టెక్నో పెయింట్స్‌ మరింత కలర్‌ఫుల్‌

8 Feb, 2020 06:01 IST|Sakshi
కలర్‌ స్పెక్ట్రాతో మూర్తి, శ్రీనివాస్‌ రెడ్డి, సత్యనారాయణ రెడ్డి, అనిల్‌ (ఎడమ నుంచి)

కంపెనీ నుంచి 1,800 నూతన రంగులు

రూ. 25 కోట్లతో మరో తయారీ కేంద్రం

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: పెయింట్స్‌ తయారీలో ఉన్న హైదరాబాద్‌ కంపెనీ టెక్నో పెయింట్స్‌ 1,800 రకాల కొత్త రంగులను పరిచయం చేసింది. వీటిలో యాంటీ బ్యాక్టీరియల్, ఇన్‌ఫ్రారెడ్‌ రిఫ్లెక్టివ్‌ పెయింట్లు కూడా ఉన్నాయి. దిగ్గజ కంపెనీలకు ధీటుగా కలర్‌ స్పెక్ట్రాను రూపొందించింది. దీని ద్వారా నచ్చిన రంగులు ఎంచుకోవడానికి కస్టమర్లకు మరింత సులువు అవుతుందని టెక్నో పెయింట్స్‌ ఫౌండర్‌ ఆకూరి శ్రీనివాస్‌ రెడ్డి తెలిపారు. డైరెక్టర్లు సీవీఎల్‌ఎన్‌ మూర్తి, సత్యనారాయణ రెడ్డి, సీఈవో కె.అనిల్‌తో కలిసి శుక్రవారమిక్కడ మీడియాతో మాట్లాడారు. ఈ ఏడాది డీలర్‌ నెట్‌వర్క్‌ ద్వారా రిటైల్‌ విభాగంలోకి ప్రవేశిస్తామన్నారు. ఇప్పటికే 30 కోట్ల చదరపు అడుగులకుపైగా విస్తీర్ణంలో ప్రాజెక్టులకు రంగులు అందించామని పేర్కొన్నారు. రూ.250 కోట్ల ఆర్డర్‌ బుక్‌ ఉందని వెల్లడించారు.

రెండింతలకు సామర్థ్యం..: ప్రస్తుతం టెక్నో పెయింట్స్‌కు అయిదు ప్లాంట్లున్నాయి. వీటన్నిటి వార్షిక సామర్థ్యం 42,000 మెట్రిక్‌ టన్నులు. ఆరవ ప్లాంటును హైదరాబాద్‌ సమీపంలోని సుల్తాన్‌పూర్‌ ఇండస్ట్రియల్‌ ఎస్టేట్‌లో నెలకొల్పుతున్నారు. 3 ఎకరాల విస్తీర్ణంలో రానున్న ఈ ప్లాంటు కోసం రూ.25 కోట్ల పెట్టుబడి చేస్తున్నట్టు శ్రీనివాస్‌ రెడ్డి వెల్లడించారు. ‘ఏడాదిలో సిద్ధం కానున్న కొత్త ప్లాంటుతో సామర్థ్యం రెండింతలకు చేరుతుంది. నూతనంగా 200 మందికి ఉద్యోగాలు లభిస్తాయి. 2018–19లో రూ.62 కోట్ల టర్నోవర్‌ సాధించాం. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.90 కోట్లు ఆశిస్తున్నాం. రెండేళ్లలో రూ.250 కోట్ల టర్నోవర్‌ లక్ష్యం. ఆఫ్రికాలో సంయుక్త భాగస్వామ్య కంపెనీ ఏర్పాటు ప్రయత్నాల్లో ఉన్నాం. దక్షిణాదితోపాటు మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, ఢిల్లీలో సేవలు అందిస్తున్నాం. త్వరలో దేశవ్యాప్తంగా విస్తరిస్తాం’ అని వివరించారు.
 

మరిన్ని వార్తలు