కాల్ డ్రాప్ అయితే టెల్కోలు పరిహారం ఇవ్వాల్సిందే

23 Sep, 2015 02:42 IST|Sakshi
కాల్ డ్రాప్ అయితే టెల్కోలు పరిహారం ఇవ్వాల్సిందే

- ట్రాయ్‌కి మొబైల్ యూజర్ల వినతి
- పరిహార ప్రతిపాదనను వ్యతిరేకించిన టెలికం కంపెనీలు
న్యూఢిల్లీ:
కాల్ డ్రాప్ అయితే టెల్కోలు పరిహారం చెల్లించే అంశంపై టెలికం రంగ నియంత్రణ సంస్థ ట్రాయ్ ప్రతిపాదించిన చర్చాపత్రంపై ఇటు మొబైల్ యూజర్లు, అటు పరిశ్రమ వర్గాల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. కాల్ డ్రాప్ అయిన పక్షంలో టెలికం కంపెనీలు రెట్టింపు పరిహారం చెల్లించాలని మొబైల్ యూజర్లు డిమాండ్ చేశారు. టెల్కోల నెట్‌వర్క్ సరిగ్గా లేకపోవడం వల్ల పలు సందర్భాల్లో కాల్స్‌కి అంతరాయం కలుగుతోందని, ఇలాంటప్పుడు సదరు కాల్స్‌కి కూడా డబ్బు వసూలు చేయడమనేది వేధింపు కిందికి వస్తుందంటూ కొందరు యూజర్లు వ్యాఖ్యానించారు. కాల్ డ్రాప్‌తో పాటు ఇంటర్నెట్ కనెక్షన్ కూడా సరిగ్గా ఉండటం లేదంటూ వందల కొద్దీ ఫిర్యాదులు ట్రాయ్‌కి అందాయి.

యూజరు నష్టపోయిన దానికి పరిహారంగా ఆ మేర వ్యవధికి సరిపడేలా ఉచిత టాక్‌టైమ్ ఇచ్చేలా చూడాలని, యూనినార్.. రిలయన్స్ వంటివి ఇటువంటి విధానం అమలు చేస్తున్నాయని మొబైల్ సబ్‌స్క్రయిబర్స్ పేర్కొన్నారు. మరోవైపు, అయిదు సెకన్ల లోగా గానీ ఆ తర్వాత గానీ కాల్ డ్రాప్ అయితే.. చార్జీని మొత్తానికే వసూలు చేయకూడదన్న ప్రతిపాదనను తాము వ్యతిరేకిస్తున్నట్లు సెల్యులార్ ఆపరేటర్స్ అసోసియేషన్ (సీఓఏఐ), అసోసియేషన్ ఆఫ్ యూనిఫైడ్ టెలికం సర్వీస్ ప్రొవైడర్స్ (ఏయూఎస్‌పీఐ) ట్రాయ్‌కి తెలిపాయి. ఎటువంటి అంతరాయం లేకుండా కాల్ కొనసాగినంత వ్యవధికి చార్జీలు ఉండాల్సిందేనని పేర్కొన్నాయి. ఇక కాల్ డ్రాప్ వ్యవహారంలో పరిహారం చెల్లించడం వల్ల సమస్య పరిష్కారం కాదని సీవోఏఐ పేర్కొంది. స్పెక్ట్రం కొరత, నెట్‌వర్క్‌ల ఏర్పాటుకు సైట్ల కొరత సమస్యలు అలాగే ఉంటాయని వివరించింది.

మరిన్ని వార్తలు