తీవ్ర పోటీ : 90వేల మంది ఉద్యోగాలు గోవింద

15 Jan, 2018 19:38 IST|Sakshi

టెలికాం మార్కెట్‌లో తీవ్ర పోటీ నెలకొన్న సంగతి తెలిసిందే. రిలయన్స్‌ జియో ప్రవేశం అనంతరం టెలికాం కంపెనీలు తీవ్ర అనిశ్చితి పరిస్థితులను ఎదుర్కొంటున్నాయి. తమ రెవెన్యూలను కాపాడుకోలేక సతమతమవుతున్నాయి. ఈ క్రమంలోనే వచ్చే ఆరు నుంచి తొమ్మిది నెలల కాలంలో కూడా భారీగా ఉద్యోగాల కోత చేపట్టనున్నాయని తాజా రిపోర్టు వెల్లడించింది. దాదాపు 80వేల నుంచి 90వేల మంది ఉద్యోగాలు కోల్పోయే ప్రమాదం ఉందని హెచ్చరించింది. పోటీ వాతావరణం పెరుగడంతో పాటు, మార్జిన్లు తగ్గడంతో, కంపెనీలకు లాభాలు పడిపోయాయని, దీంతో భారీగా ఉద్యోగాల కోత చేపట్టనున్నాయని సీఐఈఎల్‌ హెచ్‌ఆర్‌ సర్వీసెస్‌ రిపోర్టు పేర్కొంది. ఉద్యోగుల పరిస్థితి అగమ్యగోచరంగా మారబోతుందని పేర్కొంది. 

65 టెల్కోల, సాఫ్ట్‌వేర్‌, హార్డ్‌వేర్‌ సర్వీస్‌ ప్రొవైడర్ల నుంచి టెలికాం కంపెనీల వరకు సీనియర్‌, మధ్యస్థాయి ఉద్యోగులపై ఈ సర్వే చేపట్టింది. గతేడాది 40వేల మంది టెలికాం రంగంలో ఉద్యోగాలు కోల్పోయారని, ఈ ట్రెండ్‌ వచ్చే ఆరు నుంచి తొమ్మిది నెలల పాటు కొనసాగుతుందని, దీంతో 80వేల నుంచి 90వేల మంది ఉద్యోగాలు కోల్పోతారని పేర్కొంది. వచ్చే రెండు నుంచి మూడు క్వార్టర్ల వరకు అట్రిక్షన్‌ రేటు ఎక్కువగానే ఉంటుందని బెంగళూరుకు చెందిన ఈ కంపెనీ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆదిత్య నారాయణ్‌ మిశ్రా చెప్పారు. ఈ అనిశ్చిత పరిస్థితుల నేపథ్యంలో ఉద్యోగులు తమ కెరీర్‌ గురించి తీవ్ర ఆందోళన చెందుతున్నారని పేర్కొన్నారు. లోన్‌ సర్వీసింగ్‌లో ఎక్కువ వ్యయాలు, మార్కెట్‌ షేరులో తీవ్ర పోటీ, విలీనాలతో అనిశ్చితకర పరిస్థితులు వంటివి ఉద్యోగాల కోతపై ప్రభావం చూపుతున్నాయని చెప్పారు. ఇతర రంగాలతో పోలిస్తే, ఈ రంగంలో వేతనాల పెంపు అంతంతమాత్రంగానే ఉందని కూడా రిపోర్టు పేర్కొంది. ఈ రంగంలో ఉద్యోగాలతో అనిశ్చిత పరిస్థితులతో ఉద్యోగులు వేరే రంగాలపై మొగ్గుచూపుతున్నారని తెలిపింది.

మరిన్ని వార్తలు