టెల్కోలు స్పెక్ట్రంను అమ్ముకోవచ్చు..

10 Sep, 2015 01:26 IST|Sakshi

- ట్రేడింగ్ నిబంధనలకు కేబినెట్ ఓకే
న్యూఢిల్లీ:
టెలికం కంపెనీలు తమ వద్దనున్న మిగులు స్పెక్ట్రంను ఒకరితో ఒకరు పంచుకోవడానికి, కొనుగోళ్లు-అమ్మకాలు(ట్రేడింగ్) జరుపుకునేందుకు కేంద్రం లైన్‌క్లియర్ చేసింది. స్పెక్ట్రం ట్రేడింగ్ మార్గదర్శకాలకు బుధవారం ప్రధాని మోదీ నేతృత్వంలో జరిగిన కేబినెట్ భేటీలో ఆమోదం తెలిపారు. దీనివల్ల టెల్కోలకు స్పెక్ట్రం కొరత సమస్య తీరేందుకు కూడా వీలవుతుంది. ప్రస్తుతం ప్రభుత్వం మాత్రమే టెల్కోలకు వేలం పద్ధతిలో స్పెక్ట్రంను కేటాయిస్తూ వస్తున్న సంగతి తెలిసిందే. అయితే, స్పెక్ట్రం యాజమాన్య హక్కులు కేంద్ర ప్రభుత్వం వద్దే ఉంటాయని.. ఆపరేటర్లకు వేలం ద్వారా దీన్ని ఉపయోగించుకోవడానికి, అవసరమైతే ఇతరులతో పంచుకోవడానికి మాత్రమే హక్కులను ప్రభుత్వం ఇస్తోందని కేబినెట్ సమావేశం అనంతరం టెలికం మంత్రి రవి శంకర్ ప్రసాద్ వెల్లడించారు. స్పెక్ట్రం ట్రేడింగ్‌కు అనుమతించాల్సిందిగా టెల్కోలు చాన్నాళ్లుగా డిమాండ్ చేస్తున్నాయి.
 
1 శాతం ఫీజు...: తాజా మార్గదర్శకాల ప్రకారం స్పెక్టం ట్రేడింగ్ ద్వారా లభించే ఆదాయాన్ని కూడా ఏటా ఆయా టెల్కోలపై విధించే స్పెక్ట్రం వినియోగచార్జీలు, లెసైన్స్ ఫీజులను లెక్కగట్టేందుకు పరిగణనలోకి తీసుకోనున్నారు. ఈ ట్రేడింగ్ వల్ల స్పెక్ట్రం మార్కెట్ ధర ఎంతనేది కూడా నిర్ధేశితం అవుతుందని ప్రసాద్ తెలిపారు. ట్రేడింగ్‌లో భాగంగా స్పెక్ట్రంను కొనుగోలు చేసిన సంస్థ మార్కెట్ ధర లేదా గతంలో వేసిన వేలం ధరలో ఏది ఎక్కువైతే దాని ఆధారంగా ప్రభుత్వానికి 1 శాతాన్ని ఫీజుగా చెల్లించాల్సి ఉంటుందని ఆయన వివరించారు.
 
పవన విద్యుత్‌కు కొత్త పాలసీ...
దాదాపు 7,600 కి.మీ. తీరం వెంబడి పవన విద్యుత్ ప్రాజెక్టుల ఏర్పాటు దిశగా క్యాబినెట్ ప్రత్యేక విధానాన్ని ఆమోదించింది. నేషనల్ ఆఫ్‌షోర్ విండ్ ఎనర్జీ పాలసీ కింద .. పవన విద్యుదుత్పాదనకు అనువైన ప్రాంతాలను ముందుగా గుర్తిస్తారు. ఆ తర్వాత రక్షణ తదితర రంగాల నుంచి అనుమతులు వచ్చాక ఆయా ప్రాజెక్టులకు బిడ్డింగ్ నిర్వహిస్తారు.

మరిన్ని వార్తలు