బీమా వృద్ధికి టెక్నాలజీ దన్ను

4 May, 2018 00:50 IST|Sakshi

బజాజ్‌ అలయంజ్‌ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ ఎండీ తరుణ్‌ చుగ్‌

పాలసీ విక్రయం నుంచి సేవల దాకా డిజిటైజేషన్‌

2019 నాటికి పూర్తి డిజిటల్‌ సంస్థగా ఎదుగుతాం

సాక్షి, బిజినెస్‌ బ్యూరో :  పాలసీల విక్రయం నుంచి సర్వీసుల దాకా జీవిత బీమా రంగంలో టెక్నాలజీ వినియోగం గణనీయంగా పెరుగుతోంది. ఈ నేపథ్యంలో వచ్చే ఏడాది నాటికి పూర్తి డిజిటల్‌ సంస్థగా ఎదిగే దిశగా ఇన్వెస్ట్‌ చేస్తున్నామంటున్నారు బజాజ్‌ అలయంజ్‌ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ ఎండీ తరుణ్‌ చుగ్‌. గత ఆర్థిక సంవత్సరం పరిశ్రమకు రెట్టింపు స్థాయిలో కొత్త ప్రీమియం ఆదాయాలు సాధించామని, ఈసారీ మరింత వ్యాపార వృద్ధికి సానుకూల పరిస్థితులు ఉన్నాయని సాక్షి బిజినెస్‌ బ్యూరోకి తెలిపారు. మరిన్ని వివరాలు ఆయన మాటల్లోనే..

గత ఆర్థిక సంవత్సరం కంపెనీ పనితీరు ఎలా ఉంది. ఈసారి అంచనాలేంటి?
గత ఆర్థిక సంవత్సరం అటు మొత్తం జీవిత బీమా రంగానికి ఇటు మా సంస్థకూ సానుకూలంగానే గడిచింది. కొత్త బిజినెస్‌ ప్రీమియంలు, ముఖ్యంగా యులిప్స్‌లో పెట్టుబడులు పెరిగాయి. రిటైల్‌ ఇన్వెస్టర్లు యులిప్స్‌ను సురక్షితమైన, మెరుగైన పెట్టుబడి సాధనంగా విశ్వసిస్తున్నారనడానికి ఇది నిదర్శనం. 2017–18లో పరిశ్రమ కొత్త ప్రీమియం ఆదాయం 19 శాతం పెరగ్గా, ప్రైవేట్‌ బీమా సంస్థల్లో మేం అత్యధికంగా 38 శాతం వృద్ధి సాధించాం. 2016–17లో మార్కెట్‌ వాటా 1.9 శాతం ఉండగా, గత సంవత్సరం 2.2 శాతానికి పెరిగింది.

గత క్వార్టర్‌లో యులిప్‌ గోల్‌ అష్యూర్‌ వంటి పథకాలను ప్రవేశపెట్టాం. కొత్త బిజినెస్‌ ప్రీమియం ఆదాయాలు పెంచుకునేందుకు ఇవన్నీ తోడ్పడ్డాయి. ఇక ఈ ఆర్థిక సంవత్సరం కూడా పరిస్థితులు సానుకూలంగానే కనిపిస్తున్నాయి. వ్యక్తిగత ఆదాయాలు పెరుగుతుండటం, మరింత మెరుగైన ఆర్థిక లక్ష్యాలను నిర్దేశించుకుంటున్న రిటైల్‌ ఇన్వెస్టర్లు .. సముచిత రాబడులు అందించే పెట్టుబడి సాధనాల వైపు చూస్తుండటం తదితర అంశాలు ఈసారి వ్యాపార వృద్ధికి తోడ్పడే అవకాశాలు ఉన్నాయి.

జీవిత బీమా రంగంలో ప్రస్తుతం ట్రెండ్స్‌ ఎలా ఉన్నాయి?
బీమా రంగ సంస్థలు డిజిటైజేషన్‌ అవసరాన్ని గుర్తెరిగాయి. కస్టమర్‌కు మెరుగైన అనుభూతినివ్వడంతో పాటు కొత్త వ్యాపార అవకాశాలు అందిపుచ్చుకునేందుకు, వ్యయాలను తగ్గించుకునేందుకు, సులభతరంగా కార్యకలాపాల నిర్వహణకు ఇది తోడ్పడుతోంది.

రాబోయే రోజుల్లో ప్రీ–సేల్స్‌ నుంచి పోస్ట్‌ సేల్స్‌ సర్వీసెస్‌ దాకా అంతా పేపర్‌రహితంగానే జరిగే అవకాశం  ఉంది. బీమా పాలసీల అమ్మకాలు ఆన్‌లైన్‌లో మరింతగా పెరగునున్నాయి. డిజిటైజేషన్‌ కారణంగా ఎలాంటి సర్వీసైనా క్షణంలోనే అందుబాటులో ఉంటుంది. మా విషయానికొస్తే.. 2019 నాటికల్లా పూర్తి డిజిటల్‌ సంస్థగా ఎదిగే దిశగా ఐటీ ఇన్‌ఫ్రాను అప్‌గ్రేడ్‌ చేసేందుకు భారీ పెట్టుబడులు పెడుతున్నాం.

మీ సంస్థలో టెక్నాలజీ వినియోగం ఎలా ఉంటోంది?
కస్టమర్‌తో పాటు ఉద్యోగులకు కూడా తోడ్పడేటటువంటి టెక్నాలజీలను మేం ఉపయోగిస్తున్నాం. గత ఆర్థిక సంవత్సరంలో లైఫ్‌ అసిస్ట్‌ పేరుతో కస్టమర్స్‌ కోసం పోర్టల్‌ ప్రారంభించాం. బజాజ్‌ అలయంజ్‌ లైఫ్‌ పాలసీకి సంబంధించి తలెత్తే ప్రశ్నలన్నింటినీ దీని ద్వారా నివృత్తి చేసుకోవచ్చు. ఆధార్, ఫండ్‌ స్విచింగ్, కాంటాక్ట్‌ వివరాలు అప్‌డేట్‌ చేసుకోవడం మొదలైన వాటన్నింటికీ ఇది ఉపయోగపడుతుంది. దీన్ని రెండు లక్షల మందికి పైగా కస్టమర్లు ఉపయోగించుకుంటున్నారు.

ఇక పాలసీ సేవలపై కస్టమర్స్‌కి తోడ్పాటు అందించేందుకు బోయింగ్‌ పేరిట వర్చువల్‌ చాట్‌ అసిస్టెంట్‌ కూడా అందుబాటులో ఉంది. ఇక మా శాఖల్లో లభించే సర్వీసులన్నీ కస్టమర్‌ ఇంటి దగ్గరే అందుబాటులోకి తెచ్చేందుకు ఉద్దేశించి మోసంబీ పేరుతో చేతిలో ఇమిడే చిన్న పరికరాన్ని రూపొందిం చాం. దీని తోడ్పాటుతో కేవలం నాలుగు నెలల్లోనే రూ. 160 కోట్లకు పైగా రెన్యువల్‌ ప్రీమియంలు సేకరించగలిగాం. దీంతో పాటు ఫొటో డె డూప్‌ పేరుతో మరొక ఫీచర్‌ కూడా అందుబాటులోకి తెచ్చాం. కేవలం సెల్ఫీ క్లిక్‌ చేయడం ద్వారా పాలసీదారు ఆన్‌లైన్‌లో లాగిన్‌ అయి.. పాలసీ సంబంధిత సమాచారాన్ని తెలుసుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది. లాగిన్‌ అయ్యేందుకు పట్టే సమయాన్ని ఇది గణనీయంగా తగ్గిస్తుంది.

అమ్మకాల కోసం ఇన్‌స్టాబ్‌ పేరుతో ప్రత్యేకంగా యాప్‌ కూడా ఉంది. ఏజెంటు అప్పటికప్పుడు బీమా ప్రీమియంను లెక్కగట్టి, ట్యాబ్లెట్‌ లేదా స్మార్ట్‌ఫోన్‌ ద్వారా కొత్త ప్రపోజల్‌ను ఆఫ్‌లైన్‌లో కూడా ప్రాసెస్‌ చేసేందుకు ఇది ఉపయోగపడుతుంది. దీని ద్వారా గత ఆర్థిక సంవత్సరం 27,000 పైచిలుకు పాలసీలు ప్రాసెస్‌ చేశాం. ఇక సేల్స్‌ టీమ్‌ మధ్య పరస్పరం సమాచారం పంచుకునేందుకు ఐస్మార్ట్, పేపర్‌రహితంగా ఏజెంట్ల నియామకం చేపట్టేందుకు ఐ–రిక్రూట్‌ పోర్టల్‌ లాంటివి ఉన్నాయి. అటు మా ఉద్యోగులు, మానవ వనరుల విభాగం మధ్య అనుసంధానంగా వ్యవహరించేందుకు వికి పేరుతో చాట్‌బాట్‌ను రూపొందించాం.

మరిన్ని వార్తలు