హైదరాబాద్‌లో ఎయిర్‌టెల్ పబ్లిక్ వైఫై

11 Oct, 2014 01:17 IST|Sakshi
హైదరాబాద్‌లో ఎయిర్‌టెల్ పబ్లిక్ వైఫై

హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: టెలికం రంగ కంపెనీ ఎయిర్‌టెల్, తెలంగాణ ప్రభుత్వంతో కలిసి పబ్లిక్ వైఫై సౌకర్యాన్ని హైదరాబాద్ హైటెక్‌సిటీ ప్రాంతంలో ప్రారంభించింది. ప్రస్తుతం ఎనిమిది కిలోమీటర్ల మేర 17 స్థానాల్లో ఈ సేవలు అందుబాటులోకి వ చ్చాయి. స్మార్ట్‌ఫోన్, ట్యాబ్లెట్ పీసీ, ల్యాప్‌టాప్ ఇలా ఉపకరణం ఏదైనా ఇంటర్నెట్‌ను వినియోగించుకోవచ్చు.

ఇతర ఆపరేటర్లకు చెందిన కస్టమర్లు సైతం వైఫై పొందవచ్చని భారతీ ఎయిర్‌టెల్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సర్కిల్ సీఈవో వెంకటేష్ విజయ్‌రాఘవన్ తెలిపారు. 3 నెలల పైలట్ ప్రాజెక్టు కింద ప్రస్తుతం ప్రతి వినియోగదారుకు రోజుకు 750 ఎంబీ వరకు డేటా ఉచితమని చెప్పారు. నెట్ వేగం 42 ఎంబీపీఎస్ వరకు ఉంటుందన్నారు. వినియోగదారులు తమ ఉపకరణంలో వైఫైని ఆన్ చేసి పబ్లిక్ వైఫైని ఎంచుకోవాలి. వెంటనే వన్ టైమ్ పాస్‌వర్డ్ మొబైల్‌కు వస్తుంది. దీన్ని టైప్ చేస్తే నెట్ సౌకర్యం పొందొచ్చు.

నగరం మొత్తం..: ఎయిర్‌టెల్ దశలవారీగా భాగ్యనగరి మొత్తం వైఫై సౌకర్యాన్ని కల్పించనుంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సర్కిల్‌లో 14,000 కిలోమీటర్ల మేర ఎయిర్‌టెల్ ఫైబర్ విస్తరించింది. ఇందులో హైదరాబాద్ వాటా 2,200 కిలోమీటర్లు. 3 నెలల తర్వాత వైఫై ఫ్రీగా ఇవ్వాలా, లేదా స్వల్పంగా చార్జీ చేయాలా అన్నది నిర్ణయిస్తామని కంపెనీ చెబుతున్నప్పటికీ.. ఉచితంగా ఇవ్వడం వల్ల కంపెనీపై పెద్ద ఎత్తున భారం పెరుగుతుంది. చార్జీ చేయడం ఖాయమని ఎయిర్‌టెల్ అధికారి ఒకరు తెలిపారు. హైదరాబాద్‌లో పబ్లిక్ వైఫైని ఏర్పాటు చేయడం ఎయిర్‌టెల్‌కు ఇదే తొలిసారి. 17 స్థానాల్లో సగటున 40 వేల మంది వైఫై వినియోగించుకోవచ్చని కంపెనీ తెలిపింది.
 
రాజధాని అంతటా వైఫై: కేటీఆర్

నాలుగైదు నెలల్లో భాగ్యనగరి మొత్తం వైఫై హైదరాబాద్‌గా (హైఫై) మారిపోనుందని తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కె.తారక రామారావు వెల్లడించారు. హైటెక్ సిటీ వద్ద ఎయిర్‌టెల్ పబ్లిక్ వైఫై ప్రారంభించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. హైదరాబాద్‌లో 700 చదరపు కిలోమీటర్ల మేర వైఫై సౌకర్యం అందుబాటులోకి రానుందని పేర్కొన్నారు. అంగుళం స్థలం కూడా వదలమని చెప్పారు. ఆయనింకా ఏమన్నారంటే..
 
త్వరలో టెండర్లు..: వైఫై సేవలు అందించేందుకు ఎయిర్‌సెల్, రిలయన్స్ జియో తదితర టెలికం కంపెనీలు కూడా ముందుకు వచ్చాయి. త్వరలో టెండర్లు పిలుస్తున్నాం.  భాగ్యనగరానికి ఎవరు వచ్చినా వైఫై వంటి సౌకర్యాలుంటే సానుకూలంగా స్పందిస్తారు.  ఇ-కామర్స్ రంగం దూసుకెళ్తోంది. డిజిటల్ అనుసంధానం పెద్ద ఎత్తున చేపడతాం. తద్వారా ఉత్తమ ఉత్పత్తులు, సేవలు పొందేందుకు మార్గం సుగమం అవుతుంది. స్మార్ట్‌ఫోన్ నుంచే ‘మీ సేవ’ సర్వీసులు కొన్ని అయినా ప్రజలకు అందాలన్నది మా ధ్యేయం. స్మార్ట్‌ఫోన్ నుంచి ఏవైనా ధ్రువీకరణ పత్రాలు కోరితే.. ఆ పత్రాలు ఇంటికి రావాలన్నది మా ఆలోచన. మ్యాన్‌హోల్ తెరిచివుంటే దాన్ని ఫొటో తీసి జీహెచ్‌ఎంసీ పంపిస్తే అధికారులు స్పందించేలా టెక్నాలజీని వినియోగించనున్నాం.
 
త్వరలో వొడాఫోన్ వైఫై..: టెలికం కంపెనీ వొడాఫోన్ సైతం పబ్లిక్ వైఫై సేవలను అందించనుంది. కొద్ది రోజుల్లో ప్రణాళిక కార్యరూపం దాల్చనుందని వొడాఫోన్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఆపరేషన్స్ బిజినెస్ హెడ్ మన్‌దీప్ సింగ్ భాటియా  తెలిపారు. ఈ విషయంలో ప్రభుత్వంతో కలసి పనిచేస్తున్నట్టు ఆయన చెప్పారు.

>
మరిన్ని వార్తలు