మీ వ్యాపార ప్రణాళికలు చెప్పండి

27 Jan, 2016 00:44 IST|Sakshi
మీ వ్యాపార ప్రణాళికలు చెప్పండి

బ్యాంకులను కోరిన ఆర్థికమంత్రిత్వశాఖ
మరింత మూలధనం సమకూర్చడంపై కసరత్తు

 ముంబై: బ్యాంకులకు రానున్న మూడేళ్లలో తగిన మూలధన కల్పనపై ఆర్థికమంత్రిత్వశాఖ దృష్టి సారించింది. ఇందుకు అనుగుణంగా మదింపుజరపడానికి చర్యలు ప్రారంభించింది. వచ్చే నాలుగేళ్లలో తమ వాణిజ్య ప్రణాళికల గురించి తెలియజేయాలని  మొండిబకాయిల భారంతో ఉన్న బ్యాంకులను ఆర్థికమంత్రిత్వశాఖ ఆదేశించింది. బ్యాంకుల పునర్ వ్యవస్థీకరణకు సంబంధించి ‘ఇంద్రధనస్సు’ కార్యక్రమంలో భాగంగా ఆర్థికమంత్రిత్వశాఖ ఈ చర్యలు చేపట్టింది.

 మొండి బకాయిల సమస్య దిశగా చర్యలు చేపట్టాలని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) ఒకవైపు బ్యాంకింగ్‌కు నిర్దేశాలు జారీచేయగా... మరోవైపు ప్రభుత్వం తాజా వ్యాపార ప్రణాళికల గురించి మదింపు ప్రారంభించడం గమనార్హం. ఇందుకు సంబంధించి అత్యున్నత స్థాయి వర్గాలు అందించిన సమాచారాన్ని పరిశీలిస్తే...

 పలు బ్యాంకులు ఇప్పటికే తమ వ్యాపార, రుణ, వాణిజ్య ప్రణాళికను నార్త్ బ్లాక్‌కు అందించాయి. మిగిలిన వాటికి కూడా ఈ మేరకు ఆర్థికశాఖ ఆదేశాలు ఇచ్చింది.

వచ్చే నాలుగేళ్లలో రూ.70,000 కోట్లు బ్యాంకింగ్‌కు తాజా మూలధనంగా అందించాలన్నది కేంద్రం ప్రణాళిక. ప్రస్తుత, వచ్చే ఆర్థిక సంవత్సరాల్లో ఇందుకు రూ.25,000 కోట్ల చొప్పున  ఇవ్వాలన్నది ప్రతిపాదన. మిగిలిన రెండు ఆర్థిక సంవత్సరాల్లో రూ.10,000 కోట్ల చొప్పున ఇవ్వాలన్నది వ్యూహం. అయితే అవసరమైతే రూ. 70,000 మొత్తాన్ని మరింత పెంచాలని కేంద్రం వ్యూహ రచన చేస్తున్నట్లు వార్తలు వచ్చాయి. అలాంటి నిర్ణయం తీసుకుంటే వచ్చే నెలాఖరులో పార్లమెంటులో ప్రవేశపెట్టనున్న బడ్జెట్ సందర్భంగా ఈ విషయాన్ని వెలువరించే వీలుంది.

 వచ్చే నాలుగేళ్లలో బ్యాంకింగ్‌కు మూలధనంగా మొత్తం లక్షా ఎనభై కోట్ల రూపాయలు అవసరమవుతాయన్నది అంచనా.  ప్రభుత్వం సమకూర్చగా మిగిలిన మొత్తాలను మార్కెట్ నుంచి బ్యాంకులు సమకూర్చాలన్నది తొలుత వ్యూహం. అయితే మార్కెట్ల తీవ్ర ఒడిదుడుకుల నేపథ్యంలో మరికొంత మొత్తాన్ని ప్రభుత్వమే సమకూర్చాలని భావిస్తున్నట్లు ఆర్థికమంత్రిత్వశాఖ వర్గాలు వెల్లడించాయి. మూలధనానికి సంబంధించి అంతర్జాతీయ బాసెల్ 3 ప్రమాణాలను బ్యాంకింగ్ వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచీ అమలు పరచాల్సి ఉండడం కూడా ఇక్కడ గమనార్హం.

మరిన్ని వార్తలు