వచ్చే నెలలో మొబైల్‌ ట్రాకింగ్‌ వ్యవస్థ

9 Jul, 2019 13:14 IST|Sakshi

న్యూఢిల్లీ: దొంగతనానికి గురైన లేదా పోయిన మొబైల్‌ ఫోన్స్‌ ఆనవాళ్లు పట్టుకునేందుకు ఉపయోగపడే ట్రాకింగ్‌ విధానాన్ని ఆగస్టులో అందుబాటులోకి తేవాలని టెలికం శాఖ యోచిస్తోంది. మొబైల్‌ ఫోన్‌ నుంచి సిమ్‌ కార్డు తీసేసినా, ఐఎంఈఐ నంబరును మార్చేసినా కూడా ట్రాకింగ్‌ చేయగలిగేంత శక్తివంతంగా ఈ విధానం ఉంటుందని అధికారి ఒకరు తెలిపారు. సెంటర్‌ ఫర్‌ డెవలప్‌మెంట్‌ ఆఫ్‌ టెలిమాటిక్స్‌ (సీ–డాట్‌) ఇప్పటికే ఈ టెక్నాలజీని సిద్ధం చేసిందని, ఆగస్టు నుంచి సర్వీసులు ప్రారంభం కావొచ్చని ఆయన వివరించారు. ప్రస్తుత పార్లమెంటు సెషన్‌ ముగిశాక .. సేవల ఆవిష్కరణ కోసం మంత్రితో టెలికం శాఖ చర్చించనుందని పేర్కొన్నారు. నకిలీ హ్యాండ్‌సెట్స్, మొబైల్‌ దొంగతనాల సమస్యను అరికట్టేందుకు సెంట్రల్‌ ఎక్విప్‌మెంట్‌ ఐడెంటిటీ రిజిస్టర్‌ పేరిట ఏర్పాటైన మొబైల్‌ ఫోన్‌ ట్రాకింగ్‌ ప్రాజెక్టుకు కేంద్రం రూ. 15 కోట్లు కేటాయించింది.  

పనిచేసేదిలా..
సిమ్‌ కార్డు తీసేసినా, ఐఎంఈఐ నంబరును మార్చినా కూడా చోరీకి గురైనా లేదా పోయిన ఫోను ఇతరత్రా ఏ నెట్‌వర్క్‌పైనా పనిచేయకుండా చేయగలిగేలా సీఈఐఆర్‌ టెక్నాలజీ ఉంటుంది. అన్ని మొబైల్‌ ఆపరేటర్ల ఐఎంఈఐ డేటాబేస్‌ను ఇది అనుసంధానిస్తుంది. ఒకరకంగా బ్లాక్‌లిస్ట్‌లో ఉన్న మొబైల్‌ టెర్మినల్స్‌ వివరాలను నెట్‌వర్క్‌ ఆపరేటర్లు పరస్పరం ఇచ్చిపుచ్చుకునేందుకు ఇది ఒక కేంద్రీయ వ్యవస్థలా పనిచేస్తుంది. తద్వారా ఒక నెట్‌వర్క్‌ సేవలు అందిస్తున్న మొబైల్‌ ఫోన్స్‌ ఒకవేళ చోరీకి గురైన పక్షంలో .. మిగతా టెల్కోలు కూడా ఆ మొబైల్‌కు టెలికం సేవలు అందకుండా ఆపివేయొచ్చు. దీనిపై పైలట్‌ ప్రాజెక్టును మహారాష్ట్రలో నిర్వహించారు.

మరిన్ని వార్తలు