కాల్డ్రాప్స్ పై ఫీడ్బ్యాక్ ప్లాట్ఫామ్: మనోజ్ సిన్హా

2 Nov, 2016 01:23 IST|Sakshi
కాల్డ్రాప్స్ పై ఫీడ్బ్యాక్ ప్లాట్ఫామ్: మనోజ్ సిన్హా

అవసరమైతే టెల్కోలపై కఠిన చర్యలు

 న్యూఢిల్లీ: కాల్ డ్రాప్స్ విషయంలో అవసరమైతే టెలికం ఆపరేటర్లపై చర్యలు తీసకుంటామని, జరిమానా సైతం విధిస్తామని ఆ శాఖ మంత్రి మనోజ్‌సిన్హా హెచ్చరించారు. కాల్స్ ఫెయిల్ అవడంపై వినియోగదారులు నేరుగా తమ అభిప్రాయాలను తెలియజేసేందుకు నెలరోజుల్లోపు ఓ ప్లాట్‌ఫామ్‌ను అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. రిలయన్స్ జియో నెట్‌వర్క్ నుంచి వచ్చే కాల్స్ కోసం తగినన్ని ఇంటర్ కనెక్షన్ పాయింట్లు సమకూర్చనందున భారీగా కాల్‌డ్రాప్స్ చోటు చేసుకున్న విషయం తెలిసిందే. ఇందుకు గాను భారతీ ఎయిర్‌టెల్, వొడాఫోన్, ఐడియాల నుంచి రూ.3,050 కోట్ల భారీ జరిమానా వసూలు చేయాలని ట్రాయ్ ఇప్పటికే టెలికం శాఖకు సూచించిన విషయం తెలిసిందే.

ట్రాయ్ సిఫారసులు తమకు చేరాయని, నిబంధనల ప్రకారం తాము ఎవరికైనా లెసైన్స్ జారీ చేస్తే వారు సేవలు అందిస్తారని, అలా అందేలా తాము చూస్తామని సిన్హా చెప్పారు. నియంత్రణపరమైన కార్యాచరణకు లోబడి సమస్యను పరిష్కరించుకోవాలని సూచించినట్టు టెలికం ఆపరేటర్లతో మంగళవారం సమావేశం అనంతరం మంత్రి మీడియాతో చెప్పారు. ఆపరేటర్ల మధ్య వివాదంతో వినియోగదారులు సమస్యలు ఎదుర్కోరాదన్నారు. దేశంలో కాల్ డ్రాప్స్ సమస్య అనేదే ఉండరాదన్నారు. ఈ విషయంలో జరిమానా మాత్రమే కాదని, అవసరమైతే ఇతర చర్యలు కూడా తీసుకుంటామని విలేకరుల ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.

>
మరిన్ని వార్తలు