన్ టాటా స్టార్టప్‌ల్లో జోరుగా పెట్టుబడులు పెడుతున్నారు. ఈ కామర్స్ నుంచి క్యాబ్ అగ్రిగేటర్ల వరకూ వివిధ స్టార్టప్‌ల్లో ఆయన ఇన్వెస్ట్ చేస్తున్నారు. స్నాప్‌డీల్, కార్యా, అర్బన్ లాడర్, బ్లూస్టోన్, కార్‌దేఖో, సబ్‌సే టెక్నాలజీస్, షియోమి, ఓలా..... ఆయన ఇన్వెస్ట్ చేసిన కొన్ని సంస్థలు. కలారి క్యాపిటల్, జంగ్లీ వెంచర్స్ వంటి వెంచర్ క్యాపిటల్ ఫండ్స్‌లోనూ ఆయన పెట్టుబడులు ఉన్నాయి. కాగా టీమ్ వర్క్, టైమింగ్, ప్రణాళిక, నవకల్పన... ఇవన్నీ విజయానికి మెట్లు అని రతన్ టాటా చెప్పారు. చెన్నైలోని ఎస్‌ఆర్‌ఎం యూనివర్సిటీ విద్యార్ధులతో రతన్ టాటా ఇష్టాగోష్టిగా మాట్లాడారు.

మరిన్ని వార్తలు