టెస్లా షేరు జెట్‌ స్పీడ్‌- ఎందుకంట?

14 Jul, 2020 12:41 IST|Sakshi

సోమవారం ఒక దశలో 16 శాతం జూమ్‌

321 బిలియన్‌ డాలర్లకు మార్కెట్‌ విలువ

టాప్‌-10 కంపెనీల జాబితాలో చోటు

చివరికి 3% నష్టంతో ముగిసిన షేరు

త్వరలో ఎస్‌అండ్‌పీ-500 ఇండెక్స్‌లోకి!

కోవిడ్‌-19 కష్టకాలంలోనూ గ్లోబల్‌ ఆటో దిగ్గజం టెస్లా ఇంక్‌ షేరు లాభాలతో కదం తొక్కుతోంది. అమెరికాలో లిస్టయిన ఎలక్ట్రిక్ కార్ల ఈ స్పెషలిస్ట్‌ కంపెనీ షేరు పలు రికార్డులు సృష్టించడం ద్వారా ఇటీవల తరచుగా వార్తలకెక్కుతోంది. ఇందుకు యూఎస్‌లోని పలు రాష్ట్రాలలో లాక్‌డవున్‌లు కొనసాగుతున్నప్పటికీ వాహన విక్రయాలను పెంచుకోగలగడం, ఎస్‌అండ్‌పీ ఇండెక్స్‌లో చోటు లభించనున్న అంచనాలు వంటి అంశాలు దోహదం చేస్తున్నట్లు విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఇతర వివరాలు చూద్దాం..

జోరు తీరు
సోమవారం నాస్‌డాక్‌, ఎస్‌అండ్‌పీ ఇండెక్సులు 2-1 శాతం మధ్య వెనకడుగు వేయగా.. టెస్లా ఇంక్‌ షేరు 3 శాతం క్షీణించి 1497 డాలర్ల వద్ద ముగిసింది. అయితే తొలుత 16 శాతం దూసుకెళ్లింది. 1795 డాలర్లకు చేరింది. ఇది సరికొత్త గరిష్టంకాగా..  దీంతో కంపెనీ మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌(విలువ) 321 బిలియన్‌ డాలర్లను తాకింది. తద్వారా అమెరికా స్టాక్‌ మార్కెట్లలో లిస్టయిన టాప్‌-10 కంపెనీల జాబితాలో చోటు సాధించింది. అంతేకాకుండా మార్కెట్‌ విలువలో ఎఫ్‌ఎంసీజీ దిగ్గజం ప్రాక్టర్‌ అండ్‌ గ్యాంబుల్‌(పీఅండ్‌జీ)ను వెనక్కి నెట్టింది. అయితే చివర్లో అమ్మకాలు ఊపందుకుని చతికిలపడటంతో మార్కెట్‌ విలువ దాదాపు 278 బిలియన్‌ డాలర్లకు దిగివచ్చింది.

200 శాతం
ఈ ఏడాది ఇప్పటివరకూ టెస్లా ఇంక్‌ షేరు 200 శాతం దూసుకెళ్లింది. ఈ నెల(జులై)లోనే 38 శాతం లాభపడింది. ఈ బాటలో మార్కెట్‌ విలువరీత్యా జులై మొదటి వారంలో జపనీస్‌ ఆటో దిగ్గజం టయోటాను అధిగమించిన విషయం విదితమే.  ఇందుకు ప్రధానంగా ఏప్రిల్‌-జూన్‌(క్యూ2) కాలంలో అంచనాలను మించుతూ 90,650 కార్లను విక్రయించడం ప్రభావం చూపింది. మోడల్‌ 3, మోడల్‌ Y కార్లు ఇందుకు సహకరించినట్లు నిపుణులు పేర్కొన్నారు. అంతక్రితం జనవరి-మార్చిలో 72,000 వాహనాలు విక్రయించగా.. పరిశ్రమవర్గాలు 83,000 వాహన అమ్మకాలను అంచనా వేశాయి. కాగా.. మరోపక్క ఎస్‌అండ్‌పీ-500 ఇండెక్స్‌లో టెస్లా ఇంక్‌ షేరుకి త్వరలో చోటు లభించనున్న అంచనాలు పెరుగుతున్నట్లు విశ్లేషకులు తెలియజేశారు. దీంతో ఇన్వెస్టర్లు కంపెనీ ఫండమెంటల్స్‌కు మించి స్పెక్యులేటివ్‌గా పొజిషన్లు తీసుకుంటున్నట్లు బేర్‌ ట్రాప్స్‌ రిపోర్ట్‌ ఎడిటర్‌ లారీ మెక్‌డొనాల్డ్‌ పేర్కొన్నారు. ఎస్‌అండ్‌పీలో చోటు లభిస్తే ఈటీఎఫ్‌, ఇండెక్స్‌ ఫండ్స్‌ తదితర మరిన్ని సంస్థలు కంపెనీలో ఇన్వెస్ట్‌ చేయవలసి ఉంటుందని తెలియజేశారు. ఈ నేపథ్యంలో ఇటీవల టెస్లా ఇంక్‌ షేరు దూకుడు చూపుతున్నట్లు విశ్లేషించారు.

అంచనాలు అధికం
గతేడాది టెస్లా దాదాపు 25 బిలియన్‌ డాలర్ల ఆదాయాన్ని సాధించింది. ఈ బాటలో ఇటీవల వాహన విక్రయాలు పెరుగుతున్న కారణంగా మరింత మెరుగైన ఫలితాలు సాధించగలదన్న అంచనాలు బలపడుతున్నాయి. దీంతో 2025కల్లా కంపెనీ ఆదాయం 100 బిలియన్‌ డాలర్లను తాకవచ్చని జేఎంపీ సెక్యూరిటీస్‌ నిపుణులు జో ఓషా అంచనా వేశారు.  అయితే టెస్లా ఇంక్‌ షేరుకి జో వేసిన 1500 డాలర్ల టార్గెట్‌ను ఇప్పటికే అధిగమించడం గమనార్హం! కంపెనీ ఏప్రిల్‌-జూన్‌ ఫలితాలను ఈ నెల 22న వెల్లడించనుంది. లాక్‌డవున్‌ కారణంగా గ్లోబల్‌ ఆటో కంపెనీలు జనరల్‌ మోటార్స్‌, టయోటా, ఫియట్‌ క్రిస్లర్‌, ఫోర్డ్‌ వంటి కంపెనీల అమ్మకాలు నీరసిస్తున్నట్లు నిపుణులు తెలియజేశారు. అయితే టెస్లాను పూర్తిస్థాయి ఆటో దిగ్గజ కంపెనీలతో పోల్చడం సరికాదని ఈ సందర్భంగా పరిశ్రమవర్గాలు తెలియజేశాయి.

మరిన్ని వార్తలు