బంధన్ బ్యాంక్ మొదలైంది..

24 Aug, 2015 01:50 IST|Sakshi
బంధన్ బ్యాంక్ మొదలైంది..

24 రాష్ట్రాల్లో 501 శాఖలు, 50 ఏటీఎంలతో కార్యకలాపాలు షురూ...
♦ {పారంభించిన ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ
♦ 1.43 కోట్ల ఖాతాలు; రూ.10 వేల కోట్ల లోన్ బుక్
 
 కోల్‌కతా : దేశీ బ్యాంకింగ్ రంగంలో కొత్తగా మరో పూర్తిస్థాయి వాణిజ్య బ్యాంక్ ఆవిర్భవించింది. కోల్‌కతా ప్రధాన కేంద్రంగా బంధన్ బ్యాంక్ అరంగేట్రం చేసింది. ఆదివారమిక్కడ ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ దీన్ని ప్రారంభించారు. దేశవ్యాప్తంగా 24 రాష్ట్రాల్లో తొలివిడతగా 501 శాఖలు, 2022 సర్వీస్ సెంటర్లు, 50 ఏటీఎంలతో సేవలను కార్యకలాపాలను మొదలుపెట్టినట్లు బంధన్ బ్యాంక్ వెల్లడించింది. 1.43 కోట్ల ఖాతాలు, రూ.10,500 కోట్ల లోన్ బుక్ కలిగిన తమ బ్యాంకులో ప్రస్తుతం 19,500 మంది ఉద్యోగులు ఉన్నట్లు తెలిపింది.

ఈ ఆర్థిక సంవత్సరం(2015-16) చివరికల్లా 27 రాష్ట్రాల్లో మొత్తం 672 శాఖలు, 250 ఏటీఎంలు ఉండేవిధంగా ప్రణాళికలు రూపొందించినట్లు కూడా వివరించింది. తమ శాఖల్లో 71 శాతం గ్రామీణ భారత్‌లోనే ఉంటాయని, ఇందులో కనీసం 35 శాతం బ్యాంకింగ్ సేవలులేని మారుమూల ప్రాంతాల్లో తెరవనున్నట్లు బంధన్ బ్యాంక్ పేర్కొంది. కాగా, ఈ బ్యాంకులో మైక్రో, జనరల్ బ్యాంకింగ్ అనే రెండు విభాగాలు ఉంటాయి. సేవింగ్స్ ఖాతాలు, పలు రకాల రుణాలతో పాటు పూర్తిస్థాయిలో రిటైల్ ఫైనాన్షియల్ సేవలను బ్యాంక్ అందించనుంది. ప్రస్తుతం ప్రారంభించిన శాఖల్లో అత్యధికంగా 220 పశ్చిమ బెంగాల్‌లోనే ఉండటం గమనార్హం. ఆ తర్వాత స్థానాల్లో బిహార్(67), అస్సాం(60), మహారాష్ట్ర(21), ఉత్తరప్రదేశ్(20), త్రిపుర(20), జార్ఖండ్(15)లు ఉన్నాయి.

 బెంగాల్ ఎంట్రప్రెన్యూర్స్‌కు బూస్ట్: జైట్లీ
 ‘ఎందరో గొప్ప మేధోసంపన్నులను పశ్చిమ బెంగాల్ ప్రపంచానికి అందించింది. అయితే, ఇక్కడి నుంచి పేరుప్రఖ్యాతులు దక్కించుకున్న ఔత్సాహిక వ్యాపార, పారిశ్రామికవేత్తలు(ఎంట్రప్రెన్యూర్స్) ఎవరూ లేరు. బంధన్ బ్యాంక్ ఆరంభం బెంగాల్ ఎంట్రప్రెన్యూర్స్‌కు ఉత్సాహం ఇవ్వడమే కాకుండా, ఈ రాష్ట్రానికి ఎంట్రప్రెన్యూర్స్ తిరిగివచ్చేందుకు కూడా తోడ్పడుతుంది’ అని బ్యాంక్ ప్రారంభం సందర్భంగా ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ వ్యాఖ్యానించారు. లక్షల సంఖ్యలో ఉన్న చిన్న, మధ్యస్థాయి ఎంట్రప్రెన్యూర్స్(ఎస్‌ఎంఈ)కు బంధన్ బ్యాంక్ నిధులను అందించనుందని, దీనివల్ల భారీగా ఉద్యోగాలను కల్పించేందుకు దోహదం చేస్తుందని ఆయన పేర్కొన్నారు.

‘చాలావరకూ ఎస్‌ఎంఈలు సంఘటిత రంగంలోనే ఉన్నాయి. ఇప్పుడు వీటికి ఆర్థికంగా చేదోడుగా నిలిచేందుకు బంధన్ బ్యాంక్ వంటి కొత్తతరం ప్రైవేటు సంస్థలు ముందుకొస్తున్నాయి. చిన్న వ్యాపారవేత్తలను మరింతగా ప్రోత్సహించగలిగితే దేశంలో పేదరికాన్ని నిర్మూలించేందుకు కూడా వీలవుతుంది’ అని జైట్లీ వ్యాఖ్యానించారు. ఈ కార్యక్రమంలో ఆర్‌బీఐ డిప్యూటీ గవర్నర్ హెచ్‌ఆర్ ఖాన్, బంగ్లాదేశ్ సెంట్రల్ బ్యాంక్ గవర్నర్ అతియుర్ రెహ్మాన్, ఎల్‌ఐసీ చైర్మన్ ఎస్‌కే రాయ్, ఐటీసీ చైర్మన్ వైసీ దేవేశ్వర్, బీఎస్‌ఈ సీఈవో ఆశిష్ కుమార్ చౌహాన్, ఎన్‌ఎస్‌ఈ చీఫ్ చిత్రా రామకృష్ణన్, కోటక్ మహీంద్రా బ్యాంక్ ఎండీ ఉదయ్ కోటక్, ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్(ఐబీఏ) చైర్మన్ అరుణ్ కౌల్, పశ్చిమ బెంగాల్ ఆర్థిక మంత్రి అమిత్ మిత్రా పాల్గొన్నారు.
 మా సిద్ధాంతం కస్టమర్ ఫస్ట్: బంధన్ బ్యాంక్ చీఫ్
 ‘ఒక యూనివర్సల్ బ్యాంక్‌గా చిన్న, పెద్ద ఖాతాదారులందరినీ ఒకేవిధంగా చూస్తాం. ‘కస్టమర్ ఫస్ట్’ అనేది మా వ్యాపార సిద్ధాంతం కూడా. దేశ ప్రజల బ్యాంకింగ్ అవసరాలను తీర్చేందుకు మా బంధన్ బ్యాంకు పరివారమంతా పునరంకితమవుతున్నాం. అంతేకాదు దేశీ బ్యాంకింగ్ పరిశ్రమలో కొత్త అధ్యాయాన్ని లిఖించేందుకు కట్టుబడి ఉన్నాం’ అని బ్యాంక్ ప్రారంభం సందర్భంగా సంస్థ వ్యవస్థాపకుడు, ఎండీ, సీఈవో చంద్రశేఖర్ ఘోష్ పేర్కొన్నారు. కాగా, సేవింగ్స్ బ్యాంక్ ఖాతాదారులకు రూ. లక్ష వరకూ బ్యాలెన్స్‌పై 4.25 శాతం వడ్డీని, లక్షపైబడిన బ్యాలెన్స్‌కు 5 శాతం చొప్పున వడ్డీని బంధన్ బ్యాంక్ ఖరారు చేసింది. ఇక టెర్మ్ డిపాజిట్లపై(1-3 ఏళ్లు) గరిష్టంగా 8.5 శాతం వడ్డీని ఆఫర్ చేస్తోంది. సీనియర్ సిటిజన్లకు మరో అర శాతం అధికంగా లభిస్తుంది.

 2001లో మైక్రోఫైనాన్స్ సంస్థగా కార్యకలాపాలు ప్రారంభించిన బంధన్.. 2006లో బ్యాంకింగేతర ఫైనాన్స్ కంపెనీ(ఎన్‌బీఎఫ్‌సీ)గా మారింది. 2014 ఏప్రిల్‌లో బంధన్‌తో పాటు ఐడీఎఫ్‌సీ బ్యాంకులకు ఆర్‌బీఐ సూత్రప్రాయ ఆమోదం తెలిపింది. ఈ ఏడాది జూన్‌లో తుది లెసైన్స్ మంజూరు చేసింది. 2004లో యస్ బ్యాంక్ ఆవిర్భావం తర్వాత మళ్లీ భారత్‌లో కార్యకలాపాలు మొదలుపెట్టిన పూర్తిస్థాయి(యూనివర్సల్) వాణిజ్య బ్యాంకు బంధన్ కావడం గమనార్హం.

భారత్‌లో మైక్రోఫైనాన్స్ కంపెనీ నుంచి పూర్తిస్థాయి బ్యాంకింగ్ సంస్థగా రూపాంతరం చెందుతున్నది కూడా ఇదే. ప్రస్తుతం దేశీ బ్యాంకింగ్ పరిశ్రమ విలువ 2 ట్రిలియన్ డాలర్లు(దాదాపు రూ. 130 లక్షల కోట్లు)గా అంచనా. 2024-25కల్లా ఇది 28.5 ట్రిలియన్ డాలర్లకు చేరుతుందని విశ్లేషకులు లెక్కగడుతున్నారు. ప్రస్తుతం దేశంలో 46 వాణిజ్య బ్యాంకులు పనిచేస్తున్నాయి.
 
 కొత్త సర్కారు.. కొత్త బ్యాంకు!
 ‘కోల్‌కతా నగరం గతంలో ఎరుపు రంగును పులుముకుంటే.. ఇప్పుడు నీలవర్ణాన్ని సంతరించుకుంది. ఈ కొత్త మార్పును అందిపుచ్చుకున్న కోల్‌కతా దేశంలో ఒక సరికొత్త బ్యాంకు(బంధన్)కు జన్మనిచ్చింది. ఎర్ర రంగు ఉన్నప్పుడు కొత్త సంస్థలేవీ ఆవిర్భవించలేదు. ఉన్నవి కూడా ఇతర చోట్లకు తరలిపోయాయి. బంధన్ బ్యాంక్ ఆవిర్భావం బంగ్లా ఎంట్రప్రెన్యూర్‌కు నిజంగా కొత్త జన్మ కిందే లెక్క’ అని జైట్లీ పేర్కొన్నారు. గతంలో పశ్చిమ బెంగాల్‌ను పాలించిన వామపక్షాలనుద్దేశించి ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

లెఫ్ట్ పార్టీల నుంచి తృణమూల్ కాంగ్రెస్ అధికారాన్ని హస్తగతం చేసుకోవడాన్ని ప్రస్తావిస్తూ.. ఈ రంగు మార్పును జైట్లీ పేర్కొన్నారు. కాగా, రాజకీయంగా ఎన్ని విభేదాలున్నా పశ్చిమ బెంగాల్ అభివృద్ధికి కేంద్రం అన్నిరకాలుగా చేయూతనందిస్తుందని స్పష్టం చేశారు.

మరిన్ని వార్తలు