వండర్‌ ట్రక్‌ : 4 రోజుల్లో 1.87 లక్షల ఆర్డర్లు

25 Nov, 2019 12:33 IST|Sakshi

న్యూయార్క్‌ : టెస్లా సైబర్‌ట్రక్‌ అమ్మకాల్లో రికార్డు సృష్టిస్తోంది. ఈనెల 22న టెస్లా సైబర్‌ట్రక్‌ను లాంఛ్‌ చేయగా కేవలం నాలుగు రోజుల్లోనే 1.87 లక్షల ఆర్డర్లు వచ్చాయి. 2020లో టెస్లా ఉత్పత్తి ప్రారంభమవుతున్న ఈ ఎలక్ర్టిక్‌ పికప్‌ ట్రక్‌ మూడు వేరియంట్లలో లభిస్తుంది. లాంఛ్‌ సందర్భంగా వాహన పనితీరును పరీక్షిస్తున్న సమయంలో రాయి విసరడంతో వెహికల్‌ గ్లాస్‌ అద్దాలు బద్దలైనా రికార్డుస్ధాయిలో ఆర్డర్లు వెల్లువెత్తడం గమనార్హం.

సైబర్‌ట్రక్‌ కోసం నాలుగు రోజుల్లో ఏకంగా 1.87 లక్షల ఆర్డర్లు వచ్చాయని టెస్లా సీఈఓ ఎలన్‌ మస్క్‌ ట్వీట్‌ చేశారు. వీటిలో 42 శాతం కస్టమర్లు డ్యూయల్‌, 41 శాతం ట్రై మోటార్‌, 17 శాతం మంది సింగిల్‌ మోటార్‌ వేరియంట్స్‌ను బుక్‌ చేసుకున్నారని వెల్లడించారు. ఎలాంటి ప్రకటనలు, ప్రోత్సాహకాలు లేకుండానే ఈ ఆర్డర్లు దక్కాయని చెప్పారు. ఇక టెస్లా సైబర్‌ ట్రక్‌ సింగిల్‌ మోటార్‌ ధర రూ 30లక్షలు కాగా, డ్యూయల్‌, ట్రై వేరియంట్లు వరుసగా రూ 37.45 లక్షలు, రూ 52.42 లక్షలకు అందుబాటులో ఉంటాయి. సెల్ప్‌ డ్రైవింగ్‌ ఆప్షన్‌ కోసం అదనంగా రూ 5 లక్షలు వెచ్చించాల్సి ఉంటుంది.

చదవండి : నిజంగానే కారు అద్దం పగిలింది

>
మరిన్ని వార్తలు