తెలంగాణ రెరా మొదలైంది!

5 Aug, 2017 01:57 IST|Sakshi
తెలంగాణ రెరా మొదలైంది!

రేట్లు పెరుగుతాయా? తగ్గుతాయా?
► 2017 జనవరి 1 తర్వాత అనుమతి పొందిన ప్రాజెక్ట్‌లన్నీ రెరా పరిధిలోకే
► అందుబాటు ఇళ్లూ రెరాలో నమోదు తప్పనిసరి
► రెరాతో పరిశ్రమలో పారదర్శకత; కొనుగోలుదారులకు భరోసా
► ఇంటి యజమాని మీరే.. కానీ, స్థలానికి కాదు!


స్థిరాస్తి నియంత్రణ, అభివృద్ధి బిల్లు (రెరా)కు తెలంగాణ ప్రభుత్వం ఆమోదముద్ర వేసింది. ఈ ఏడాది జనవరి 1 తర్వాత అనుమతి పొందిన నివాస, వాణిజ్య సముదాయాలు, లే అవుట్లన్నీ రెరా పరిధిలోకి వస్తాయని తేల్చి చెప్పింది. మరి, స్థిరాస్తి ధరలు పెరుగుతాయా? తగ్గుతాయా? జనవరి 1 తర్వాత అనుమతిపొంది, ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న ప్రాజెక్ట్‌లు, వెంచర్లలో విక్రయాల పరిస్థితేంటి? వంటి అంశాలపై స్థిరాస్తి నిపుణులతో ‘సాక్షి రియల్టీ’ చర్చించింది.

సాక్షి, హైదరాబాద్‌ :  2017, జనవరి 1 తర్వాత అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ (యూడీఏ), డైరెక్టరేట్‌ ఆఫ్‌ టౌన్‌ అండ్‌ కంట్రీ ప్లానింగ్‌ (డీటీసీపీ), మున్సిపల్‌ కార్పొరేషన్స్, మున్సిపాలిటీ, పంచా యతీ, తెలంగాణ స్టేట్‌ ఇండస్ట్రియల్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ కార్పొరేషన్‌ (టీఎస్‌ఐఐసీ) నుంచి అనుమతి పొందిన నివాస, వాణిజ్య సముదా యాలు, ఓపెన్‌ ప్లాట్లూ రెరా పరిధిలోకి వస్తాయి. అందుబాటు గృహాలు, ప్రభుత్వం విక్రయించే ఫ్లాట్లూ రెరా పరిధిలోకే వచ్చేస్తాయి. రాజీవ్‌ స్వగృ హ, గృహకల్ప వంటి ప్రాజెక్ట్‌లన్నమాట.

రెరాలో రిజిస్ట్రేషన్‌కు ధరలివే..
్హవెయ్యి చ.మీ లోపు ఉండే గ్రూప్‌ హౌసింగ్‌ ప్రాజెక్ట్‌లకు చ.మీ.కు రూ.5, అంతకంటే ఎక్కువుండే ప్రాజెక్ట్‌లకు చ.మీ.కు రూ.10. అది కూడా రూ.5 లక్షల కంటే మించకూడదు.
♦ మిక్స్‌డ్‌ డెవలప్‌మెంట్‌ (నివాస, వాణిజ్య సముదాయాలు) ప్రాజెక్ట్‌లకైతే.. వెయ్యి చ.మీ. లోపు ఉండే వాటికి చ.మీ. రూ.10, అంతకంటే ఎక్కువుంటే చ.మీ. రూ.15. రూ.7 లక్షలకు మించకూడదు.
♦ వెయ్యి చ.మీ. లోపు ఉండే వాణిజ్య సముదాయాలకైతే చ.మీ.కు రూ.20, అంతకంటే ఎక్కువుండే ప్రాజెక్ట్‌లకు చ.మీ. రూ.20. రూ.10 లక్షలకు మించకూడదు.
♦ లే అవుట్ల అభివృద్ధికైతే చ.మీ.కు రూ.5. రూ.2 లక్షలకు మించకూడదు.

వసూలు చేసిన సొమ్మెంత; ఖర్చు చేసిందెంత?
ఇప్పుడు కొత్తగా ప్రారంభించే ప్రాజెక్ట్‌లే కాదు ఈ ఏడాది జనవరి 1 తర్వాత మొదలై.. ప్రస్తుతం నిర్మాణంలోని ప్రాజెక్ట్‌లు కూడా రెరాలో నమోదు చేసుకోవాల్సిందే. ఆయా ప్రాజెక్ట్‌ల ఒరిజినల్‌ అనుమతి పత్రాలు, లే అవుట్‌ ప్లాన్స్, వసతులు వంటివన్నీ జత చేయాలి.
్హఇప్పటివరకు కొనుగోలుదారుల నుంచి వసూలు చేసిన సొమ్మెంత? ఖర్చు చేసిందెంత? మిగిలిన మొత్తమెంత? వంటి వివరాలనూ అందించాలి. గతంలో బిల్టప్‌ ఏరియా చొప్పున విక్రయించినా సరే.. కార్పెట్‌ ఏరియా చొప్పున లెక్కేసి అపార్ట్‌మెంట్‌ విస్తీర్ణమెంత అనేది వివరించాలి.

♦ కొనుగోలు సమయంలో కస్టమర్లకు ప్రాజెక్ట్‌ నిర్మాణ గడువు చెప్పిందెంత. ప్రస్తుతం ఏ దశలో ఉంది? గడువు సమయం? వంటి వివరాలన్నీ అనుమతి పొందిన ఇంజనీర్, ఆర్కిటెక్ట్, చార్టెర్డ్‌ అకౌంటెంట్‌ అనుమతి పత్రంతో అందించాలి.

ప్రక్రియ పెరిగిందే తప్ప.. భారం కాదు
రెరా అమలుతో డెవలపర్లకు డాక్యుమెంటేషన్‌ ప్రక్రియ పెరుగుతుందే తప్ప నిధుల భారం కాదు. కాబట్టి ధరలు పెరిగే అవకాశమే లేదని తెలంగాణ బిల్డర్స్‌ ఫెడరేషన్‌ జనరల్‌ సెక్రటరీ జే వెంకట్‌రెడ్డి చెప్పారు. అంతేకాదు ఐదేళ్ల గ్యారంటీ నిబంధన లిఫ్ట్, జనరేటర్‌ వంటి వాటికి లేదు కాబట్టి గతంలో ఊహించినట్టుగా 15–20 శాతం ధరలు పెరిగే అవకాశం లేదన్నారు. ‘‘ఇప్పటివరకు ప్రాజెక్ట్‌ నిధుల కోసం ప్రైవేట్‌ ఇన్వెస్టర్లనో, బయట వడ్డీలనో ఆశ్రయించేవాళ్లం. కానీ, ఇప్పుడు రెరా కారణంగా నిర్మాణ రంగంలో పారదర్శకత నెలకొంటుంది కాబట్టి బ్యాంకులూ విరివిగా నిధులిస్తాయి. వడ్డీ రేట్లు కూడా తక్కువగా ఉంటాయి కాబట్టి.. రాత్రికి రాత్రే ధరలు పెరిగే అవకాశం లేదని’’ ఆయన వివరించారు.

గడువు ముగిసిందా వడ్డీ భారం డెవలపర్‌దే..
రెరాతో కొనుగోలుదారులకు కలిగే ప్రధాన ప్రయోజనం వడ్డీ భారం లేకపోవటమే. గతంలో గడువు ముగిసిన ప్రాజెక్ట్‌లలో ఒకవైపు బ్యాంకు వడ్డీలు భారం కస్టమర్ల మీదే పడేది. కానీ, రెరాతో గడువు ముగిసిందో వడ్డీల భారం డెవలపర్లదే ఉంటుంది. కాబట్టి గడువులోగా గృహ ప్రవేశం చేసే వీలుంటుంది.

 ♦ భవన నిర్మాణ అనుమతులు పొందేటప్పుడే నిర్మాణ గడువు, ప్రతి మూడు నెలలకొకసారి నిర్మాణం పరిస్థితి, ఖాళీగా ఉన్న ఫ్లాట్ల సంఖ్య వంటి వివరాలన్నీ వెబ్‌సైట్‌లో అప్‌లోడ్‌ చేయాలి. దీంతో కొనుగోలు సమయంలోనే కస్టమర్లు ప్రాజెక్ట్‌ వ్యయం, డెవలపర్‌ చరిత్ర వంటివన్నీ తెలుసుకోవచ్చు.

♦ ఐదేళ్ల గ్యారంటీ నిబంధనను కేవలం స్ట్రక్చరల్‌ లోపాలకు పరిమితం చేశారు. ఇతరత్రా ఉత్పత్తులకు వార్షిక నిర్వహణ ఒప్పందం (ఏఎంసీ) తీసుకోవాల్సిన బాధ్యత అపార్ట్‌మెంట్‌ సంఘానిదే.

ఇంటి యజమాని మీరే.. కానీ, స్థలానికి కాదు!
ఈ ఏడాది జనవరి 1 తర్వాత అనుమతి పొందిన ప్రాజెక్ట్‌లే రెరా పరిధిలోకి వస్తాయనే నిబంధనతో ప్రస్తుతం నిర్మాణంలోని ప్రాజెక్ట్‌లకు కొంత గందరగోళం ఏర్పడే అవకాశముంది. ఎలాగంటే.. ఆయా ప్రాజెక్ట్‌లలో ఇప్పటివరకు జరిగిన అమ్మకాల్లో కామన్‌ ఏరియా, అన్‌డివైడెండ్‌ (అవిభాజ్యపు) వాటాను ఇంటి యజమాని పేరు మీద రిజిస్ట్రేషన్‌ చేశారు. కానీ, రెరాలో మాత్రంలో దీన్ని అపార్ట్‌మెంట్‌ సంక్షేమ సంఘానికి రిజిస్ట్రేషన్‌ చేయాలని అంటోంది.

దీంతో ఆయా ప్రాజెక్ట్‌లలో ఇప్పుడు కొనుగోలు చేయబోయే కస్టమర్లకు ఈ స్థలం చెందదన్నమాట. అది సంఘం పేరు మీద రిజిస్ట్రేషన్‌ అవుతుంది. అంటే ఇంటి యజమాని మాత్రమే మనవుతాం కానీ, స్థలానికి కాదని కొనుగోలుదారులు ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న ప్రాజెక్ట్‌లల్లో కొనుగోలు చేసే బదులు ఇప్పుడు కొత్తగా నిర్మాణం ప్రారంభించే ప్రాజెక్ట్‌లను ఎంచుకునే ప్రమాదముంది. దీంతో ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న ప్రాజెక్ట్‌లలో అమ్మకాలు పడిపోయే ప్రమాదముంది. మరి, ఈ విషయమై అప్పిలేట్‌ ట్రిబ్యునలే ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచిచూడాలని భారత స్థిరాస్తి డెవలపర్ల సమాఖ్య (క్రెడాయ్‌) మాజీ అధ్యక్షుడు సీ శేఖర్‌ రెడ్డి చెప్పారు.

పరిశ్రమ
రెరాతో నిర్మాణ రంగంలో పారదర్శకత చేకూరుతుంది. ఇన్నాళ్లూ అస్తవ్యస్తంగా ఈ రంగం ప్రణాళికాబద్ధంగా తయారవుతుంది. దీంతో అందుబాటు గృహాల విభాగానికి మల్లే నిర్మాణ రంగానికి కూడా పరిశ్రమ హోదా వచ్చే అవకాశముంది. దీంతో ఇతర పరిశ్రమ మాదిరిగానే విరివిగా రుణాలు వచ్చే అవకాశముంది. దేశీయ పెట్టుబడులే కాకుండా విదేశీ ఇన్వెస్టర్లనూ ఆకర్షించే వీలుంటుంది. రెరా నిబంధనలను పక్కాగా పాటించే స్థానిక సంస్థలకూ కార్పొరేట్‌ బ్రాండింగ్‌ ఏర్పడుతుంది.

కొనుగోలుదారులు
స్థిరాస్తి రంగంలో అక్రమాలకు, నాణ్యతా లోపాలకు తావులేకుండా రెరాలో కఠినమైన నిర్ణయాలుండడంతో కొనుగోలుదారుల్లో నమ్మకం ఏర్పడుతుంది. గడువులోగా నిర్మాణాలు  పూర్తవుతాయి కాబట్టి కొనుగోలుదారులు సమయానికి గృహ ప్రవేశాలు చేసే వీలుంటుంది. కొనుగోలు చేయబోయే ప్రాజెక్ట్‌కు సంబంధించిన ప్రతి సమాచారాన్ని, డెవలపర్‌ చరిత్రనూ ముందే తెలుసుకునే వీలుంటుంది. డెవలపర్ల ఏకపక్ష ఒప్పందాలు ఉండవు కాబట్టి.. నిర్భయంగా పెట్టుబడులు పెట్టే వీలుంటుంది.

మరిన్ని వార్తలు