గుజరాత్‌ అంబుజా- తేజస్‌.. భలేభలే

10 Jul, 2020 12:56 IST|Sakshi

షేర్ల ముఖ విలువ విభజనకు రెడీ

గుజరాత్‌ అంబుజా షేరు 4% ప్లస్‌

విజయ్‌ కేడియా వాటా కొనుగోలు

తేజస్‌ షేరు మళ్లీ అప్పర్‌ సర్క్యూట్‌

ప్రసిద్ధ ఇన్వెస్టర్‌ విజయ్‌ కేడియా కంపెనీలో వాటాను కొనుగోలు చేసిన వార్తలతో జోరు చూపుతున్న తేజస్‌ నెట్‌వర్క్స్‌ కౌంటర్‌కు డిమాండ్‌ కొనసాగుతోంది. మరోపక్క షేర్ల విభజన వార్తలతో గుజరాత్‌ అంబుజా ఎక్స్‌పోర్ట్స్‌ కౌంటర్‌ సైతం ఇన్వెస్టర్లను ఆకట్టుకుంటోంది. వెరసి నష్టాల మార్కెట్లోనూ ఈ రెండు కౌంటర్లూ లాభాలతో సందడి చేస్తున్నాయి. వివరాలు చూద్దాం..

తేజస్‌ నెట్‌వర్క్స్‌
ఓపెన్‌ మార్కెట్‌ లావాదేవీల ద్వారా బ్రాడ్‌బ్యాండ్ సేవల కంపెనీ తేజస్‌ నెట్‌వర్క్స్‌లో 0.81 శాతం వాటాను కేడియా సెక్యూరిటీస్‌ కొనుగోలు చేసినట్లు ఎన్‌ఎస్‌ఈ బల్క్‌డీల్స్‌ డేటా పేర్కొంది. ప్రసిద్ధ ఇన్వెస్టర్‌ విజయ్‌ కిషన్‌లాల్‌ కేడియాకు చెందిన ఈ సంస్థ షేరుకి రూ. 49.13 ధరలో దాదాపు 7.54 లక్షల తేజస్‌ షేర్లను సొంతం చేసుకుంది. ఇందుకు రూ. 3.7 కోట్లను వెచ్చించింది. దీంతో ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఈలో తేజస్‌ షేరు 5 శాతం అప్పర్‌ సర్క్యూట్‌ను తాకింది. రూ. 54.3 వద్ద ఫ్రీజయ్యింది. వరుసగా మూడో రోజూ ఈ షేరు అప్పర్‌ సర్క్యూట్‌ను తాకడ గమనార్హం! 

గుజరాత్‌ అంబుజా ఎక్స్‌పోర్ట్స్‌
షేర్ల విభజన ప్రతిపాదనను ఈ నెల 25న నిర్వహించనున్న సమావేశంలో కంపెనీ బోర్డు పరిశీలించనున్నట్లు  ఆగ్రో ప్రాసెసింగ్‌ కంపెనీ గుజరాత్‌ అంబుజా ఎక్స్‌పోర్ట్స్‌ తాజాగా పేర్కొంది. అంతేకాకుండా.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2020-21) తొలి క్వార్టర్‌ ఫలితాలను సైతం వెల్లడించనన్నట్లు తెలియజేసింది. ప్రస్తుతం రూ. 2 ముఖ విలువగల ఒక్కో షేరునీ రూ. 1 ముఖ విలువగల 2 షేర్లుగా విభజించేందుకు ప్రతిపాదించినట్లు వెల్లడించింది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం గుజరాత్‌ అంబుజా షేరు ఎన్‌ఎస్‌ఈలో దాదాపు 4 శాతం జంప్‌చేసి రూ. 143 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 145 వరకూ ఎగసింది. 

మరిన్ని వార్తలు