మళ్లీ పేలనున్న సెల్‌ బాంబ్‌!

19 Feb, 2020 03:45 IST|Sakshi

ఏడాదిలో మొబైల్‌ బిల్లు డబుల్‌!

రూ.300కు చేరనున్న ఏఆర్‌పీయూ

అప్పుడే కంపెనీలకు దండిగా లాభాలు

బకాయిలు కట్టేందుకు తప్పని చార్జీల పెంపు

గత డిసెంబర్‌లో 42 శాతం వరకు పెంపు

న్యూఢిల్లీ: టెలికం సేవల మార్కెట్లోకి రిలయన్స్‌ జియో రాకతో ఎక్కువగా మురిసిపోయింది సగటు వినియోగదారుడేనని అనడంలో సందేహం లేదు. కానీ, మారిన పరిస్థితులతో ఇప్పుడు అదే వినియోగదారుడు ఆందోళన చెందాల్సిన పరిస్థితి...! కేంద్రానికి భారీ బకాయిలు కట్టాల్సి ఉన్న టెలికం కంపెనీలు ఎయిర్‌టెల్, వొడాఫోన్‌ ఐడియాలకు చార్జీలు పెంచడం ద్వారా నిధులు సమకూర్చుకోవడం మినహా ప్రత్యామ్నాయ మార్గాలు కనిపించడం లేదు. ఒకవైపు 4జీ నెట్‌వర్క్‌ విస్తరణపై భారీగా నిధులు వెచ్చించాల్సిన పరిస్థితి.. మరోవైపు జియోకు వినియోగదారులు చేజారిపోకుండా కాపాడుకోవాల్సిన పరిస్థితి.. ఇంకోవైపు కేంద్రానికి భారీ బకాయిలు చెల్లించక తప్పని పరిస్థితి.. అందుకే గత డిసెంబర్‌లో ఏకంగా 42 శాతం వరకు చార్జీలను పెంచేసిన సంస్థలు.. తాజా పరిణామాల నేపథ్యంలో రానున్న ఏడాది కాలంలో మరింత పెంపునకు సిద్ధం అవుతున్నాయి.

జియో రాక పూర్వం ఒక జీబీ డేటా వినియోగానికి రూ.200కుపైన ఖర్చు చేయాల్సిన పరిస్థితి. మోస్తరు కాల్స్‌ చేసుకునే వారు కూడా నెలకు రూ.200 వరకు వెచ్చించే వారు. కానీ, 2016లో జియో అడుగుపెట్టడంతో పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ప్రయోగాత్మకంగా 4జీ సేవలను ఉచితంగా ఆరంభించిన జియో భారీగా వినియోగదారులను సొంతం చేసుకుంది. డేటా, కాల్స్‌ను పరిమితి లేకుండా ఉచితంగా అందించి వినియోగాన్ని కొత్త పుంతలు తొక్కించింది. జియో దెబ్బకు రిలయన్స్‌ కమ్యూనికేషన్స్, ఎయిర్‌సెల్, టాటా డొకొమో, టెలినార్‌ ఇలా అందరూ దుకాణాలను మూతేసుకోవాల్సి వచ్చింది. మూడేళ్లలోనే జియో చందాదారుల సంఖ్యా పరంగా నంబర్‌ 1 స్థానానికి చేరుకుంది. జియో విధ్వంసాన్ని తట్టుకోలేక ప్రధాన టెలికం ప్లేయర్లు వొడాఫోన్‌ ఇండియా, ఐడియా సెల్యులర్‌ విలీనమైన వొడాఫోన్‌ ఐడియాగా అవతరించాయి.

చివరకు మూడు ప్రైవేటు సంస్థలు జియో, ఎయిర్‌టెల్, వొడాఫోన్‌ ఐడియా టెలికం మార్కెట్లో మిగిలాయి. ఇటీవలి సుప్రీంకోర్టు తీర్పు ప్రభావంతో గత 20 ఏళ్లకు సంబంధించి స్పెక్ట్రమ్, ఇతర బకాయిల రూపంలో టెల్కోలు ఇప్పుడు కేంద్రానికి రూ.1.47 లక్షల కోట్లను చెల్లించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎయిర్‌టెల్‌ రూ.35వేల కోట్లు, వొడాఫోన్‌ ఐడియా రూ.53 వేల కోట్ల వరకు చెల్లించాల్సి ఉంది. ఈ ప్రభావాన్ని అధిగమించేందుకు వాటి ముందున్న మార్గం చార్జీల పెంపే. అదే జరిగితే డేటాను పొదుపుగా వాడుకోవాల్సిన రోజులు మళ్లీ వచ్చేలా ఉన్నాయి. లేదంటే జేబు నుంచి మరింత ఖర్చు చేయక తప్పదు. రానున్న ఏడాది కాలంలో సగటు వినియోగదారు నుంచి వచ్చే నెలవారీ ఆదాయం(ఏఆర్‌పీయూ) రెట్టింపు కావచ్చని టెలికం కంపెనీలు అంచనాలు వేసుకుంటున్నాయి.

లాభాల్లోకి రావాలంటే పెంచాల్సిందే.. 
‘‘2020 చివరికి ఏఆర్‌పీయూ నెలకు కనీసం రూ.200 స్థాయికి, 2021 నాటికి కనీసం రూ.300కు చేరాల్సి ఉందన్న సంకేతాన్ని ఇచ్చాం. టారిఫ్‌ల పెంపు వినియోగాన్ని తగ్గించొచ్చేమో కానీ, సంఖ్యపై ప్రభావం చూపించదు’’ అని సెల్యులర్‌ ఆపరేటర్స్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా డైరెక్టర్‌ జనరల్‌ రాజన్‌ ఎస్‌ మాథ్యూస్‌ తెలిపారు. 2019 మార్చి నాటికి ఏఆర్‌పీయూ రూ.113 స్థాయిలో ఉంది. దీనిపై కంపెనీలకు 18 శాతం నష్టాలు వచ్చాయి. ఏఆర్‌పీయూ 77 శాతం పెరిగి రూ.200కు చేరుకుంటే అప్పుడు కంపెనీలు లాభాల్లోకి ప్రవేశిస్తాయి. ఆదాయంలో లాభాలు 10 శాతానికి చేరుకుంటాయని కంపెనీల అంచనా. ఇక ఏఆర్‌పీయూ రూ.300కు చేరుకుంటే కంపెనీల ఆదాయంలో పన్ను అనంతరం లాభాలు 30–40 శాతానికి విస్తరిస్తాయి. అయితే టెలికం నెట్‌వర్క్‌పై పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టాల్సి ఉన్నందున వాస్తవ లాభాలు తక్కువగానే ఉంటాయన్నది విశ్లేషణ. వచ్చే పలు త్రైమాసికాల్లో ఏఆర్‌పీయూ రూ.200కు, ఆ తర్వాత కొంత కాలానికి రూ.300కు చేరుకుంటుందని భారతీ ఎయిర్‌టెల్‌ విశ్లేషకులకు ఇప్పటికే తెలియజేయడం గమనార్హం. ముఖ్యంగా ఏజీఆర్‌ బకాయిల భారాన్ని వినియోగదారులకు బదిలీ చేసే పరిస్థితులు తేటతెల్లంగా కనిపిస్తున్నాయి. కానీ, మార్కెట్లోకి లేటుగా వచ్చిన జియోకు ఈ ఏజీఆర్‌ భారం ఏమీ లేకపోవడంతో.. టారిఫ్‌ల పెంపు రూపంలో ఆ సంస్థకు లాభాల వరద పారనుంది.

ఐడియా మూసేస్తే..
వొడా–ఐడియా ఒక్కో త్రైమాసికంలో రూ.6వేల కోట్లకు పైగా నష్టాలను ఎదుర్కొంటోంది. గత చార్జీల పెంపు సంస్థకు కలసి రాలేదు. పైగా కేంద్రానికి రూ.53 వేల కోట్ల వరకు కట్టాల్సి ఉంది. ప్రభుత్వం నుంచి ఉపశమనం రాకపోతే సంస్థను మూసేయక తప్పదని కుమారమంగళం బిర్లా బహిరంగంగానే సంకేతమిచ్చారు.  ఒకవేళ వొడా–ఐడియా దుకాణం బంద్‌ అయితే, ఈ సంస్థ చందాదారుల్లో (సుమారు 30 కోట్లు) కనీసం సగం మందిని అయినా సొంతం చేసుకోవడం ద్వారా 50 కోట్ల మార్క్‌ను అధిగమించాలని, 64.6 కోట్ల చందాదారుల లక్ష్యాన్ని చేరుకోవాలన్న ప్రణాళికలతో జియో సిద్ధంగా ఉందని తెలుస్తోంది. వొడా–ఐడియా నిష్క్రమణ చందాదారుల పరంగా అటు ఎయిర్‌టెల్‌ కూడా కలసి రానుంది. ప్రభుత్వరంగ బీఎస్‌ఎన్‌ఎల్‌ ఇప్పటికీ 4జీ సేవల్లో లేదు కనుక ఆ సంస్థకు వెళ్లే చందాదారులు తక్కువగానే ఉంటారని అంచనా.

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు