గుజరాత్‌ నర్మదా ఫర్టిలైజర్స్‌పై ‘టెలికం’ పిడుగు

3 Jan, 2020 08:34 IST|Sakshi

రూ.15వేల కోట్లు కట్టాలంటూ డిమాండ్‌ నోటీసు

న్యూఢిల్లీ: టెలికం కంపెనీలకు సంబంధించి సర్దుబాటు చేసిన స్థూల ఆదాయం (ఏజీఆర్‌)పై సుప్రీంకోర్టు తీర్పు తర్వాత టెలికం శాఖ మరింత చురుగ్గా వ్యవహరిస్తోంది. నాన్‌ టెలికం కంపెనీలకూ డిమాండ్‌ నోటీసులను పంపుతోంది. తాజాగా గుజరాత్‌ నర్మదా వ్యాలీ ఫర్టిలైజర్స్‌ అండ్‌ కెమికల్స్‌కు రూ.15,019 కోట్లు చెల్లించాలంటూ డిమాండ్‌ నోటీసు పంపించింది. జనవరి 23లోపు ఈ మొత్తాన్ని చెల్లించాలని టెలికం శాఖ కోరినట్టు గుజరాత్‌ నర్మదా ఫర్టిలైజర్స్‌ గురువారం వెల్లడించింది. కంపెనీ వీశాట్, ఐఎస్‌పీ లైసెన్స్‌లను కలిగి ఉండడంతో 2005–06 నుంచి 2018–19 వరకు కాలానికి ఈ మొత్తాన్ని చెల్లించాలని కోరినట్టు తెలిపింది. ‘‘డిమాండ్‌ నోటీసును, సుప్రీంకోర్టు తీర్పును అధ్యయనం చేస్తున్నాం.

న్యాయ నిపుణుల సూచనల మేరకు వ్యవహరిస్తాం’’ అని కంపెనీ పేర్కొంది. తాజా పరిణామంతో నాన్‌ టెలికం కంపెనీల నుంచి టెలికం శాఖ డిమాండ్‌ చేస్తున్న చెల్లింపుల మొత్తం రూ.3.13 లక్షల కోట్లకు చేరింది. భారతీ ఎయిర్‌టెల్, వొడాఫోన్‌ ఐడియా, ఇతర టెలికం కంపెనీలు రూ.1.47 లక్షల కోట్లను చెల్లించాలని ఇప్పటికే టెలికం శాఖ కోరింది. అంటే టెలికం కంపెనీలు చెల్లించాల్సిన మొత్తానికి నాన్‌ టెలికం కంపెనీల చెల్లింపులు రెట్టింపుగా ఉండడం ఆశ్చర్యకరం. ఇప్పటికే గెయిల్‌ నుంచి రూ.1.72 లక్షల కోట్లు, పవర్‌గ్రిడ్‌ నుంచి రూ.1.25 లక్షల కోట్ల బకాయిలకు టెలికం శాఖ డిమాండ్‌ నోటీసులు జారీ చేయడం గమనార్హం. ఇవి కూడా ఐపీ లైసెన్స్‌లు కలిగి ఉండడంతో, సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో టెలికం శాఖ ఈ చర్యలకు దిగింది. అయితే, ఎయిర్‌టెల్, వొడాఫోన్‌ ఐడియాలు తీర్పు పునఃసమీక్షకు పిటిషన్‌ దాఖలు చేయడం గమనార్హం.

మరిన్ని వార్తలు