జియో వల్ల భారీగా పెట్టుబడులు రైటాఫ్‌

27 Nov, 2017 10:52 IST|Sakshi

రిలయన్స్‌ జియో ఉచిత వాయిస్‌, డేటా ఆఫర్ల వెల్లువ టెలికాం కంపెనీలను భారీగా దెబ్బతీసింది. దాదాపు 50 బిలియన్‌ డాలర్ల వరకు పెట్టుబడులను టెలికాం కంపెనీలు రైటాఫ్‌ చేసినట్టు భారతీ ఎయిర్‌టెల్‌ చైర్మన్‌ సునిల్‌ మిట్టల్‌ తెలిపారు. ఇన్ని కోట్ల మేర పెట్టుబడుల రైటాఫ్‌కు ప్రధాన కారణం జియో ఉచిత కాల్స్‌, డేటా ఆఫర్లేనని పేర్కొన్నారు. అయితే టెలికాం ఇండస్ట్రీలో వేగంగా జరిగిన కన్సాలిడేషన్‌తో భారతీ ఎయిర్‌టెల్‌ లబ్ది చెందిందని చెప్పారు. నెంబర్‌ 2 వొడాఫోన్‌, నెంబర్‌3 ఐడియాలు విలీనం అపూర్వమైనదని, కానీ రెండు బలమైన కంపెనీల విలీనాన్ని మనం చూడటం లేదని మిట్టల్‌ అన్నారు. ప్రస్తుతం భారతీ ఎయిర్టెల్‌, ఎయిర్‌సెల్‌ను కొనుగోలు చేసే ప్రక్రియపై చర్చలు జరుపుతోంది. ఎయిర్‌సెల్‌ అంతకముందు, ఆర్‌కామ్‌లో విలీనమవ్వాలనుకుంది. కానీ ఆ విలీనం చివరి దశలో రద్దయింది.  

ట్రేడింగ్‌ డీల్‌ ద్వారా రూ.3,500 కోట్లకు ఎనిమిది సర్కిళ్లలో 2300 ఎంహెచ్‌జెడ్‌ బ్యాండ్‌లో ఎయిర్‌సెల్‌ 4జీ ప్రసారాలను ఎయిర్‌టెల్‌ గతేడాది కొనుగోలు చేసింది. గతేడాది సెప్టెంబర్‌లో జియో ప్రవేశం అనంతరం దేశీయ టెలికాం కంపెనీలు తమ కస్టమర్లను కాపాడుకోవడానికి టారిఫ్‌ రేట్లను తగ్గించాయి. ఈ ఏడాది ఏప్రిల్‌ నుంచి జియో ఛార్జీలు విధించడం ప్రారంభించింది. అయితే వాయిస్‌ కాల్స్‌ మాత్రం జీవితకాలం ఉచితం. జియో వల్ల ఏర్పడిన ధరల యుద్ధంతో టెల్కోల రెవెన్యూలు, లాభాలు, నగదు నిల్వలు భారీగా దెబ్బతిన్నాయి. ఈ క్రమంలోనే వొడాఫోన్‌, ఐడియాలు విలీనం కాబోతున్నాయి. ఆర్‌కామ్‌, ఎయిర్‌సెల్‌లు ఒత్తిడిలో కొనసాగుతున్నాయి. 
 

మరిన్ని వార్తలు