-

టెక్‌ జాబ్స్‌.. బెంగళూరులోనే ఎక్కువ!!

12 Jun, 2018 00:43 IST|Sakshi

నాల్గవ స్థానంలో హైదరాబాద్‌: ఇన్‌డీడ్‌  

న్యూఢిల్లీ: టెక్నాలజీ రంగంలో ఉద్యోగాలు కావాలనుకున్నవారు బెంగళూరుకు వెళ్లి ప్రయత్నించటమే ఉత్తమ మార్గంగా కనిపిస్తోంది. ఎందుకంటే ఈ రంగంలో ఎక్కువ ఉద్యోగ అవకాశాలు బెంగళూరులోనే ఉన్నాయి. దీని తర్వాత రెండు, మూడు స్థానాల్లో వరుసగా ఢిల్లీ– ఎన్‌సీఆర్, పుణే నిలిచాయి. ప్రముఖ జాబ్‌ పోర్టల్‌ ‘ఇన్‌డీడ్‌’ సమాచారం ప్రకారం... టెక్నాలజీ రంగంలోని మొత్తం జాబ్‌ పోస్టింగ్‌లను పరిశీలిస్తే.. బెంగళూరు 22 శాతం వాటాతో అగ్రస్థానాన్ని కైవసం చేసుకుంది.

ఢిల్లీ–ఎన్‌సీఆర్‌ 11 శాతం వాటాతో రెండో స్థానాన్ని, పుణే 10 శాతం వాటాతో మూడో స్థానాన్ని దక్కించుకున్నాయి. ఇక వీటి తర్వాతి స్థానాల్లో హైదరాబాద్‌ (9 శాతం), ముంబై (8 శాతం), చెన్నై (7 శాతం), మొహాలి (4 శాతం), అహ్మదాబాద్‌ (3 శాతం) ఉన్నాయి. టెక్నాలజీ రంగంలోని ఉద్యోగ అవకాశాల్లో భారత సిలికాన్‌ వ్యాలీగా పిలిచే బెంగళూరు టాప్‌లో నిలవడం ఆశ్చర్యమేమీ కాదని ఇన్‌డీడ్‌ అభిప్రాయపడింది.

20– 29 ఏళ్ల వయసు గ్రూప్‌ వారు ఎక్కువగా ఉద్యోగ అవకాశాల వేటలో ఉన్నారని తెలియజేసింది. కంపెనీలు కూడా వీరినే ఎక్కువగా నియమించుకుంటున్నాయని పేర్కొంది. ‘‘55 ఏళ్లపైన వయసున్న వారు కూడా టెక్‌ జాబ్స్‌పై ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు. 40–49 ఏళ్ల గ్రూప్‌ వారు మాత్రం తక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు’’ అని ఇన్‌డీడ్‌ తెలిపింది. కాగా ఇన్‌డీడ్‌ గత  సర్వేలో బ్లాక్‌చైన్‌ సంబంధిత జాబ్స్‌ అంశంలో కూడా బెంగళూరే టాప్‌లో ఉంది.

మరిన్ని వార్తలు