కొందరికే పరిమితం కాకూడదు!

26 Feb, 2020 08:17 IST|Sakshi

టెక్నాలజీ సొల్యూషన్లు అందరికీ అందాలి

డెవలపర్లకు బాధ్యత, నైతికత తప్పనిసరి

మైక్రోసాఫ్ట్‌ సీఈవో సత్య నాదెళ్ల సూచనలు

బెంగళూరు: టెక్నాలజీ ఆధారిత పరిష్కార మార్గాలను అభివృద్ధి చేసే డెవలపర్లు మరింత బాధ్యతాయుతంగా వ్యవహరించాలని ఐటీ దిగ్గజం మైక్రోసాఫ్ట్‌ సీఈవో సత్య నాదెళ్ల సూచించారు. సొల్యూషన్స్‌ రూపొందించేటప్పుడు నైతికత, విశ్వసనీయతపై ప్రధానంగా దృష్టి పెట్టాలన్నారు. టెక్నాలజీ ప్రయోజనాలు అందరికీ లభించేలా చూడాలని పేర్కొన్నారు. ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ (ఏఐ) సొల్యూషన్స్‌ రూపకల్పనలో ఎలాంటి పక్షపాత ధోరణులు చొరబడకుండా .. వివిధ వర్గాల వారు ఉన్న టీమ్‌లతో డెవలపర్లు కలిసి పనిచేయాలని నాదెళ్ల చెప్పారు. ‘ప్రస్తుతం అంతటా టెక్నాలజీమయం అయిపోయింది. కాబట్టి బాధ్యతాయుతంగా వ్యవహరించాలి. డెవలపర్లు రూపొందించే సొల్యూషన్స్‌ ఫలాలు.. సమాజంలో కేవలం ఒక వర్గానికి మాత్రమే పరిమితమవుతాయా? లేదా రిటైల్, వైద్యం, వ్యవసాయం .. ఇలా చాలా వర్గాలకు అందుతాయా? అన్నది బేరీజు వేసుకోవాలి‘ అని సత్య నాదెళ్ల పేర్కొన్నారు. ఫ్యూచర్‌ డీకోడెడ్‌ సదస్సులో పాల్గొన్న సందర్భంగా ఆయన ఈ విషయాలు చెప్పారు. కస్టమర్లు, డెవలపర్లు, భాగస్వాములు మొదలైన వారు ఈ సదస్సులో పాల్గొన్నారు.

డెవలపర్లు సృష్టించే సొల్యూషన్స్‌ను ముందుగా వారే ప్రయోగాత్మకంగా పరీక్షిస్తారు కాబట్టి.. సదరు టెక్నాలజీ రూపకల్పనలో విశ్వసనీయతకు పెద్ద పీట వేయాలని సత్య చెప్పారు. కస్టమర్ల డేటా కీలకంగా ఉండే బ్యాంకుల్లాంటివి.. తాము రూపొందించే యాప్‌లపై సంబంధిత వర్గాలకు నమ్మకం కలిగించేలా జాగ్రత్తలు తీసుకోవాలని నాదెళ్ల చెప్పారు. తమ విషయానికొస్తే.. ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లోని డేటా రెసిడెన్సీ చట్టాలకు అనుగుణంగానే ఆయా దేశాల్లో కార్యకలాపాలు సాగిస్తున్నామని ఆయన ఈ సందర్భంగా తెలిపారు. ‘మాకు 57 డేటా సెంటర్‌ రీజియన్లు ఉన్నాయి. భారత్‌లో మూడు ప్రాంతాల్లో (పుణె, చెన్నై, ముంబై) ఇవి ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా మిగతా ప్రాంతాలకూ విస్తరిస్తున్నాం. ఆయా దేశాల్లోని డేటా చట్టాలను తు.చ. తప్పకుండా పాటించడం వల్లే ఇది సాధ్యపడుతోంది‘ అని నాదెళ్ల చెప్పారు.

మరిన్ని వార్తలు